చలిమంట

Dog_team_Dawson_Yukon_1899

 

మూలం: జాక్ లండన్

murthy gaaru

అప్పుడే తెల్లవారుతోంది… ఆకాశం క్రమంగా బూడిదరంగులోకి మారుతోంది. విపరీతంగా చలి వేస్తోంది. ప్రధానమైన యూకోన్ (Yukon) నది జాడవదిలి, అతను పక్కనే బాగా ఎత్తుగా ఉన్న మట్టిదిబ్బ ఎక్కేడు; ఆ మట్టిదిబ్బ మీదనుండి తూర్పుగా, దట్టమైన స్ప్రూస్ చెట్ల మధ్యనుండి ఎక్కువమంది వెళ్ళినట్టు కనపడని సన్ననిజాడమాత్రం ఒకటి కనిపిస్తున్నాది. ఆ దిబ్బ చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉండడంతో, దిబ్బమీదకి చేరగానే ఊపిరి నిభాయించుకుందికి వాచీ చూసుకునే మిషతో కాసేపు ఆగేడు.

సమయం తొమ్మిది గంటలు అయింది. ఆకాశంలో ఒక్క మబ్బుతునకా లేకపోయినా, సూర్యుడుగాని, సూర్యుడువచ్చే సూచనలుగాని ఏ కోశానా కనిపించడం లేదు. ఈ రోజు ఆకాశం చాలా నిర్మలంగాఉన్న రోజు…. అయినా, సూర్యుడు లేకపోవడంతో, పరిసరాలు చెప్పలేని విషాదం కమ్ముకున్నట్టు, నిరుత్సాహంగా చీకటిగా కనిపిస్తున్నాయి. ఆ విషయం అతన్ని ఏమాత్రం కలవరపెట్టలేదు. సూర్యుడు లేకపోవడానికి అతను అలవాటు పడిపోయాడు. అతనసలు సూర్యుడిని చూసి ఎన్నో రోజులయింది. అతనికి తెలుసు. దక్షిణదిశనుండి అందమైన ఆ బింబం దిక్కుల చివరనుండి మొదటిసారిగా తొంగిచూసి వెంటనే గుంకిపోడానికి మరికొన్ని రోజులు పడుతుందని.

ఆ మనిషి తను వచ్చినత్రోవని ఒకసారి సింహావలోకనం చేసుకున్నాడు. అక్కడ యూకోన్ నది ఒకమైలు వెడల్పుగా ఉండి, మూడడుగుల మందమున్న ఘనీభవించిన మంచులో కప్పబడి ఉంది. ఆ మంచుగడ్డమీద మరో అంత మందంలో కొత్తగా కురిసిన మంచు ఉంది. గడ్డకట్టుకుపోయిన నీటితావులమీద అలలు అలలుగా పరుచుకుని తెల్లని తెలుపు. ఉత్తరం నుండి దక్షిణం వరకూ కనుచూపు మేర ఎక్కడచూసినా ఖాళీలేని తెలుపు…

ఒక్క దక్షిణ దిశగా ద్వీపంలాఉన్న దట్టమైన స్ప్రూస్ చెట్లచుట్టూ తలవెంట్రుకలా వంపులుతిరిగి, ఉత్తరానఉన్న మరో స్ప్రూస్ చెట్ల ద్వీపంలో కనుమరుగైపోయిన త్రోవ మినహాయిస్తే. ఈ తలవెంట్రుక లాగా కనిపిస్తున్న త్రోవే అసలు మార్గం… ఉన్న ఒకే ఒక్క త్రోవ… దక్షిణానికి 500 మైళ్ళు వెనక్కి Chilcoot కనుమ, Dyea, Salt Water కి వెళ్తుంది … ఉత్తరానికి Dawson 70 మైళ్ళూ, Nulabo కి మరో వెయ్యి మైళ్ళూ, అక్కడనుండి St. Michael on Bering Sea మరో 1500 మైళ్ళూ ఉంటుంది.

అయితే ఇవేవీ… తలవెంట్రుకలా కనీ కనిపించని సుదీర్ఘంగాఉన్న గహనమైన మార్గంగాని, ఆకాశంలో సూర్యుడు లేకపోవడంగాని, విపరీతంగా వేస్తున్న చలిగాని, భయంకరమైన పరిచయంలేని ఆ పరిసరాలుగాని అతనిమీద ఏమాత్రం ప్రభావాన్నీ చూపించలేకపోయాయి. దానికి కారణం, ఇవన్నిటికీ బాగా అలవాటు పడిపోయాడనికాదు; నిజానికి అతనీ ప్రాంతానికే కొత్త; మొదటిసారి వస్తున్నాడు. ఇదే అతని మొదటి శీతకాలం ఇక్కడ. అతనితో ఉన్న చిక్కు ఏమిటంటే అతనికి బొత్తిగా ఆలోచన లేదు. లౌకికమైన విషయాలయితే తొందరగా గ్రహించి, స్పందించగలడు. అయితే ఆ స్పందనకూడా విషయాలకే పరిమితంగాని, వాటి పర్యవసానాలకు కాదు.

సున్నాకి దిగువన యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత అంటే, ఎనభై డిగ్రీల దరిదాపు కొరికే మంచు అన్నమాట. అంత చలీ, అందులో వణకడం గట్రా సరదాగా అనిపించి అతనికి బాగా నచ్చేయి. అంతవరకే! తను చలిప్రదేశంలో బ్రతకలేని బలహీనుడినన్నఊహ గాని, అసలు మనిషే… వేడి అయినా, చలి అయినా కొన్ని అతిచిన్న ఉష్ణోగ్రతల పరిమితులమధ్య బ్రతకగలిగిన ప్రాణి అన్న ఆలోచనగాని; ఆపైన విశ్వంలో మనిషి స్థానం గురించి, అతని శాశ్వతత్వమూ మొదలైన ఊహాత్మకమైన విషయాల జోలికిగాని అతని ఆలోచన సాగలేదు.

యాభై డిగ్రీలు మైనస్ అంటే అర్ధం మంచుకొరికితే అది విపరీతంగా బాధిస్తుంది; దానినుండి ఎలాగైనా కాపాడుకోవాలి … చేతికి గ్లోవ్జ్ తొడుక్కోడం, చెవులకి తొడుగులూ, కాళ్ళకి దట్టమైన మేజోళ్ళూ, మొకాసిన్లూ… ఖచ్చితంగా ఉండితీరాలి. కానీ, అతనికి యాభైడిగ్రీల మైనస్ అంటే యాభైడిగ్రీలు మైనస్ … ఒక అంకె… అంతే. తను అనుకుంటున్నట్టు కేవలం ఒక అంకెకాకుండా అంతకుమించి దానికి ఏదైనా అర్ధం ఉండడానికి అవకాశం ఉందన్న ఆలోచనే అతని బుద్ధికి తట్టలేదు.

అతను ముందుకుపోడానికి ఇటు తిరిగి, ఎంత చలిగా ఉందో పరీక్షించడానికి ఉమ్మేడు. అది చేసిన పదునైన చిటపట శబ్దం అతన్ని ఆశ్చర్యపరిచింది. అతను మళ్ళీ మళ్ళీ గాలిలోకి ఉమ్మేడు క్రిందనున్న మంచుమీద పడకుండా. అతనికి తెలుసు యాబై డిగ్రీల మైనస్ దగ్గర మంచుమీద ఉమ్మితే అది శబ్దం చేస్తుందని. కానీ, ఇది గాలిలోనే శబ్దం చేస్తోంది. అంటే, ఉష్ణోగ్రత మైనస్ యాభై డిగ్రీలకంటే ఇంకా తక్కువే ఉందన్న మాట — కానీ ఎంత తక్కువో తెలీదు. అయినా, ఇపుడు తనకి ఉష్ణోగ్రతతో పనిలేదు.

తనిప్పుడు హెండర్సన్ క్రీక్ చీలికకి ఎడమవైపునున్నతన పాత హక్కుభూమి వైపు వెళుతున్నాడు. ఇప్పటికే పిల్లలు అక్కడ చేరి ఉంటారు. వాళ్ళు ‘ఇండియన్ క్రీక్ కంట్రీ’ దగ్గర చీలిన రోడ్డునుండి అడ్డంగా వెళ్తే, తను యూకోన్ నదిలోని లంకలనుండి వేసవిలో దుంగలు తేవడానికిగల సాధ్యాసాధ్యాలు పరీక్షించడానికి చుట్టూతిరిగి వెళ్తున్నాడు. తను శిబిరం చేరేసరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది, అప్పటికే బాగా చీకటిపడిపోతుంది.

అయితేనేం, కుర్రాళ్ళు అక్కడే ఉంటారు, చలిమంట మండుతూ ఉంటుంది, తన కోసం వేడివేడిగా రాత్రిభోజనం సిద్ధంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం విషయానికి వస్తే, అని అనుకుని, తన జాకెట్ లోంచి ఉబ్బెత్తుగా కనిపిస్తున్న పొట్లాంమీద చెయ్యివేసి తణిమేడు. ఆ పొట్లాం కూడా, రుమాల్లో చుట్టి, ఒంటికి ఆనుకుని తన చొక్కాలోపల ఉంది.

బిస్కట్లు చలికి గడ్డకట్టుకుపోకుండా ఉంచాలంటే అదొక్కటే మార్గం. ఆ బిస్కట్ల గురించి ఆలోచన రాగానే, తనలో తనే హాయిగా నవ్వుకున్నాడు… ఎందుకంటే ఒక్కొక్క బిస్కత్తూ చీల్చి అందులో వేచిన పంది మాంసం బాగా దట్టించి, పంది కొవ్వులో ఊరవేసినవి అవి.

అతను బాగా ఏపుగా ఎదిగిన స్ప్రూస్ చెట్లలోకి చొరబడ్డాడు. తోవ చాలాసన్నగా కనీకనపడకుండా ఉంది. ఇంతకుముందు వెళ్ళిన కుక్కబండీ (sledge) జాడమీద అప్పుడే ఒక అడుగు మందం మంచు కురిసింది. అతను బండీ ఉపయోగించకుండా వంటిమీద బరువులేకుండా తేలికగా నడుస్తున్నందుకు ఆనందించేడు. నిజానికి అతను మధ్యాహ్నభోజనానికి మూటగట్టుకున్న బిస్కత్తులుతప్ప వంటిమీద ఇంకేవీ లేవు. అతనికి ఈ చలిచూస్తే చాలా ఆశ్చర్యం వేసింది.

