‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్Edari Varsham-2 (edited)యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా ఎల్లలులేని విధంగా ఉంటుంది. పాఠకుడికి-రచయితకూ మధ్య ఉన్న అప్రకటిత నిశ్శబ్ధ అనుబంధం లాంటి జంట సంభాషణలాగా గడిచిపోతుంది. కానీ సినిమా అలాకాదు. అదొక పరిమితమైన దృశ్య మాధ్యమం. దానికి ఫ్రేములుంటాయి. సింటాక్స్ పరిథి ఉంటుంది. ఎల్లలు చాలా ఉంటాయ్. నటీనటులు, లొకేషన్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, బడ్జెట్ ఇలా  పరిమితులు చాలా అధికంగా ఉంటాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీలైనంత అధిగమిస్తూ, రచయిత ఇచ్చిన కథలోంచీ ఒక అంగీకారాత్మక భాష్యాన్ని స్క్రీన్-ప్లే గా కుదించి సినిమాగా తియ్యాలి. కొన్ని కొన్ని సార్లు సినిమా కథకన్నా గొప్పగా తయారవ్వొచ్చు. ఒక్కోసారి కథకన్నా వేరేగానూ తయారు కావచ్చు. చాలా వరకూ కూసింత కథ చదివిన పాఠకుడిని, సినిమా చూసే ప్రేక్షకుడినీ నిరాశపరచొచ్చు. దీనికి గల కారణాలు మాధ్యమాల మార్పు కొంత అయితే, రచనని విజువల్ లాంగ్వేజ్ లోకి మార్చలేని ఫిల్మ్ మేకర్స్ విజన్ కొరత మరింత.

సత్యజిత్ రే లాంటి ఫిల్మ్ మేకర్ బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవలను  పథేర్ పాంచాలి గా తీసినప్పుడు “అబ్బే నవల లాగా లేదు” అన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి సమాధానంగా సత్యజిత్ రే భాషాపరమైన లేదా రచనపరమైన సింటాక్స్ కి ,సినిమాటిక్ లాంగ్వేజ్ కీ మధ్య తేడాలను ఉంటంకిస్తూ పెద్ద వ్యాసమే రాయాల్సి వచ్చింది. అయినా తిట్టేవాళ్ళు తిట్టారు, అర్థం చేసుకున్నవాళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ అటు నవల ,ఇటు సినిమా రెండూ క్లాసిక్స్ గా మనం చదువుతున్నాం, చూస్తున్నాం. అందరూ సత్యజిత్ రేలు కాకపోయినా, సాహిత్యం నుంచీ సినిమాతీసే అందరు ఫిల్మ్ మేకర్స్ ఫేస్ చేసే సమస్యే ఇది.

తెలుగు ఇండిపెండెంట్ సినిమా గ్రూప్ సాహిత్యం నుంచీ కథను ఎన్నుకుని లఘుచిత్రం చేద్దాము అనుకున్నప్పుడు మొదట ప్రతిపాదించబడ్డ కథల్లో చలం, బుచ్చిబాబు, తిలక్ కథలు ఉన్నాయి. రిసోర్సెస్ పరంగా మాకున్న లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని కొద్ది పాత్రలతో మానవీయ కోణాన్ని ఆ రచయిత గొప్పతనాన్ని షోకేస్ చెయ్యగల కథకోసం వెతకగా ఫైనల్ చేసిన కథ “ఊరిచివర ఇల్లు”. కథని యథాతథం గా  తీద్దామా, అడాప్ట్ చేసుకుందామా అనే ప్రశ్న అస్సలు ఉదయించలేదు. ఎందుకంటే స్క్రీన్-ప్లే అనేది అనుసరణే అవుతుంది తప్ప కథానువాదం కానేరదు. నాతోపాటూ మరో ముగ్గురు రచయితలు వారి వారి వర్షన్స్ లో స్క్రీన్-ప్లే రాశారు. గ్రూప్ గా స్క్రీన్ ప్లే మీద చర్చ జరిగినప్పుడు నా వర్షన్ ని సినిమా తియ్యడానికి ఎంచుకోవడం జరిగింది.

“ఊరిచివరి ఇల్లు” కథ జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథ.

తిలక్ “ఊరిచివరి ఇల్లు” కథని అడాప్ట్ చేసుకుని  రాస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే రచయితగా నాకు మూడు విషయాలు పొసగలేదు. ఒకటి, రమ జగన్నాథానికి తనకు ప్రేమలో జరిగిన దురదృష్టం, ఆతర్వాత నమ్మిన పెద్దమనిషి చేసిన మోసం, ఇప్పుడు అవ్వ పంచన బ్రతుకుతున్న వైనం చెప్పేస్తే రమ ఒక వేశ్య అనే విషయం ఆల్రెడీ సజెస్ట్ అయిపోయిన భావన కలుగుతోంది. ముఖ్యంగా రమ పాత్రలోని సంశయం, మాటిమాటికీ రమ జగన్నాథం తో(సినిమాలో శేఖరం అయ్యాడు) ‘ఇంకేమీ అడక్కండీ’ అంటూ ఏడవటం చాలావరకూ ‘giving away’ ఫీలింగునే కలిగించాయి. పైగా కథాకాలం ప్రకారం చూస్తే ఆరంభంలో వచ్చే ఇంటి సెటప్ వర్ణన ‘సానెకొంప’ అనే విషయాన్ని అన్యాపదేశంగా రచయిత సజెస్ట్ చేసిన భావన కలిగింది. ఇలా రివీల్ అయిపోతే జగన్నాథం షాక్ కి విలువ తగ్గిపోతుంది. అంతేకాక దాన్ని విజువల్ గా చూపించాలంటే లాంగ్ షాట్లో వర్షం కురుస్తుండగా ఇంటిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి. అది కొంచెం కష్టమే అనిపించింది.  కాబట్టి తండ్రి గురించి చెప్పే విషయాలనుంచీ పెద్దమనిషి చేసిన మోసం వరకూ కొంత కన్సీల్ చేసేస్తే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగా ఉంటుందనిపించి దాన్ని తీసేశాను. షూటింగ్ సౌలభ్యం కోసం వర్షం ఎఫెక్ట్ లో ఉన్న ఇంటి ఇంటీరియర్లో ఆరంభపు సీన్ కానిచ్చేశాను.

రెండోది రమ-జగన్నాథం లు ఆ రాత్రి ప్రేమించుకున్నారా లేదా అనేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటం, ప్రేమను తెలుపుకోవడం వరకూ చాలా క్లియర్గా కథలో ఉంది. కానీ ఇద్దరిమధ్యా భౌతికమైన కలయిక జరిగినట్టు కథలో సజెస్ట్ చేశారని నాకు అనిపించిందేతప్ప జరిగినట్టు ఖచ్చితంగా చెప్పలేము. జగన్నాథం అవ్వమాటలకు అంతగా గాయపడాలన్నా, రమ తనని అంతగా మోసం చేసిందని అనుకోవాలన్నా,‘అమ్మాయి అంతగా నచ్చిందా’ అని అవ్వ ప్రశ్నించాలన్నా వీటన్నిటీకీ ఒక బలమైన ఫౌండేషన్ కావాలి. అది కేవలం ప్రేమ వెలిబుచ్చుకుంటే రాదు. ప్రేమించుకుంటేనే (through making love) వస్తుంది. తిలక్ గారు కూడా ఒక దగ్గర రమకు ఆవరించిన ఆవేశాన్ని, కమ్మిన మైకాన్ని గురించి చెబుతూ తన సెక్సువల్ అగ్రెషన్ ని చూపిస్తాడు. రమ ముద్దులు పెడుతుంటే ఊపిరాడక జగన్నాథం చేత “అబ్బ వదులు-వదులు రమా” అనిపించాడు. ఆ తరువాత రమ తయారైన తీరు గురించి వర్ణన, ఆపైన ఇద్దరి మధ్యా నడిచే రొమాన్స్ చెప్పకనే వారి కలయిక గురించి సజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా “ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సుయొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెలుచుకుంటూన్నట్టనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్టు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి వెయ్యిరేకుల పద్మంలా విరిసింది” అనే వాక్యాలు ఎంత బలీయంగా సెక్సువల్ రెఫరెన్సెస్ అనిపిస్తాయి అనడం నా interpretation కి మూలం. అందుకే స్క్రీన్ ప్లే లో నేను లిబర్టీ తీసుకుని వాళ్ళమధ్య ప్రేమ జరిగినట్టు రాశాను. ఒక పాటనేపధ్యంలో వాళ్ల మధ్య రొమాన్స్ కూడా తీశాం.