వాతావరణం బాగా చల్లగా ఉంది. తిమ్మిరెక్కిన తన ముక్కునీ, బుగ్గల్నీ చేతికున్న గ్లోవ్జ్ తో ఒకసారి గట్టిగా రాసేడు. అతను చాలాదట్టంగా గడ్డంపెంచే వ్యక్తి; అయినా ఆ గడ్దం ముందుకి పొడుచుకువచ్చిన దవడ ఎముకలని, మంచుకురుస్తున్నగాల్లోకి చాలా కుతూహలంగా తొంగిచూస్తున్న ముక్కునీ వెచ్చగా ఉంచలేకపోతోంది.

ఆ మనిషివెనక అడుగులోఅడుగు వేసుకుంటూ ఒక కుక్క పరిగెడుతోంది. అది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినదే; బలిష్టంగా, గోధుమరంగులోఉండి దాని చూపులలో, ప్రవర్తనలో తోడేలుకి ఏమాత్రం తేడా కనిపించక, తోడేళ్ళని వేటాడడానికి పనికివచ్చే వేటకుక్క అది.

విపరీతంగా ఉన్న ఆ చలిలో నడవడం ఆ జంతువుని చాలా అసహనానికి గురిచేస్తోంది. దానికి తెలుసు అది ప్రయాణానికి అనువైన సమయం కాదని. మనిషికి వాడి వివేకం చెప్పిన దానికంటే, దానికి తన సహజప్రవృత్తి అసలు పరిస్థితి స్పష్టంగా తెలియజేస్తోంది. నిజానికి అప్పుడున్న ఉష్ణోగ్రత సున్నాకి దిగువన యాభై డిగ్రీలూ కాదు, అరవై డిగ్రీలూ కాదు, డెబ్భై డిగ్రీలు కాదు; అది డెబ్భై అయిదు డిగ్రీలు మైనస్. నీటి ఘనీభవన ఉష్ణోగ్రత సున్నాకి ఎగువన ముఫై రెండు డిగ్రీలు కనుక, దాని అర్థం నూట ఏడు డిగ్రీల చలి అన్నమాట.

ఆ కుక్కకి ఉష్ణమాపకాలగురించి ఏమీ తెలియదు. బహుశా దానిమెదడులో, అతిశీతలత్వాన్ని మనిషిమెదడు గుర్తించగలిగినట్టు గుర్తించే ఇంద్రియజ్ఞానం ఉండకపోవచ్చు. కాని, ఆ జంతువుకి దాని జంతుప్రకృతి దానికి ఉంది. లీలగా ఏదో చెప్పలేని భయం ఊహించింది గాని దాన్ని అణుచుకుని మనిషి వెంట నక్కి నక్కి నడుస్తోంది; ఆ మనిషి ఎక్కడో ఒకచోట ఏదైనా శిబిరంలోదూరి చలిమంటవేసుకోకపోతాడా అని ఊహిస్తోందేమో, దాని నడక అలవాటులేని అతని అడుగుల్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. కుక్కకి చలిమంటగురించి తెలుసు. దానికి ఇప్పుడు చలిమంటైనా కావాలి, లేదా, ఈ చలిగాలినుండి రక్షించుకుందికి, మంచులో గొయ్యితీసి అందులో ముడుచుకుని పడుక్కోనైనా పడుక్కోవాలి.

దాని ఊపిరిలోని తేమ దాని ఒంటిబొచ్చుమీద సన్నగా మంచుపొడిలా రాలి ఉంది; ముఖ్యంగా దాని చెంప దవడలూ, మూతీ, కనుబొమ్మలూ గడ్డకట్టిన నిశ్వాసపు తేమతో తెల్లగా కనిపిస్తున్నాయి. ఆ మనిషి ఎర్రని గడ్డమూ, మీసమూ కూడా అలాగే అతని ఊపిరిలోని తేమకి, అంతకంటే ఎక్కువగా ముద్దకట్టేయి గానీ, ఆ ముద్దకట్టినది మంచురూపం దాల్చి, అతను ఊపిరివిడుస్తున్నప్పుడల్లా మరింత పేరుకుంటున్నాది.

దానికితోడు, ఆ మనిషి పుగాకు నములుతున్నాడు; అతని మూతిదగ్గర పేరుకున్నమంచు అతని పెదాల్ని ఎంత గట్టిగా పట్టిఉంచిందంటే, ఆ పుగాకురసం ఉమ్మిన తర్వాత అతని చుబుకాన్ని అతను తుడుచుకోలేకపోతున్నాడు. దాని పర్యవసానం, అతని చుబుకం మీద తెల్లనిగడ్డం క్రమక్రమంగా దట్టమైన జేగురు రంగులోకి మారుతోంది. అతనుగాని ఇప్పుడు క్రింద బోర్లపడితే, అది గాజులాగ చిన్నచిన్నముక్కలుగా పగిలిపోతుంది. అతనిప్పుడు తనగడ్డం రంగుమారడం గురించి పట్టించుకోవడం లేదు. ఆ దేశంలో పుగాకు నమిలే వాళ్లందరూ చెల్లించే పరిహారం అది. ఇంతకు ముందు రెండుసార్లు చలివాతావరణంలో బయటకు వెళ్ళేడు గాని, అప్పుడు ఇంత చలి లేదు. అరవయ్యవ మైలురాయి దగ్గర అక్కడి స్పిరిటు థర్మా మీటరు మైనస్ దిగువ యాభై అయిదు డిగ్రీలు నమోదు చెయ్యడం తను చూసేడు.

అలా ఓపిక బిగబట్టుకుని సమతలంగా ఉన్న మైళ్ళపొడవైన అడవిదాటి, విశాలమైన పొగాకు తోటలు దాటి, గడ్డకట్టిన ఒక చిన్నసెలయేటిగట్టు దిగేడు. అదే హెండర్సన్ క్రీక్. అతనికి తెలుసు తను ఈ క్రీక్ చీలికకి పదిమైళ్ళదూరంలో ఉన్నానని. అతను చేతివాచీ చూసుకున్నాడు. పదిగంటలు అయింది. అంటే, తను గంటకి నాలుగుమైళ్ళచొప్పున నడుస్తున్నాడన్నమాట. ఆ లెక్కన తను ఈ క్రీక్ చీలిక చేరడానికి రెండున్నరగంటలు పడుతుంది, అంటే పన్నెండున్నరకి చేరుకుంటాడు. అక్కడకి తను చేరుకున్న ఆనందంతో, తన మధ్యాహ్న భోజనం అక్కడ చేద్దామని నిర్ణయించుకున్నాడు.

ఎప్పుడైతే అతను గడ్దకట్టిన సెలయేటి ఉపరితలం మీద నడక ప్రారంభించాడో, ఆ కుక్క నిరాశతో తోకవేలాడేసుకుని, దాని మడమలమీద వాలిపోయింది. ముందువెళ్ళిన కుక్కలబండి చక్రాల చాళ్ళు స్పష్టంగానే కనిపిస్తున్నాయి, కాని పరిగెత్తిన కుక్కల అడుగులమీద అప్పుడే పన్నెండంగుళాల మందం మంచు కురిసింది. నెలరోజుల వ్యవధిలో ఈ నిశ్చలమైన సెలయేటిమీద అటునుంచి ఇటుగాని, ఇటునుంచి అటుగాని ఎవ్వరూ వెళ్ళిన జాడ కనిపించదు.

ఈ మనిషిమాత్రం స్థిరంగా నడక సాగిస్తున్నాడు. అతనికి పెద్దగా ఆలోచించే అలవాటూ లేదు, అతనికి ఇప్పుడు ప్రత్యేకించి ఆలోచించడానికికూడా ఏమీ లేదు. అతను ఈ సెలయేటి చీలిక చేరిన తర్వాత మధ్యాహ్నభోజనం చేస్తాడన్నదీ, సాయంత్రం ఆరు గంటలకల్లా పిల్లలతో శిబిరందగ్గర ఉంటాడన్నదీ తప్ప. నిజానికి మాటాడ్డానికి తోడు ఎవరూలేరు; ఒకవేళ ఉన్నా, మూతిమీద గడ్డకట్టుకుపోయిన మంచువల్ల మాటాడడం సాధ్యపడదు కూడా. అందుకని, ఆ జేగురురంగులోకిమారుతున్న గడ్డం పొడవుపెంచేలా, విరామంలేకుండా అలా పొగాకు నములుకుంటూ పోతున్నాడు. ఉండుండి ఒక్కసారి అతని మనసుకి ఇవాళ చాలా చల్లగా ఉందనీ, ఇంత చలి ఇదివరకెన్నడూ తను యెరుగననీ తడుతోంది.

నడుస్తూనడుస్తూ చేతికున్న ఉన్ని గ్లోవ్జ్ తో తన ముక్కుకొననీ, పొడుచుకువచ్చిన బుగ్గఎముకలనీ గట్టిగా రుద్దుతున్నాడు. ఆ పని అసంకల్పితంగానే అప్పుడప్పుడు చేతులు మార్చిమార్చి చేస్తున్నాడు. కానీ, అతను ఎంత రుద్దనీ, అతను రుద్దడ ఆపగానే బుగ్గఎముకలు తిమ్మిరెక్కేవి, మరుక్షణంలో ముక్కుకొస చైతన్యం కోల్పోయేది. అతని బుగ్గలు ఇక మంచుకి గడ్డకట్టుకుపోవడం ఖాయం; ఆ విషయం అతనికీ తెలుసు. అందుకనే ముక్కుకి Buds (హిమపాతమప్పుడు వేసుకునే ముక్కుపట్టీలు) వేసుకోలేదే అని ఒక్కసారి విచారం వేసింది; ఆ పట్టీలు బుగ్గ ఎముకలమీదనుండి పోతూ వాటికికూడా రక్షణ కల్పించి ఉండేవి. అయినా ఇప్పుడనుకుని ఏం ప్రయోజనం? బుగ్గలు గడ్డకడితే ఏమౌతుందట? కొంచెం బాధగా ఉంటుంది. అంతే గదా; దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ వచ్చిపడదు.

ఎపుడయితే ఆలోచనలు లేక అతని మనసు ఖాళీగా ఉందో, అతని చూపులు పదునెక్కి, సెలయేటి ఉపరితలం మీద దుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, అది వంపులుతిరిగిన చోట్లూ, అది లోయల్లోకిదిగినచోట్లూ నిశితంగా గమనించడంతోపాటు, తను అడుగువేసే ప్రతిచోటూ అతిజాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఒకసారి ఒకవంపుని చుట్టివస్తూ, భయపడ్డ గుర్రంలా ఒకచోట అకస్మాత్తుగా ఆగి, నడుస్తున్నమార్గం వదిలి, తన అడుగులజాడలోనే వెనక్కి వచ్చేడు.

అతనికి తెలుసు ఆ సెలయేరు అడుగు వరకూ గడ్డకట్టిపోయిందని — నిజానికి ఈ ఆర్కెటిక్ చలికి ఏ సెలయేటిలోనూ నీళ్ళన్న ఊసు ఉండదు — అయితే, కొండవాలులంట పైనకురిసిన మంచుబరువుకి అడుగునఉన్నమంచు కరిగి ఊటలై ప్రవహించి, ఒకోసారి ఇలాంటి గడ్డకట్టిన సెలయేటి తలాలపై ప్రవహిస్తుంటాయన్నవిషయంకూడా అతనికి తెలుసు; అవి ఎంతచలివాతావరణంలోనైన గడ్డకట్టవనీ తెలుసు; వాటివల్ల వచ్చే ప్రమాదము గురించీ బాగా తెలుసు. నిజానికి అవి ఉచ్చులు. పైన పేరుకున్న మంచుకింద మూడు అంగుళాలనుండి మూడడుగులలోతువరకూ ఎంతవరకైనా నీటిగుంటలు ఉండవచ్చు. ఒక్కొసారి వాటిని అరంగుళంమాత్రమే మందంగల మంచుపలక కప్పిఉండొచ్చు. మంచుపలకపై ఒక్కోసారి మంచుపేరుకుని ఉండొచ్చు. లేదా కొన్ని వరుసల్లో ఒకదాని మీద ఒకటిగా నీరూ- పలకా, నీరూ-పలకా ఉండి, ఒకసారి మనిషి వాటిమీద కాలుపెడితే, మంచుపలకలు ఒకటొకటిగా విరిగి మనిషి మొలబంటి వరకూ మంచునీటితో తడిసిపోవచ్చు.

అందువల్లనే అతను అంత గాభరాపడి వెనక్కి అంతతొందరగా అడుగులువేసింది. అతను అడుగువేసినచోట మంచుపొరక్రింద మంచుపలక విరిగిన చప్పుడు విన్నాడు. అటువంటి చల్లనివాతావరణంలో కాళ్ళు తడవడమంటే … కష్టమేకాదు, ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే. తక్కువలోతక్కువ అతనికి ఆలస్యం అవడం, ఎందుకంటే అపుడతను తప్పనిసరిగా చలిమంట వేసుకుని, దాని వేడిమిలో వట్టికాళ్ళు రక్షించుకుంటూ, మేజోళ్ళనీ, మొకాసిన్లనీ ఆరబెట్టుకోవాలి. అందుకని, సావధానంగా నిలబడి జాగ్రత్తగా సెలయేటిఉపరితలాన్నీ, దానిగట్లనీ పరిశీలించి, నీటిప్రవాహం కుడిపక్కనుండి వస్తోందని గ్రహించేడు.

ముక్కునీ బుగ్గలనీ రాపిడిచేసుకుంటూ, క్షణకాలం విషయాలన్నీ మదింపుచేసుకుని, అప్పుడు ఎడమప్రక్కకి తిరిగి, భయంభయంగా అడుగువేస్తూ, వెయ్యబోయే ప్రతిఅడుగునీ పరీక్షించుకుంటూ, సెలయేటిని దాటేడు. ఇక ప్రమాదంలేదు అనుకున్నతర్వాత కొత్తగా మరొక ‘పట్టు’ పుగాకుతీసి నములుతూ, తన మిగిలిన నాలుగు మైళ్ళ ప్రయాణానికి ఉత్సాహంగా అడుగులెయ్యడం ప్రారంభించాడు. తర్వాతి రెండుగంటలప్రయాణంలోనూ అలాంటివి చాలాఉచ్చులు ఎదుర్కొన్నాడు. నీటిగుంటలమీద పొరలా పేరుకున్నమంచు పీచుమిఠాయిలా ముడుచుకుపోయిఉండి ప్రమాదాన్నిసూచిస్తుంది.

అయినాసరే, అతను మరొకసారి తృటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నాడు; అప్పుడు ప్రమాదాన్నిశంకిస్తూ, ముందు కుక్కని పొమ్మన్నాడు, అది పోనని మొరాయించింది. చివరికి అతడు దాన్ని ముందుకి తోసేదాకా వెళ్లలేదు; తోసినతర్వాత విరగని పలకమీదనుండి తొందరగా పరిగెత్తింది; ఇంతలో పలకవిరిగి, అది ఒకపక్కకి ఒరిగిపోయినా, గట్టి ఆనుదొరికి వెళ్లగలిగింది. దాని పాదాలూ, ముందుకాళ్ళూ, తడిసిపోవడమేగాక, కాళ్లకుఅంటుకున్ననీళ్ళు వెంటనే గడ్డకట్టుకుపోయాయి. పేరుకున్నమంచుని విదిలించుకుందికి ప్రయత్నంచేసి, మంచుమీద వెల్లకిలా పడుకుని, కాలివేళ్ళ మధ్య చిక్కుకున్న మంచుని నోటితో కొరకడం ప్రారంభించింది. అది అసంకల్పితంగా చేసిన చర్య. మంచుని అలా వదిలెయ్యడం అంటే, కాళ్ళు ఒరిసిపోనియ్యడం. ఆ విషయం దానికి తెలీదు. దానికి తెలిసిందల్లా, ఆ జీవిలో రహస్యలిపిలో లిఖించబడ్డ అద్భుతమైన ప్రతిచర్య ప్రకారం నడుచుకోవడమే.

కాని మనిషికి ఈ విషయమ్మీద ఖచ్చితమైన అవగాహన ఉండడంతో, కుడిచేతి చేజోడు తొలగించి గడ్డకట్టిన మంచుముక్కలు తొలగించడంలో సాయం చేసేడు. ఒక నిముషందాటి అతని వేళ్ళని బయట పెట్టలేదు. అయినప్పటికీ, అంతలోనే అవి కొంకర్లుపోడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. వాతావరణం చాలా చల్లగా ఉంది. తొందర తొందరగా చెయిజోడు తొడిగి, గుండెకేసి మోటుగా చెయ్యిని కొట్టేడు.

సరిగ్గా మిట్టమధ్యాహ్నం వేళకి రోజంతటికంటే వెలుగు బ్రహ్మాండంగా ఉంది. అయినా సూర్యుడు శీతకాలపు పొద్దవడంచేత క్షితిజరేఖకి చాలా దగ్గరలో ఉన్నాడు. కారణం హెండర్సన్ క్రీక్ దగ్గర నేల బాగా ఎత్తుగా ఉంది. అతను అక్కడ నడుస్తున్నప్పుడు నీడ కాళ్ళక్రిందే ఉంది. సరిగ్గా పన్నెండున్నర అయేసరికల్లా తననుకున్న చీలిక దగ్గరికి చేరేడు. అతను అనుకున్నవేళకి రాగలగడంతో నడుస్తున్న వేగానికి అతనికి చాలా సంతృప్తి కలిగింది.

తను అదేవేగంతో నడవగలిగితే సాయంత్రం ఆరోగంటకల్లా కుర్రాళ్ళని కలవగలుగుతాడు. అతను జాకెట్టు, చొక్కావిప్పి లోపలదాచిన మధ్యాహ్నభోజనం పొట్లాం బయటకితీసాడు. దీనికి పావునిమిషంకూడా పట్టలేదు. అయినా, ఆ తక్కువ వ్యవధిలోనే, తొడుగుతీసిన చేతివేళ్ళు తిమ్మిరెక్కిపోయాయి. వెంటనే గ్లోవ్జ్ వేసుకోకుండా, ఆ చేతిని కాలికేసి ఒక డజనుసార్లు దబదబ బాదేడు. తర్వాత మంచుతోకప్పబడిన ఒక దుంగమీద కూర్చున్నాడు తిందామని.

అతను చేతిని కాలికేసిబాదినపుడు కలిగిన చిన్ననొప్పి అంతలోనే మాయమవడం చూసి ఆశ్చర్యపోయాడు. అతనికిప్పుడు ఆ బిస్కట్లు కొరికే అవకాశం లేదు. పదేపదిసార్లు చేతులు కాలికేసికొట్టుకుని, చేతికి మళ్ళీ గ్లోవ్జ్ తొడిగి, రెండో చేత్తో తిందామని దాని గ్లోవ్జ్ విప్పేడు. నోటినిండా ఒక ముక్క కొరుకుదామని ప్రయత్నించేడు గాని, మూతిదగ్గర పేరుకున్న మంచు సాధ్యపడనీలేదు. అతను చలిమంటవేసి దాన్ని కరిగించడం మరిచిపోయేడు. తన తెలివితక్కువదనానికి అతనికి నవ్వు వచ్చింది. నవ్వుతూనే, ఇప్పుడు తొడుగులేని చేతివేళ్ళుకూడా కొంకర్లుపోవడం గమనించేడు. అలాగే తను కూచుంటున్నప్పుడు కాలివేళ్లలో కలిగిన నొప్పి అప్పుడే తగ్గిపోవడం కూడా గమనించేడు. అతనికి అనుమానం వచ్చింది కాలివేళ్ళు వెచ్చగా ఉన్నాయా లేక అవికూడా తిమ్మిరెక్కాయా అని. మొకాసిన్ లోంచే వాటిని కదిపి అవి స్పర్శకోల్పేయన్న నిర్థారణకి వచ్చేడు.

చేతికి ఆతృతగా గ్లోవ్జ్ తొడిగి నిలబడ్డాడు. కొంచెం భయపడ్డాడు. కాళ్ళలోకి మళ్ళీ చైతన్యం వచ్చేదాకా కాసేపు గెంతేడు. ఇప్పుడు నిజంగానే వాతావరణం చాలా చల్లగాఉందని అభిప్రాయపడ్డాడు. ఈ దేశంలో ఉండుండి వాతావరణం అకస్మాత్తుగా చల్లబడిపోతుందని ఆ సల్ఫర్ క్రీక్ లో కలిసిన వ్యక్తి సరిగ్గానే చెప్పేడు. తనే ఆ మాటకి పరిహాసంగా నవ్వేడు గాని! దాని అర్థం మనిషి ఎప్పుడూ ఏ విషయాన్నీ రూఢిగా తీసుకో కూడదు. వాతావరణం బాగా చల్లగా ఉందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు అనుకున్నాడు.