తిలక్ గారి మనవరాలు నిషాంతి ఒక నటి. ఎల్.బి.డబ్లు అనే తెలుగు సినిమాలో నటించింది. రమ పాత్రను తనైతే బాగుంటుంది, పైగా తిలక్ కథలో తిలక్ మనవరాలు నటిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అడగటం, స్క్రిప్టు పంపడం, చర్చించడం జరిగింది. తను కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయింది. కానీ స్క్రిప్టు చదివాక తను అన్న మాట “మీరు తిలక్ కథకి చలం స్క్రీన్ ప్లే రాశారనిపించింది” అని. బహుశా అది నేను చేసిన ఈ మార్పుని ఉద్దేశించో లేక నేను చెప్పబోయే మరో మార్పు గురించో మాత్రం తెలియలేదు. కాస్త సంతోషంగా మాత్రం అనిపించింది.

అవ్వ లేనిపోని అపోహల్ని జగన్నాథం లో కల్పించడం, నిద్రపోతున్న రమకు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా జగన్నాథం పర్సు పరుపు మీద పడేసి వెళ్ళిపోవడం. నిద్రలేచి విషయం తెలుసుకున్న రమ పర్సుపట్టుకుని పరుగెత్తడం. కదులుతున్న ట్రైన్ లో ఉన్న జగన్నాథానికి పర్సు అందించడం. ఆ పర్సులో చూసుకున్న జగన్నాథం డబ్బులు అన్నీ ఉండి కేవలం తన ఫోటో లేకపోవడం తరువాత కథలో జరిగే పరిణామాలు. ఫోటోలేని పర్సుని చూసి జగన్నాథం రమ డబ్బుకోసం తనని మోసం చెయ్యలేదు అనే గ్రహింపుకు వస్తే, ఇమ్మీడియట్ గా చైన్ అన్నా లాగి బండిని ఆపెయ్యాలి లేదా తరువాతి స్టేషన్లో దిగన్నా రావాలి. కథలోలాగా ఆ పాయింట్లో ముగిస్తే సినిమా చాలా అసంపూర్ణంగా ఉంటుంది. పైగా, ముసలిది చెప్పిన కొన్ని అబద్ధాల్ని నమ్మి ప్రేమించానని కన్ఫెస్ చేసిన ఇతగాడు, నిద్రపోతున్న రమని లేపి కనీసం “ఎందుకిలా మోసం చేశావ్” అని ప్రశ్నించకుండా అనుమానపడి పర్సు పరుపుమీద పడేసి వెళ్ళిపోతాడు. అట్లాటోడు తిరిగొస్తేమాత్రం రమకు ఏమిటి సుఖం? ఎంతవరకూ అలాంటివాడి ప్రేమ నిలబడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే శేఖరం(జగన్నాథం) పాత్రని అప్రస్తుతం చేసి (కనీసం చూపించనైనా చూపించకుండా) రమ- శేఖరం కోసం ట్రెయిన్ వెంబడి పరుగులెత్తి అలసి సొలసి ప్లాట్ ఫాం మీద పడిపోవడంతో ముగించి చివరగా “జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. ఏం కోల్పోయామో ఎప్పటికీ తెలుసుకోలేని వాళ్ళు శాపగ్రస్తులు” అంటూ శేఖరం ని శాపగ్రస్తుడిని చేసి వదిలేశాను. కథను అభిమానించిన చాలా మందికి ఈ ముగింపు నచ్చలేదు. కథలో ఉన్న హెవీనెస్ ఫిల్మ్ లో రాలేదన్నారు. అలా అన్న కొందరికి నేను చెప్పిన సమాధానం “ఒక ఫెమినిస్టుగా ఆ ముగింపు నాకు నచ్చలేదు. అందుకే కొంత మార్చాను” అని.