వంట్లో మళ్ళీ వెచ్చదనం ప్రవహిస్తోందని రూఢి అయ్యేదాకా అతను క్రిందకీ మీదకీ గబగబా నేలమీద కాళ్ళు బలంగా వేస్తూ, చేతులూపుకుంటూ నడిచేడు. అప్పుడు జేబులోంచి అగ్గిపెట్టెతీసి చలిమంట వేసుకుందికి ప్రయత్నించేడు. అక్కడ చుట్టుపక్కల కలుపుమొక్కలలో క్రిందటిమాటు వర్షాలకు కొట్టుకొచ్చి చిక్కుకున్న కర్రా కంపా ఏరి తెచ్చుకున్నాడు మంట రగల్చడానికి. నెమ్మది నెమ్మదిగా ప్రారంభించి, త్వరలోనే మంట గట్టిగా అందుకున్నాక తనముఖం మీద గడ్డకట్టిన మంచు కరిగించుకుని, ఆ వేడిలోనే తన భోజనం కానిచ్చేడు. ఆ కాస్సేపు అక్కడి చలి వెనుకంజ వేసింది. కుక్కకూడా ఇటు వేడి తగిలేంత, అటు వొళ్ళు చురకనంత దూరంలో మంటకి దగ్గరగా సంతోషంగా కాళ్ళుజాచుకుని కూచుంది.

ఆ మనిషి తన భోజనం అయిన తర్వాత హుక్కా దట్టించి, ప్రశాంతంగా పొగతాగేడు. అప్పుడు తనచేతికి మళ్ళీ మిటెన్స్ తొడుక్కుని, చెవులు పూర్తిగా కప్పేలా తన టోపీ సరిచేసుకుని క్రీక్ లోని ఎడమవైపు బాట పట్టేడు. కుక్కకి చాలా నిరాశ కలిగింది. దాని మనసు మళ్ళీ మంటవైపే లాగుతోంది. ఈ మనిషికి చలి అంటే ఏమిటో తెలీదు. బహుశా అతని వంశంలో ఎవరికీ తెలిసి ఉండదు, చలంటే మామూలు చలికాదు, నిజమైన చలి, నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రతకి నూట ఏడు డిగ్రీల దిగువ ఉండే చలి… కానీ, కుక్కకు తెలుసును; దాని వంశం అంతటీకీ తెలుసును, ఆ పరిజ్ఞానం దాని నరనరాల్లోనూ జీర్ణించుకుంది. దానికితెలుసు: ఇటువంటి భయంకరమైనచలిలో బయటకు అడుగుపెట్టడం క్షేమంకాదని. ఇప్పుడు మంచులోగొయ్యిచేసుకుని, వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన ఈ తేడాకి మూలకారణమైన అంశం తొలిగేదాక నిరీక్షిస్తూ గుమ్మటంగా పడుక్కోవలసిన సమయం.

అయితే కుక్కకీ మనిషికీ ఏ విధమైన అనుబంధమూ లేదు. ఒకటి రెండో దానికి అవసరానికి పనికొచ్చే బానిస. అతని దగ్గరనుండి దానికి లభించిన ఏకైక లాలన కొరడాతో కొడతానని గట్టిగా చేసిన బెదిరింపులూ, అప్పుడప్పుడు కొరడాతో నిజంగా వేసిన దెబ్బలూను. అందుకని కుక్క తన భయాన్ని అతనికి తెలియపరచడానికి ప్రయత్నించలేదు. దానికి ఆ మనిషి శ్రేయస్సుతో సంబంధం లేదు. అది తన శ్రేయస్సుకోసం మళ్ళీ వెనక్కి మంటవైపు పోదామని ప్రయత్నించింది. కానీ, అతను గట్టిగా ఈలవేసి, కొరడా ఝళిపించేసరికి, వెనుదిరిగి అతన్ని అనుసరించసాగింది.

~~~~~~~~

ఆ మనిషి ఒక పుగాకుపట్టుతీసి నమలడం ప్రారంభించాడు. అతనిగడ్డం తిరిగి జేగురురంగులోకి మారడం ప్రారంభించింది. అలాగే అతని ఊపిరిలోని తేమ అతని మీసాలపై, కనుబొమలపై, కనురెప్పలపై తెల్లటిపొడిలా రాలడం ప్రారంభించింది. ఈ హెండర్సన్ క్రీక్ కి ఎడమప్రక్క ఎక్కువగా కొండవాగులున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే ఒక అరగంట దాకా అతనికి అలాంటి ఛాయలేవీ కనిపించలేదు. అదిగో అప్పుడు అనుకోని సంఘటన జరిగింది. అక్కడ ఏ చిహ్నాలూలేనిచోట, మెత్తగా, మధ్యలోఖాళీలులేకుండా బాగా గట్టిగాఉన్నట్టు కనిపించినచోట, విరిగి అతను లోపలికి పడిపోయాడు. అది పెద్దలోతేం కాదు. గట్టినేల దొరికేవరకు తొట్రుపడి, ముణుకులకి సగానికి పైగా తడిసిపోయేడు.

అతనికి బాగాకోపంవచ్చి తన దురదృష్టానికి గట్టిగా బయటకు తిట్టుకున్నాడు. అతను తన కుర్రాళ్ళదగ్గరికి ఆరుగంటలకి చేరుతానని లెఖ్ఖవేసుకున్నాడు. ఇప్పుడు అధమపక్షం గంట ఆలస్యంఅవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తప్పనిసరిగా చలిమంట వేసుకుని తన పాదరక్షలని పొడిగా ఆరబెట్టుకోవాలి. అంత తక్కువ ఉష్ణోగ్రతలవద్ద అది తప్పనిసరి— అంతమట్టుకు అతనికి తెలుసు. అందుకని అతను గట్టువైపు నడిచి ఒడ్డు ఎక్కేడు. గట్టుమీద చాలా చిన్నచిన్న స్ప్రూస్ చెట్ల మొదళ్లచుట్టూ వర్షానికి కొట్టుకొచ్చి అక్కడి కలుపుమొక్కల్లో చిక్కుపడిపోయిన ఎండుపుల్లలూ, విరిగిన కొమ్మలతోపాటు, క్రిందటేడువి పెద్ద దుంగలూ, ఎండిన రెల్లుగడ్డి దుబ్బులుకూడా ఉన్నాయి.

మంచుమీద పెద్ద దుంగలు పడేసి, మంటకి మంచుకరిగినపుడు మండుతున్న చిన్నచిన్న చితుకులు ఆరిపోకుండ ఒక పునాదిలాంటి వేదిక తయారుచేశాడు. అతని జేబులొంచి ‘బర్చ్(Birch)’ బెరడుతీసి దానికి అగ్గిపుల్లగీసి మంటవెలిగించేడు. అది కాగితంకంటే వేగంగా మండింది. దాన్ని పునాదిలో ఉంచి, పిడికెడు ఎండుగడ్డి, చిన్నచిన్న ఎండు చితుకులతో మంట పెద్దది చెయ్యడం ప్రారంభించాడు.

చాలా నెమ్మదిగా, జాగ్రత్తగా, రాబోయే ప్రమాదాన్ని బాగా ఎరిగిమరీ మంటని ప్రజ్వలనం చేశాడు. క్రమక్రమంగా, మంట పెద్దదవుతున్న కొద్దీ, అందులో వేసే చితుకులప్రమాణం పెంచుతూ మంట నిలబెట్టేడు. అతను మంచులో చతికిలబడికూర్చుని, పొదల్లో చిక్కుకున్న కట్టెలని లాగుతూ సరాసరి మంటలో వెయ్యనారంభించేడు. అతనికి తెలుసు ఇందులో తను కృతకృత్యుడు అయితీరాలి.

అందులోనూ, సున్నాకి దిగువన డెబ్బై అయిదు డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండి, కాళ్ళుతడిసిపోయేయంటే, మొదటిప్రయత్నంలోనే సఫలమయితీరాలి. అతని పాదాలేగనక పొడిగాఉండిఉంటే, మొదటిప్రయత్నంలో విఫలమైనా, త్రోవంట ఒక అరమైలు పరిగెత్తి అతని రక్తప్రసరణని యధాస్థితికి తెచ్చుకోగలడు. కానీ డెబ్బైఅయిదుకి దిగువన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తడిసిపోయి, చలికి గడ్దకట్టుకుపోయిన పాదాలలో రక్తప్రసరణని పరిగెత్తడం వల్ల తిరిగి రాబట్టలేడు… తను ఎంతవేగం పరిగెత్తనీ, తడిపాదాలు ఇంకా గడ్డకట్టుకుపోతాయి.

అదంతా ఆ మనిషికి ఎరుకే. క్రిందటి ఏడు శీతకాలంలో సల్ఫర్ క్రీక్ దగ్గర ఒక పాతకాపు మాటల్లో ఈ విషయాలన్నీ చెప్పేడు, ఇప్పుడు ఆ సలహా ఎంత విలువైనదో అతను గ్రహించగలుగుతున్నాడు. ఇప్పటికే అతని పాదాల్లో స్పర్శజ్ఞానం పూర్తిగా నశించిపోయింది. ఈ నెగడు వెయ్యడానికి చేతికున్నతొడుగుకూడా విప్పేయడంతో చేతివేళ్ళుకూడా తొందరగా తిమ్మిరెక్కిపోయేయి. గంటకి నాలుగుమైళ్ళ వేగం అతను నడిచిన నడక చర్మమూ, శరీరంలోని మిగతా అన్నిమూలలకీ గుండెనుండి రక్తం ప్రసరించేలా చేసింది. ఒకసారి అతను నడక ఆపెయ్యడంతో గుండెవేగంకూడా తగ్గింది.

వాతావరణంలోని శీతలపవనం భూమ్మీద ఏ రక్షణాలేని ఆ కొనని తాకితే, ఆ కొనదగ్గర అతనుండడంతో, అది పూర్తితీవ్రతతో అతన్ని తాకింది. శీతలపవనం ముందు శరీరంలోని రక్తం గడగడలాడింది. కుక్కలాగే, రక్తంకూడా సజీవంగానే ఉంది; దానిలాగే ఏదైనా రక్షణక్రింద దాగుని, ఈ భయంకరమైన చలినుండి కాపాడుకోవాలనుకుంటోంది. అతను నాలుగుమైళ్ళవేగంతో నడుస్తున్నంతసేపూ, ఇష్టంఉన్నా లేకపోయినా చర్మంమీది అన్నిభాగాలకీ రక్తం పరిగెత్తింది. ఇప్పుడు అది వెనక్కితగ్గి శరీరంలోని అంతరాంతరాల్లోకి జారుకుంది. అది లేని లోటును ముందుగా అనుభవిస్తున్నవి శరీరంఅంచుల్లో ఉన్న అవయవాలు.

అతని తడికాళ్ళు త్వరగా గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి. చేతులు గడ్డకట్టుకోకపోయినా, త్వరగా తిమ్మిరెక్కిపోయాయి. ముక్కూ, బుగ్గలూ అప్పుడే గడ్డకట్టుకుపోవడం ప్రారంభించేయి, అతని చర్మం రక్తప్రసరణ లేకపోవడంతో అప్పుడే చల్లబడిపోయింది.

అయితే, అతనిప్పుడు క్షేమంగానే ఉన్నాడు. కాలివేళ్ళు, ముక్కూ, బుగ్గలు మాత్రమే ప్రస్తుతానికి చలికి గడ్డకట్టుకు పోయాయి, మంట నిలిచి కాలుతోంది. ఇప్పుడతను తన వేలిపొడుగుపుల్లలు వేస్తూ మంట నిలబెడుతున్నాడు. ఇక కాస్సేపటిలో తన చెయ్యిమందం కొమ్మల్ని మంటలో వెయ్యగలుగుతాడు; అప్పుడు తడిసిపోయిన తన కాలితొడుగులు తీసి ఆరబెట్టుకోగలుగుతాడు. ఒకపక్క అవి ఆరుతుంటే, తన వట్టికాళ్ళని మంటదగ్గర వెచ్చచేసుకుంటాడు, కాలిపోకుండా ముందు మంచుతో రుద్దుకునే అనుకొండి. చలిమంట పూర్తిగా సఫలమైనట్టే. ఇపుడతనికి ప్రమాదం తప్పినట్టే.

సల్ఫర్ క్రీక్ దగ్గర ఆ పాతకాపు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అతని ముఖంమీద చిరునవ్వు మొలిచింది. ఆ పాతకాపు వాతావరణం యాభై డిగ్రీలకు తక్కువగా ఉంటే “క్లోండైక్” ప్రాంతంలో ఒంటరిగా సంచరించకూడదని సిద్ధాంతరీకరించేడు. కాని ఇప్పుడు తనక్కడే ఉన్నాడు; ప్రమాదం జరిగింది; తను ఒంటరిగానే ఉన్నాడు కూడా; అయినా తనని తను రక్షించుకోగలిగేడు. ఆ పాతకాపులు ఆడవాళ్లలా పిరికివాళ్ళు; కనీసం అందులో కొందరు, అని మనసులో అనుకున్నాడు. ఇలాంటిసమయాల్లో మనిషిచెయ్యవలసిందల్లా ఆవేశపడిపోకుండా, వివేచనకోల్పోకుండా ఉండడం.

అప్పుడు అతనికి ఏమీ కాదు. మగవాడన్నవాడెవడైనా నిజంగా మగతనంఉంటే ఒంటరిగా ప్రయాణం చెయ్యగలడు. కాని ఎంతవేగంగా అతని ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయో చూస్తే ఆశ్చర్యంవేస్తోంది అతనికి. అంత తక్కువసమయంలో అతనివేళ్ళు స్పర్శకోల్పోగలవని ఊహించలేదు. నిజంగా వాటిలో ప్రాణంఉన్నట్టు అనిపించడం లేదు. ఎందుకంటే, అతను చేతులతో ఒక పుల్లని పట్టుకుని కదపలేకపోతున్నాడు. అవి తననుండీ, తన శరీరంనుండీ ఎక్కడో దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతను ఒక కట్టెను తాకితే, అతను పట్టుకున్నాడో లేదో అటువైపు తిరిగి చూస్తేతప్ప తెలియడం లేదు. వేళ్లకొసలనుండి తనకి నరాలు తెగిపోయినట్టు, ఏ రకమైన సమాచారమూ అందటం లేదు.