ఛివరిగా శీర్షిక గురించి. స్క్రిప్టు మొత్తం రాసేసరికీ కథ ధృక్కోణం తిలక్ గారి కథలోలాగా కాకుండా వేరేగా కనిపించడం మొదలయ్యింది. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథలాగా కాకుండా, వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలాంటి రమ జీవితంలో శేఖర్/జగన్నాథం ఒక తొలకరిజల్లులా కురిసి కనీసం తడి ఆనవాలు కూడా లేకుండా ఇగిరిపోయి, రమను మళ్ళీ ప్రేమకోసం అలమటించేలా వదిలేసిన ఒక శాపగ్రస్తుడి కథలాగా అనిపించింది. ఇందులో జరిగిన ఘటన ప్రముఖం. రమ ప్రేమ అనిర్వచనీయం. ఉన్నతం. శేఖరం ఉనికి అంత ఉదాత్తమైన ప్రేమకు అర్హం కాని దయనీయం. అందుకే లఘుచిత్రం “ఎడారి వర్షం” అయ్యింది.

STORY

FILM
Part1

Part 2

మీ మాటలు

  1. తిలక్ గారి మనవరాలు నిషాంతి…ఇంటరెస్టింగ్!
    “… వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలాంటి రమ జీవితంలో శేఖర్/జగన్నాథం ఒక తొలకరిజల్లులా కురిసి కనీసం తడి ఆనవాలు కూడా లేకుండా ఇగిరిపోయి, రమను మళ్ళీ ప్రేమకోసం అలమటించేలా వదిలేసిన ఒక శాపగ్రస్తుడి కథలాగా అనిపించింది.” వావ్!

  2. మహేష్ కుమార్ గారూ,
    “పాఠకుడికి-రచయితకూ మధ్య ఉన్న అప్రకటిత నిశ్శబ్ధ అనుబంధం లాంటి జంట సంభాషణలాగా గడిచిపోతుంది.” దీనికి అదనంగా ఒక మంచి కథకుడి కథనం చదువుతున్నప్పుడు కళ్ళముందు ఒక దృశ్యకావ్యం కదులుతుందని అనుకుంటాను మనసులో ఒకపక్క రచయితతో ఏకీభవించడం, విభేదించడం వంటి analysis జరుగుపోతున్నప్పటికీ. బహుశా ప్రతి పాఠకుడూ అలా తన కళ్ళముందు కదలాడిన చిత్రానికీ, అది సినిమాగా తీసినప్పుడు కళ్ళముందు కనిపించే చిత్రానికీ ఉన్న తేడాని బట్టి అతనికి ఆ సినిమా నచ్చడమూ నచ్చకపోవడమూ ఉంటాయేమో! ఏది ఏమైనా ఊరి చివరి ఇల్లు ని ఎడారి వర్షంగా చెయ్యడంలో మీ అంతర్యం బాగుంది. అభినందనలు.

    • @ns murty:నిజమే మంచి కథ చదువుతుంటే అది కళ్ళముందు కదుల్తుంది. కానీ ఏ ఒక్క పాఠకుడి విజన్ మరో పాఠకుడికిమల్లే ఉండది. అందుకే అది పర్సనల్. కానీ సినిమా తియ్యాలంటే అది ఒకరి విజన్ ను విజువల్ చేసి తెరకెక్కించడం. అప్పుడు పాఠక ప్రేక్షకుడి ఊహలకు కనిపించే విజువల్ కీ తేడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. తప్పదు.

  3. Sai Padma says:

    మహేష్ గారూ, సాహిత్యాన్ని, సినిమాగా మార్చటంలో పడ్డ వ్యాకరణ ఇబ్బందులన్నీ చాలా బాగా చెప్పేరు. ముఖ్యంగా తిలక్ మనవరాలి వివరాలు. కానీ ఆ అమ్మాయి కరక్ట్ గా చెప్పింది. తిలక్ కథ కి మీరు చలం స్క్రీన్ ప్లే ఇచ్చారు. కానీ చలం స్త్రీ లా రమ ని ఉంచారా లేదా, అన్నది , ఒక చుక్కమ్మ చూసినా ఎవరు చూసినా , చలం స్త్రీలు , అంత నిబ్బరం లేకుండా, అన్నీ కోల్పోయినట్టు ఉండరు. ఒక రాజేశ్వరి లా, రమ లోని వాంఛ నీ, ప్రేమనీ చిత్రీకరించ గలిగిన మీరు, చివరికి వచ్చేసరికి, శాపం, దయనీయం, అంటూ శేఖరాన్ని శాప గ్రస్తుడు అనేయటం కొంచం వింతగా, కొత్త గా ఉంది.