వాటివల్ల ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు నెగడు వెయ్యడం అయింది, అందులో మండుతున్న ఒక్కొక్క కట్టె ఠప్ ఠప్ మని శబ్దం చేసి విరుగుతూ, నృత్యం చేస్తున్నట్టు లేస్తున్న ప్రతి కీలతోనూ జీవితం మీద ఆశని పెంచుతోంది. అతనిప్పుడు కాళ్లకున్న మొకాసిన్లు విప్పడం ప్రారంభించేడు. అవి మంచు పూతపూసినట్టున్నాయి. దళసరిగాఉన్న జర్మనుసాక్స్ ముణుకులకి సగందాకా ఒక ఇనపతొడుగులా కనిపిస్తున్నాయి ఇప్పుడు. మొకాసిన్ లకి ఉన్న తాళ్ళు ఏదో పెద్దమంటలోచిక్కుకుని అష్టవంకరలుపోయిన ఇనపకడ్డీల్లా ఉన్నాయి. క్షణకాలం తన స్పర్శకోల్పోయిన చేతివేళ్లతో విప్పడానికి ప్రయత్నం చేసేడు గాని, అది ఎంత తెలివితక్కువో వెంటనే గ్రహించి, మొలలో ఉన్న ఒరలోంచి కత్తి బయటకు తీసేడు.

అతను తాళ్లని తెంచేలోగా అది జరిగిపోయింది. అది అతని తప్పిదమే… కాదు, కాదు, చేసిన చాలా పెద్ద పొరపాటు. అతను ఒక స్ప్రూస్ చెట్టుక్రింద మంటవెయ్యకుండా ఉండవలసింది. అతను ఆ మంట ఆరుబయటవేసి ఉండాల్సింది. కానీ అతనికి పొదల్లోంచి ఎండుకట్టెలులాగి మంటలోకి నేరుగావెయ్యడం సులువని ఆ పనిచేశాడు. అతను ఏ చెట్టుకిందయితే మంటవేశాడో దానికొమ్మల్లో మంచుపేరుకుపోయి ఉంది.

వారాలతరబడి అక్కడ గాలివీచకపోవడంతో ప్రతికొమ్మమీదా అది భరించగలిగినంత మంచు గడ్దకట్టి ఉంది. అతను మంటలోకి పుల్లవేసిన ప్రతిసారీ, అతని వరకు ఆ విషయం గ్రహించలేకపోయినా, చెట్టులోకొంత కదలిక తీసుకువచ్చాడు… ఆ కదలికే ఈ విపత్తుకి దారితీసింది. ఒక చిటారుకొమ్మ దానిమీదపేరుకున్న మంచుబరువుకి తలవాల్చడంతో ఆ మంచు క్రిందికొమ్మమీదా, అది దానిక్రిందకొమ్మమీదా పడి మొత్తం చెట్టుమీదఉన్నమంచుఅంతా ఒక్కసారి దబ్బున పడిపోయింది. ఆ పడడం పడడం కొండమీంచిదొర్లిపడ్డ హిమపాతమై అతని మీదా, మంటమీదాపడి ఒక్కసారిగా మంట ఆరిపోయింది. ఇంతవరకు మంట ఉన్నచోట ఇప్పుడు చెల్లాచెదరైన మంచు తప్ప మరోటి లేదు.
ఆ మనిషి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు.

అది అతని మరణశిక్ష ప్రకటించినట్టు అనిపించింది. ఒక్క క్షణకాలం తాపీగా కూర్చుని అంతవరకు మంట ఉన్నప్రదేశాన్ని కళ్ళప్పగించి చూశాడు. బహుశా సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు చెప్పిందే నిజమేమో. అతనికి మరొకతోడు ఉండిఉన్నట్టయితే అతనిప్పుడు ప్రమాదంలో చిక్కుకుని ఉండేవాడు కాదు. సరే, ఏం చెయ్యగలం. మళ్ళీ మంటని ప్రజ్వలింపజెయ్యవలసిన బాధ్యత తనదే. ఇక రెండోసారి వైఫల్యానికి ఆస్కారమే లేదు. ఒకవేళ అతను సఫలమైనా అతను కొన్ని కాలివేళ్ళు నష్టపోవడం ఖాయం. ఈ పాటికి అతని కాళ్ళు గడ్దకట్టుకుపోయి ఉంటాయి. ఈ రెండో మంట మళ్ళీ బాగా వెలగడానికి కొంతసమయం తీసుకుంటుంది కూడా.

అతని ఆలోచనల సరళి అలా కొనసాగుతోంది. అలాగని ఆలోచిస్తూ అతను కూర్చోలేదు. అతని మనసులో ఒకప్రక్క ఆలోచనలు కదలాడుతుంటే రెండోప్రక్క అతను పనిచేసుకుంటూపోతున్నాడు. మంటకోసం కొత్తగా వేదిక తయారుచేశాడు. వరదకికొట్టుకొచ్చిన ఎండుగడ్డీ చితుకులూ మళ్ళీ సేకరించాడు. అతను వేళ్లతో ఆ పనిచెయ్యలేకపోయినా చేతులు మొత్తంగా ఉపయోగించి చెయ్యగలిగేడు.

ఈ క్రమంలో అతను అవాంఛనీయమైన తడి పుల్లలూ, పచ్చగాఉన్న నాచుకూడా పోగుచేశాడు. శక్తివంచనలేకుండా అతను చెయ్యగలిగినది అదే. అతను చాలా క్రమపద్ధతిలో మంట బాగావెలిగినతర్వాత ఉపయోగించడానికని పెద్ద ఎండుకొమ్మలు కూడ సమీకరించేడు. ఈ తంతు జరుగుతున్నంతసేపూ కుక్క అలా కూచుని అతని చర్యలని గమనిస్తోంది కళ్లలో ఎంతో ఆశతో. ఎందుకంటే ఇప్పుడు దానికి నెగడు ఏర్పాటు చెయ్యడానికి ఉన్న ఒకే ఒక్క ఆధారం అతనే. నెగడు వెయ్యడం ఆలస్యం అవుతూనే ఉంది.

అన్నీ సమకూర్చుకోవడం పూర్తయినతర్వాత, అతని జేబులో ఉన్న రెండో బర్చ్ బెరడుకోసం చెయ్యి పెట్టేడు. చేతులకి స్పర్శలేకపోవడంవల్ల తెలియకపోయినా, దాన్ని వెతుకుతున్నప్పుడు అది చేసిన చప్పుడువల్ల అక్కడ ఉందని తనకి తెలుస్తోంది. అతను ఎంతప్రయత్నించినా దాన్ని చేతితో పట్టుకోలేకపోతున్నాడు. అలా దానికోసం ప్రయత్నిస్తున్నంత సేపూ అతని తనకాళ్ళు గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తెలుస్తూనే ఉంది, ఆ ఆలోచన మనసులో మెదులుతూనే ఉంది. ఈ ఆలోచన అతన్ని ఆందోళనకి గురిచేస్తున్నప్పటికీ, దాన్ని ధైర్యంగా నిలదొక్కుకుని ప్రశాంతంగానే ఉన్నాడు.

చేతులకి పళ్లతో పీకి మిటెన్స్ తొడిగి, చేతుల్ని అటూ ఇటూ గట్టిగా జాడించి, శక్తికొద్దీ తుంటికి దబదబా గట్టిగా బాదేడు. ఆ పని అతను కాసేపు కూచునీ, కాసేపు నిలబడీ చేసేడు. ఇంతసేపూ కుక్క మంచులోనే కూర్చుని తన ముందటికాళ్లచుట్టూ తోడేలు తోకలాంటి తనతోకని కప్పి వెచ్చగా ఉంచుకుంది. దాని చెవులు రిక్కించి ముందుకి జాచి అతని చేస్తున్న ప్రతి పనినీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆ మనిషి తన చేతులు జాడిస్తూ, ఒంటికేసి కొట్టుకుంటూ చలిని తట్టుకుందికి దాని శరీరానికి ఉన్న సహజ నిర్మాణానికి కొంచెం అసూయపడ్డాడు కూడా.

అలా కొంతసేపు కొట్టిన తర్వాత ఎక్కడో లోలోపల లీలగా స్పర్శజ్ఞానంజాడ తగిలింది చేతుల్లో. అది క్రమంగా పెద్దదై పెద్దదై భరించలేనినొప్పిగా మారింది. అయినా దానికి అతను సంతోషంగానే ఉన్నాడు…స్పర్శ తెలుస్తున్నందుకు. వెంటనే అతని కుడిచేతినుండి మిటెన్ తీసి బర్చ్ బెరడు బయటకి తీసేడు. నగ్నంగా ఉన్నవేళ్ళు వెంటనే కొంకర్లుపోవడం ప్రారంభించేయి. అతని దగ్గర ఉన్న సల్ఫరు అగ్గిపుల్లలు తీసాడు. అప్పటికే విపరీతమైపోయిన ఆ చలి ఆ వేళ్లలో స్పర్శ లేకుండా చేసింది.

ఆ పుల్లల్లోంచి ఒకటి వేరుచేసే ప్రయత్నంలో మొత్తం అన్నిపుల్లలూ మంచులో పడిపోయేయి. మంచులోంచి బయటకి తీయడానికి ప్రయత్నించేడు గానీ, విఫలమయేడు. స్పర్శలేని చేతులు వాటిని తాకనూ లేకపోయాయి, పట్టుకోనూ లేకపోయాయి. అతను చాలా ఏకాగ్రతతో ఉన్నాడు. కాళ్ళు, ముక్కూ, బుగ్గలూ గడ్డకట్టుకుపోతున్నాయన్న విషయం తనమనసులోంచి తీసేసి, అతని దృష్టి అంతా ఆ అగ్గిపుల్లల్ని బయటకుతియ్యడం మీద లగ్నంచేసి ఉంచాడు. స్పర్శజ్ఞానానికి బదులు చూపుని ఉపయోగించి అతని చేతులు రెండూ అగ్గిపుల్లలకి రెండుప్రక్కలా రాగానే రెండు చేతుల్నీ దగ్గరకు తీసాడు… లేదా, దగ్గరకు తియ్యాలనుకున్నాడు. కానీ, చేతివేళ్లకు సమాచారం అందకపోవడంతో, వేళ్ళు సహకరించలేదు. వెంటనే కుడిచేతికి తొడుగుతొడిగి చాలా గట్టిగా ముణుకులకేసి కొట్టసాగేడు. అప్పుడు తొడుగు ఉన్న చేతులతోనే అగ్గిపుల్లల్ని కొంత మంచుతోసహా తన ఒడిలోకి తీసాడు. దానివల్ల పెద్దతేడా ఏమీ పడలేదు.

కొంత నేర్పుగా ప్రయత్నంచేసిచేసి ఆ అగ్గిపుల్లలకట్టని చేతితొడుగుల మడమలమధ్యకు తీసుకురావడంలో సఫలమయ్యాడు. అలాగే మీదకి ఎత్తి తన నోటిదాకా తీసుకు వచ్చేడు. అతను తల గట్టిగా విదిలించి నోరు తెరవ ప్రయత్నించడంతో, మూతిమీద పేరుకున్న మంచు ముక్కలుగ విరిగి నోరు స్వాధీనంలోకి వచ్చింది. క్రింది దవడని లోపలికి లాగి, పై పెదవి అడ్డుతగలకుండా వొంచి, పంటితో ఆ కట్టనుండి ఎలాగైతేనేం అతిప్రయత్నం మీద ఒక పుల్లను వేరు చెయ్యగలిగాడు, కానీ, అది అతని ఒడిలో పడిపోయింది. దాంతో అతనికి ప్రయోజనం లేకపోయింది. దాన్ని చేత్తో తియ్యలేకపోయాడు. అందుకని ఒక పథకం ఆలోచించాడు. దాన్ని పంటితోతీసి కాలికేసి రుద్దేడు. అలా ఒక ఇరవైసార్లు రుద్దిన తర్వాత చివరకి దాన్ని వెలిగించగలిగేడు. వెలుగుతున్న ఆ పుల్లని అలాగే బర్చ్ బెరడుదగ్గరకి నోటితోనే తీసుకెళ్ళేడు. కాని మండుతున్న గంధకము అతని ఊపిరితిత్తులనిండా నిండిపోయి అతనికి ఆపుకోలేని దగ్గుతెర వచ్చింది. ఆ దగ్గుకి వెలుగుతున్న అగ్గిపుల్ల తుళ్ళిపోయి మంచులోపడి ఆరిపోయింది.