    ఆ పర్సులో నోట్లు అలాగే ఉండటం చూసిన శేఖరం మొహం నల్ల బడింది. అని కథ ముగిస్తాడు రచయిత. తిలక్ కథలు, ఒక నాటి కాలపు బలమైన అస్తిత్వ వాతావరణ ప్రకటనలు. ఈ ఎందింగ్ కీ , సినిమా వ్యాకరణానికీ మీ కెదురైన ఇబ్బంది ఏంటో, నాకు అర్ధం కాలేదు . రమ వ్యక్తిత్వం పూర్తిగా నిరూపించాకుండా , మిమ్మల్ని మీరు ఫెమినిస్ట్ అని ఎందుకు అనుకున్నారో తెలియలేదు. ఫెమినిజం లో ఉన్నది , పురుష ద్వేషం, పురుషుడ్ని శాపగ్రస్థం చేయటం కాదు కదా

    But.. having said that, one cant underestimate the technical brilliance you portrayed throughout the film in giving a period look and extracting wonderful action from characters. the music and lighting and rama character swapna is just haunting, like the music in the film .

  4. ari sitaramayya says:

    మహేష్ కుమార్ గారూ, సినిమా బాగుంది. రఘూ స్వప్నా ల నటన కూడా చాలా బాగుంది.
    కథనైనా నవలనైనా సినిమా తియ్యటం అంత సులభం కాదు. మీ ప్రయత్నం సఫలమైందనే చెప్పాలి.

  5. లలిత says:

    మహేష్ గారు
    సినిమా చాలా బావుంది.
    స్వప్న రమ పాత్రలో ఒదిగిపోయింది. రఘు లో మరో కోణం (నటన) చూసి ఆశ్చర్యపోయాను . బాగా చేసాడు .
    పైన మీరు చెప్పినట్టే ఎన్నో పరిమితులు, ఎల్లలు దాటుకుని ఒక పాపులర్ కథని చక్కని చిత్రంగా మలిచిన మీకు అభినందనలు .

  6. అసలెందుకో ఈ కథామూలంలోనే నాకు బలం లేదనిపించింది. అది బహుశా ఈ కథాకాలానికి, వర్తమానానికి గల తేడా వల్ల గావచ్చు.
    ఒక అపరిచయస్తున్ని ఒక వయసులో వున్న అమ్మాయి కేవలం ఓ ముసలామె తోడుగా వుంటూ ఓ వర్షం రాత్రి, ఆ రాత్రికి ఇంటిలోనే వుండమంటే ఖచ్చితంగా ఆ యిల్లు వేశ్య ఇల్లన్నా అవ్వాలి లేదా దయ్యాల కొంపన్నా కావాలి. ముసలామె మాటలు బట్టి అది వేశ్య ఇల్లే అనుకుంటే, జగన్నాధానికి అది వేశ్య ఇల్లులాగే అనిపించి వుంటే ఒక వేశ్యతో, జాలి పంచుకోవచ్చు లేదా ఒక రాత్రిని పంచుకోవచ్చు కానీ ప్రేమించడం అయితే సహజంగా లేదు. అలాగని వేశ్యను ప్రేమించడం అసహజం కాదు గానీ, ఒకే ఒక రాత్రి కేవలం 12 గంటల లోపల ప్రేమించడం నాకైతే పూర్తిగా అసహజంగా వుంది.

    ఇదే కారణంగా సినిమా కూడా నాకు నచ్చలేదు. చాలా అసహజంగా అనిపించి కథా చదివాను. అందులోనే అసహజత వుందనిపించింది.