ఒక్క క్షణం నిస్పృహ కలిగింది గాని, దాన్ని అణుచుకుంటూ, సల్ఫర్ క్రీక్ దగ్గరి పాతకాపు చెప్పినదే సరి: మైనస్ యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మనిషి ఒక తోడుతీసుకుని ప్రయాణం చెయ్యాలి అనుకున్నాడు. అతను చేతుల్ని దబదబ బాదేడు కాని వాటిలో ఏ చైతన్యాన్నీ తీసుకురాలేకపోయాడు. అతనొక్కసారి రెండు చేతులకున్న తొడుగుల్నీ విప్పేసేడు పళ్ళతో. మొత్తం అగ్గిపుల్లలకట్టనంతటినీ మోచేతులమధ్య గట్టిగా అదిమిపట్టేడు. అతని భుజాల కండరాలు ఇంకా చలికి గడ్డకట్టుకోకపోవడం అతనికి ఉపయోగించింది.

ఇప్పుడు ఆ కట్టనంతటినీ కాళ్లతో రుద్దడం ప్రారంభించాడు. ఒక్కసారి డెబ్భైఅగ్గిపుల్లలూ మండటంతో భగ్గుమని మంటవచ్చింది. ఆరిపోతుందని భయపడడానికి ఇప్పుడు గాలిలేదు. ఆ మంటవల్ల శ్వాసకు ఇబ్బంది కలగకుండా అతను తలని ఒకపక్కకి వాల్చి, ఆ మండుతున్న పుల్లల్ని బర్చ్ బెరడు దగ్గరకి తీసుకువచ్చేడు. అతనిలా పట్టుకోవడమేమిటి, అతనికి అతని చెయ్యి చర్మం కాలుతోందన్న స్పృహకలిగింది. ఆ వాసన అతనికి తెలుస్తోంది. ఆ స్పృహ మెల్లిగా నొప్పిలోకి, తర్వాత భరించలేని బాధలోకి మారింది. అయినా దాన్ని అతను సహిస్తూ, బర్చ్ బెరడు దగ్గరికి తొట్రుపడుతూ, తొట్రుపడుతూ తీసికెళ్ళేడు. అతని చేతులు అడ్డుగా ఉండి, ఉన్న వేడి అంతా అవే తీసుకోవడంతో అది అంత త్వరగా అంటుకోవడం లేదు.

చివరకి ఇక భరించలేక చేతులు ఒక్క కుదుపుతో వేరుచేసాడు. ఆ మండుతున్న అగ్గిపుల్లలు మంచులోపడి ‘చుంయ్’ మని చప్పుడు చేస్తూ ఆరిపోయేయి. అయితే బర్చ్ బెరడుమాత్రం అంటుకుంది. అతను ఎండుగడ్డీ చిన్నచిన్న ఎండుపుల్లలూ దానిమీద వెయ్యడానికి ప్రయత్నించేడు. కానీ, అతను సరియైనవాటిని ఎంచుకుని మిగతావి పారేసే స్థితిలో లేడు. ఎందుకంటే ఇప్పుడు అతను పనిచెయ్యగలిగింది మోచేతులతోనే. తడిసి కుళ్ళిపోయిన కర్రలూ, పచ్చనినాచూ కూడా అంటుకుపోయిఉన్నాయి పుల్లలకి. వాటిని సాధ్యమైనంతవరకు నోటితోకొరికి పారేస్తున్నాడు. అతని పనితనంలో నేర్పులేకపోయినా, నెమ్మదిగా మంటని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అది అతనికి జీవన్మరణ సమస్య.

మంట ఎట్టిపరిస్థితిలోనూ ఆరిపోకూడదు. అతని చర్మంమీద రక్తప్రసరణ లేకపోవడంతో అతనిప్పుడు వణకడం ప్రారంభించేడు, దానితో అతని కదలికలు ఇంకా మొరటుగా కనిపిస్తున్నాయి. ఆ వెయ్యడంలో ఒక పెద్ద పచ్చని నాచుముక్క తిన్నగా ఇంకా సన్నగా ఉన్న మంటమీద పడింది. అతను తన వేళ్లతో దాన్ని తొలగించడానికి ప్రయత్నించేడుగాని, అతనిశరీరం బాగా వణుకుతుండడంతో నిభాయించుకోలేక, మంట ఎక్కువ కదిపేయడం, మొదలునుండీ మంట కెలకబడి, మండుతున్న గడ్డీ, పుల్లలూ వేటికవి వేరయి, చెల్లాచెదరుగా పడిపోవడం జరిగిపోయింది. వాటిని దగ్గరగా పోగుచెయ్యడానికి ప్రయత్నించేడు గాని, ఆ ప్రయత్నంలోని ఒత్తిడితో బాటు, అతనిశరీరం అదిమిపెట్టలేనంతగా వణకడంతో అవన్నీ దారుణంగా చెల్లాచెదరైపోయాయి.

మండుతున్న ప్రతిపుల్లా ప్రాణంపోయినట్టు ఒక్కసారి పొగవదిలి ఆరిపోయాయి. ఆ ప్రకారంగా నెగడు వెయ్యడం విఫలమైంది. అతను నిరాశగా నాలుగుపక్కలా చూస్తుంటే, అతని దృష్టి ముందుసారి తను వేసినమంట ఆరిపోయిన చోట కూర్చున్న కుక్క మీద పడింది. అది మంచులో ఒదిగికూర్చుని, ఒకసారి ఒక కాలూ, రెండోసారి రెండో కాలూ లేపుతూ, మంట ఎప్పుడు తయారవుతుందా అన్న ఆదుర్దాతో తన శరీరభారాన్ని ముందుకాళ్లనుంచి వెనకకాళ్ళకీ, వెనకకాళ్లనుండి ముందుకాళ్లకీ మార్చుకుంటూ, అసహనంగా ఉంది.

“అతను తన తన చేతులమీదా మోకాళ్లమీదా వాలి పాకురుకుంటూ దాని వైపు వెళ్ళేడు.”

కుక్కమీదకి దృష్టి మరలగానే అతనికి ఒక కథ గుర్తుకొచ్చి మనసులో ఒక పిచ్చిఆలోచన వచ్చింది. అందులో ఒకడు మంచుతుఫానులో చిక్కుకుంటాడు. కానీ, ఒక ఎద్దు అందుబాటులో ఉంటే, దాన్ని చంపి, దాని చర్మంలోదూరి తన ప్రాణాలు రక్షించుకుంటాడు. అలాగే, తనుకూడా దీన్ని చంపి, దీని వెచ్చనిశరీరంలో తన చేతులు తిమ్మిరివదిలేదాకా దాచుకుంటే, అప్పుడు ఇంకో మంటవేసుకోవచ్చు అనుకున్నాడు. అందుకని కుక్కని తనదగ్గరకు రమ్మని పిలుస్తూ, సంభాషణ మొదలుపెట్టాడు. కాని ఇంతకుమునుపెన్నడూ అతను దాన్ని అలా పిలవకపోవడంచేతా, అతని గొంతులో ఏదో వింతభయం తొంగిచూస్తూఉండడంచేతా అది జడుసుకుంది. ఏదో విషయం ఉంది…

దాని అనుమాన ప్రవృత్తి ఇదమిత్ధం అని పోల్చుకోలేకపోయినా, ఎక్కడో, ఏదో ప్రమాదంఉందని మాత్రం దాని మెదడులో అనుమానం రేకెత్తించింది. ఆ మనిషి మాట చప్పుడుకి దాని చెవులు కిందకి వాల్చి, ముందుకాళ్ళూ వెనకకాళ్ళూ బారజాపుకుని, ముందుకాళ్ళు చాలా అశాంతితో ఇటూ అటూ కదుపుతూ ఉంది కాని, అది మాత్రం అతని దగ్గరకి పోలేదు. దాంతో, ఆ మనిషి చేతులమీద కాళ్ళమీదా వాలి కుక్కవైపు పాకరడం ప్రారంభించేడు. అతని ఈ అసాధారణమైన శరీరభంగిమ దాని అనుమానాన్ని మరింత రగిల్చి అది అతనినుండి సంకోచిస్తూనే దూరంగా పక్కకి తప్పుకుంది.

ఆ మనిషి మంచులో లేచికూచుని, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించేడు. అతను చేతులకి మళ్ళీ తొడుగులు పళ్ళ సాయంతో వేసుకుని, లేచినిలబడ్డాడు. పాదాల్లో స్పర్శలేక, భూమికీ తనకీ అనుబంధంఉన్నట్టు అనిపించకపోవడంతో ఒకసారి నిజంగా నిలుచున్నాడో లేదో నిర్థారణ చేసుకుందికి క్రిందికి చూసుకున్నాడు. అతను కాళ్ళమీద నిలబడడంతో కుక్క మనసులో అనుమానాలు తొలగిపోయాయి. అతనెప్పుడైతే కొరడాతో కొట్టినట్టు గట్టిగా అరిచాడో, అది పూర్వపు విధేయతతో తోకాడించుకుంటూ అతనిదగ్గరికి వచ్చింది.

అది అతనికి అందుబాటులో ఉన్నంతదూరంలోకి రాగానే మనిషికి పట్టుదప్పింది. కుక్కని పట్టుకుందామని అతను ఒక్కసారి చేతులు గాల్లోకి విదిలించి ప్రయత్నించేడు గాని, అతని చేతులు వంగనూ వంగక, దాన్ని పట్టుకోనూ పట్టుకోలేకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. చేతుల్లో ఏ కోశాన్నా స్పర్శతెలియడంలేదు. అవి ఎప్పుడో స్పర్శజ్ఞానంకోల్పోయేయనీ, అవి త్వరత్వరగా గడ్డకట్టుకుపోతున్నాయనీ అతను మరిచిపోయాడు. ఆ జంతువు తప్పించుకునేలోగా అతను దాన్ని తన మోచేతులలో చుట్టేసేడు. అతను మంచులో కూచుండిపోయి ఆ కుక్కని అలాగే పట్టుకున్నాడు. అది మూలుగుతూ, గుర్రు గుర్రు మంటూ, తప్పించుకుందికి విశ్వప్రయత్నం చేస్తోంది.

అదొక్కటే ఇప్పుడతను చెయ్యగలిగింది… దాన్ని కౌగలించుకుని కూచోడం. అతనికి దాన్ని తను చంపలేడని విశదమైపోయింది. ఆ పని ఏ రకంగానూ చెయ్యలేడు. సత్తువలేని చేతులతో మొలలోంచి కత్తి తియ్యనూ లేడు, పట్టుకోనూ లేడు, కనీసం దాని పీకని నులమనైనా నులమలేడు. దాన్ని అతను వదిలేసేడు. దాని తోకని కాళ్లమధ్య దాచుకుని ఒక్క గెంతు గెంతింది ఇంకా గుర్రు మంటూనే. నలభై అడుగుల దూరంలో ఆగి, చెవులు రిక్కించి అతనివంక తిరిగి, కుతూహలంగా పరీక్షించసాగింది.

అతని చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి అతను క్రిందకి చూసేడు; అవి అతని మోచేతుల చివరలకి వేలాడుతున్నాయి. చేతులెక్కడున్నాయో తెలుసుకుందికి కళ్ళతో చూడవలసివచ్చిందని తలుచుకుని అతనికి చిత్రంగా అనిపించింది. అతను అతని మోచేతుల్ని ముందుకీ వెనక్కీ గట్టిగా విదిలించసాగేడు… తొడుగులున్న చేతుల్ని పక్కలకేసి కొట్టసాగేడు. అలా ఒక ఐదు నిమిషాలు గబగబా చేసిన తర్వాత అతని గుండెనుండి పై చర్మానికి తగినంత రక్తప్రసరణ జరగడంతో, అతనికి వణుకు తగ్గింది. కానీ చేతుల్లోమాత్రం ఏ స్పర్శా లీలగాకూడా కలగలేదు. అతనికి అతని చేతులు మోచేతుల చివరలకి తూకపురాళ్ళలా వేలాడుతున్నాయన్న భావన కలిగింది, కానీ వాటిని వెతికితే కనిపించలేదు.