    • మీరు చెప్పింది నిజమండి! సినిమా బావుంది (నటన) కానీ, ఎంత జీవిత వాస్తవానికి దూరమగా ఉన్నా, కధలో ఉన్న శిల్పం సినిమాలో(కొన్ని సినిమాల్లో శిల్పం అనేది పట్టించు కోరు లెండి) లేదు. అది వేశ్య ఇల్లు (బలవంతపు ) అని చెప్పడానికి కధలో ఒక నేపధ్యాన్ని కల్పించాడు కధకుడు తిలక్ గారు. అది స్క్రీన్ లో రాలేదు. అన్నట్టు చలం కధల్లో ముక్కు మొహం తెలియని వారి మధ్య ప్రేమలు సాధ్యమే! తిలక్ కధల గురించి నాకు అంతబాగా తెలియదు.

  7. కల్లూరి భాస్కరం says:

    సినిమా బాగుంది.
    అయితే, కొన్ని అభిప్రాయాలు…
    జగన్నాథం పేరును శేఖరంగా ఎందుకు మార్చినట్టు? జగన్నాథం మంచి పేరు. బుచ్చిబాబు గారి చివరికి మిగిలేది నవల చదివిన ప్రతివారూ ఆ పేరును ప్రేమిస్తారు. జగన్నాథం ఆ నవలలో చాలా సరదాగా, ఆహ్లాదంగా ఉండే పాత్ర.
    రెండోది..నాకు అర్థమైనంతవరకు తిలక్ కుఆ కథలో రమ, జగన్నాథం, అవ్వల గురించి చెప్పడం ప్రధానం కాదు. సహారా ఎడారి లాంటి ఒంటరితనం, దుఃఖం, విషాదం, దిగులు; వర్షం పడేటప్పుడు అవి మరింత కుంగదీయడం, చావు(రమ చనిపోయిన తన మూడునెలల పసిబిడ్డను తలచు కుంటూ కూర్చుంటుంది. జగన్నాథం స్నేహితుడికోసం వస్తే అతడు చనిపోయాడని తెలుస్తుంది) ఏ కాస్త అయినా ప్రేమానుభవం ఎదురైతే దానిని గద్దలా తన్నుకుపోయే జీవన యాధార్థ్యం (అవ్వ పాత్ర)తప్ప; నికరమైన ప్రేమ, ఆనందం, శాంతి లోపించిన జీవితం గురించి చెబుతూ ఒక నైరాశ్యపు మూడ్ ను చిత్రించడానికే తిలక్ ఆ కథను ఉద్దేశించాడనుకుంటాను.

    • కల్లూరి భాస్కరం says:

      అది చెప్పడానికి కథాప్రక్రియను ఎంచుకున్నాడు కనుక కొన్ని పాత్రల కల్పన అవసరమైంది. ఆ పాత్రలు, వాటి సంబంధాలు, అవి తిరిగే మలుపులు ఇందులో ప్రధానం కావు. కనుక ఇందులోకి సామాజిక చర్చ ఒదగదు. పాత్రలను కాక తిలక్ ఉద్దేశించిన మూడ్ ను మీరు తెర మీదికి ఎక్కించి ఉంటే అది తిలక్ కథ అయ్యేది. తిలక్ కోణం లోంచి చూస్తే రమ, జగన్నాథం ఇద్దరూ శాపగ్రస్తులే. కొన్ని గంటలపాటు కలిగిన మధురమైన ప్రేమానుభవం నుంచి ఇద్దరూ వంచితులయ్యారు. జగన్నాథం అవ్వ మాటలను ఎలా నమ్మేసాడు, రమను నిద్రలేపి ఎందుకు సందేహ నివృత్తి చేసుకోలేదు, రమ తన పర్సు విసిరేసిన తర్వాత వాస్తవం తెలుసుకున్న జగన్నాథం చెయిన్ లాగి రైలు ఎందుకు అపలేదు, కనీసం పక్క స్టేషన్ లో దిగి ఎందుకు వెనక్కి రాలేదు అనే ప్రశ్నలు పాత్రలను ప్రధానం చేసుకుని లేవనెత్తే ప్రశ్నలు.

మీ మాటలు

*