ఇక మృత్యువు తప్పదన్న సన్నని భయం, నిర్వీర్యంచేసే భయం అతనికి కలిగింది. అది క్రమక్రమంగా ఆలోచిస్తున్నకొద్దీ అతని చేతులూ, కాలివేళ్ళూ గడ్డకట్టుకుపోవడమో; లేదా చేతులూ, కాళ్ళూ కోల్పోవడం కాదనీ, అది కేవలం జీవన్మరణసమస్య అనీ, అందులో తనకి జీవించడానికి అవకాశాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయనీ స్పష్టమైపోయింది. దాంతో అతను ఆందోళనకు గురై, వెనక్కి తిరిగి, క్రీక్ ఉపరితలంమీద కనీకనిపించని అతని అడుగుల జాడవెంట పరిగెత్తడం ప్రారంభించేడు. కుక్క అతన్నిఅనుసరిస్తూ వెనకే పరిగెత్తడం ప్రారంభించింది.

ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగని భయంతో, ఒక లక్ష్యం, గమ్యం అంటూ లేకుండా గుడ్డిగా పరిగెత్త సాగేడతను. నెమ్మదిగా మంచుని తవ్వుకుంటూ, తొట్రుపాటు పడుతూ పరిగెత్తగాపరిగెత్తగా ఇపుడతనికి కొన్ని స్పష్టంగా కనిపించసాగేయి, ఆ సెలయేటి గట్లూ, పెద్దదుంగలు మార్గాన్ని మూసేసినచోట్లూ, ఆకుల్లేని ఏస్పెన్(Aspen) చెట్టూ, ఆకాశం… అన్నీ.

పరిగెత్తడంవల్ల అతనికిప్పుడు కొంచెం సుఖంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అతనిప్పుడు వణకడం లేదు. బహుశా అలా పరిగెత్తుతూ ఉంటే అతని కాళ్ళుకూడా వేడేక్కుతాయేమో; లేకపోయినా అతను అలా పరిగెడుతూఉంటే అతను తన శిబిరమూ చేరుకోవచ్చు, పిల్లల్నీ కలుసుకోవచ్చు. అతను కొన్నిచేతివేళ్ళూ, కాలివేళ్ళూ కోల్పోడం ఖాయం; అయితేనేం, అతనక్కడికి వెళ్ళగలిగితే కుర్రాళ్ళు తనని సంరక్షిస్తారు, శరీరంలో మిగతా భాగమైనా మిగులుతుంది.

దానితోపాటే అతనికి ఇంకోఆలోచనకూడా వచ్చింది: తను తన శిబిరంకి చేరడం గాని, పిల్లల్ని కలవడం గాని అసాధ్యం అని; తన శిబిరం ఇంకా చాలామైళ్ళదూరం ఉందనీ, అప్పుడే తను గడ్డకట్టుకుపోవడం ప్రారంభించడంతో, త్వరలోనే అతను బిరుసెక్కి చనిపోవడంఖాయం అని. ఈ ఆలోచననిమాత్రం పరిగణించక ఆలోచనలవెనక్కి నెట్టేసేడు.

ఒక్కోసారి అది ముందుకువచ్చి తనమాట వినమనిచెప్పినా దానినోరునొక్కి మిగతావిషయాలగురించి ఆలోచించడం ప్రారంభించేడు.

అతని కాళ్ళు అంతలా గడ్డకట్టుకుపోయి, అవి ఎప్పుడు నేలమీద ఆనుతున్నాయో, తనబరువు ఎలా మోస్తున్నాయో కూడా తనకి తెలియకపోయినాప్పటికీ, తనుపరిగెత్తగలగడం అతనికి కొంచెం చోద్యంగా అనిపించింది. అతనికేమో గాలిలో ఈదుతున్నట్టు, భూమితో ఏమీ సంబంధంలేనట్టూ అనిపించింది. అతనికెక్కడో దేవదూత మెర్క్యురీ(Mercury)ని రెక్కలతో ఎగురుతూ చూసినట్టనిపించి, అతనుకూడా భూమిమీద తనలాగే ఈదుతున్నట్టు భావిస్తాడా అన్న సందేహం కూడా వచ్చింది.

“చాలా సార్లు అడుగులు తడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా కూడదీసుకుని, క్రింద పడిపోయాడు…”

అతను తన శిబిరంనీ, పిల్లల్నీ కలిసేదాకా పరిగెత్తడం అన్న వాదంలో ఒక లోపంఉంది: అతనికి దాన్నితట్టుకోగల శక్తిలేదు. చాలాసార్లు అడుగులుతడబడి, చివరకి తూలిపోయి, ఒళ్ళంతా దగ్గరకు లాక్కున్నట్టు పడిపోయాడు. అతను లేవడానికి ప్రయత్నించేడుగాని విఫలమయ్యాడు.

తనింక కూర్చుని విశ్రాంతితీసుకోవాలనీ, మళ్ళీసారి తను పరిగెత్తడం కాక నడకే కొనసాగించాలనీ నిర్ణయించుకున్నాడు. లేచికూచుని, కాస్త ఊపిరి సంబాళించుకున్నాక, అతని వొళ్ళు వెచ్చగా ఉన్నట్టూ, తనకిప్పుడు బాగానే ఉన్నట్టూ అనిపించింది. అతను వణకడం లేదు, అతని గుండెలోకీ, శరీరంలోకీ, కొంత వేడిమి వచ్చినట్టుకూడా అనిపించింది. అయితే అతను తన ముక్కూ, బుగ్గలూ ముట్టుకుంటే ఏ స్పర్శజ్ఞానమూ కలగటం లేదు.

పరిగెత్తడం వల్ల వాటి పరిస్థితిలో మార్పు రాదు. చేతులకీ, కాళ్ళ సంగతి కూడా అంతే. అప్పుడతనికి గడ్డకట్టుకుపోవడం శరీరం అంతటా వ్యాపిస్తోందన్న భావన కలిగింది. దీన్ని మరిచిపోడానికీ, నిర్లక్ష్యంచేసి మిగతావిషయాలు ఆలోచించడానికీ ప్రయత్నించేడు. దానివల్ల వచ్చే ఆందోళన ఎలాంటిదో అతనికి తెలుసు; అందుకని ఎక్కడ ఆందోళన కలుగుతుందో అని భయపడ్డాడు.

కానీ ఆ ఆలోచన పదేపదే రాసాగింది… విడవకుండా; అతని శరీరంఅంతా గడ్డకట్టుకుపోయినట్టు ఒక భ్రమ కల్పించసాగింది. అది అతనికి భరించశక్యం కాలేదు. అందుకని మరోసారి పిచ్చిగా పరిగెత్తసాగేడు. ఒకసారి అతను వేగంతగ్గించి నడుద్దామనుకున్నాడు గాని, తను గడ్డకట్టుకుపోతానేమో నన్న భయం అతను మళ్ళీ పరిగెత్తేలా చేసింది.
ఇంతసేపూ, కుక్క అతని వెనక, అతని అడుగుల వెంటే పరిగెత్తింది. అతను రెండోసారి పడిపోయినప్పుడు, దాని ముందుకాళ్ళచుట్టూ తనతోకనిచుట్టి, అతని ముందు, అతనిముఖానికి ఎదురుగా, ఏమయిందా అన్న కుతూహలంతో కూర్చుంది. ఆజంతువు క్షేమంగా, వెచ్చగాఉండడం అతనికి కోపంతెప్పించి, అతణ్ణి శాంతపరచడానికా అన్నట్టు అది దాని చెవులని వాల్చేదాకా దాన్ని తిడుతూనే ఉన్నాడు.

ఈమాటు వణుకుడు ఒక్కసారి అతని శరీరం అంతా కమ్మేసింది. అతను కొరికే మంచుతో తన పోరాటంలో ఓడిపోతున్నాడు. అతని శరీరంలోకి అన్ని వైపులనుండీ అది ప్రవేశిస్తోంది. ఆ ఆలోచన అతన్ని ముందుకి తోసింది గాని, అతను వంద అడుగులకు మించి పరిగెత్తలేక, కాళ్ళు తడబడి, తలక్రిందులుగా పడిపోయాడు. అదే అతను చివరగా భయపడింది. అతను ఊపిరి తీసుకుని నిలదొక్కుకున్నాక అతను మృత్యువును గౌరవప్రదంగా ఎదుర్కోవడం ఎలాగా అని ఆలోచించేడు. అతనికి ఇప్పుడతను చేసినపని అంతగౌరవప్రదంగా కనిపించలేదు.

అతను మెడ కోసిన కోడిలా అన్నిదిక్కులా పరిగెత్తుతున్నట్టు అనిపించింది. సరిగ్గా ఆ పోలిక అతనికి తట్టింది. ఇక అతను ఎలాగూ గడ్డకట్టుకుపోక తప్పదు. అలాంటప్పుడు మృత్యువును మర్యాదగా స్వీకరించడం మంచిది అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో అతనికి మొదటితెర మత్తు ఆవహించింది. నిద్రలోనే చనిపోవడం మంచిదే అనుకున్నాడు. అది ఒక మత్తుమందు తీసుకున్నట్టు ఉంటుంది. గడ్డకట్టుకుపోవడం మనుషులనుకున్నంత ఘోరమేం కాదు. ఇంతకంటే ఘోరంగా ఎన్నో రకాలుగా చావొచ్చు అనుకున్నాడు.

అతను కుర్రాళ్ళు తన శరీరం కనుక్కోవడం ఊహిస్తున్నాడు. తనని వెతుక్కుంటూ దారివెంట వెళ్ళిన తను, హఠాత్తుగా వాళ్ళని కలిసాడు. వాళ్లతో ఉంటూనే, త్రోవవెంట ఒక మలుపు తిరిగేక తనని తను మంచులో పడి ఉండగా చూశాడు. అతనిప్పుడు తనకి చెందడు, అలా అనుకున్నా, ఇప్పుడతను, అతనిలోంచి బయటకు వచ్చేసేడు, పిల్లలపక్కన నిలబడి మంచులో తనని చూస్తున్నాడు. అబ్బో చాలా చల్లగా ఉందనుకున్నాడొక్కసారి.

తను అమెరికా తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అసలు చలి ఎలా ఉంటుందో వాళ్ళకి చెప్తాడు. తర్వాత అతని ఆలోచనలు సల్ఫర్ క్రీక్ లోని పాతకాపు వైపు మళ్ళేయి.

తనిప్పుడు ఆ పాతకాపుని స్పష్టంగా చూడగలుగుతున్నాడు… పైపులో పొగాకు పీలుస్తూ, హాయిగా, వెచ్చగా ఉన్నాడతను.

“నువ్వు చెప్పిందే నిజం. ఎంతైనా యుద్ధంలో రాటుదేరిన గుర్రానివి. నువ్వు చెప్పిందే నిజం,” అని ఆ పాతకాపుతో ఏదో గొణుగుతున్నాడు.

తర్వాత ఆ మనిషి ఎన్నడూ ఎరగని సంతృప్తినిచ్చే, సుఖనిద్రలోకి జారుకున్నాడు. ఆ కుక్క అతని ఎదురుగానే నిరీక్షిస్తూ కూచుంది. సాగి సాగి కొనసాగిన సంధ్య, చీకట్లకు త్రోవ ఇవ్వడంతో రోజు పరిసమాప్తమైంది. ఆ మనిషి ఎక్కడా చలిమంటవేయడానికి ప్రయత్నిస్తున్న జాడ కనిపించలేదు దానికి. దాని అనుభవంలో మంచులో అలా మంటవెయ్యకుండా కూచున్న మనిషిని ఎరగదు అది.

చీకట్లు ముసురుతున్నకొద్దీ దానికి చలిమంటమీద కోరిక ఎక్కువై ముందుకాళ్లు ఎత్తుతూ దించుతూ నెమ్మదిగా మూలగడం ప్రారంభించింది; మళ్ళీ అతను తిడతాడేమోనని చెవులు క్రిందకి వాల్చింది. కాని మనిషి ఏం మాట్లాడలేదు. తర్వాత గట్టిగా అరిచింది. మరికొంచెంసేపు గడిచిన తర్వాత మనిషికి దగ్గరగా వెళ్ళి చావువాసన పసిగట్టింది. ఒక్కసారి దానికి గగుర్పాటుకలిగి వెంటనే వెనక్కి తగ్గింది.

నక్షత్రాలు స్పష్టంగా పైకిలేచి, మిణుకుమిణుకుమంటున్న ఆకాశంలోకి చూసి అరుస్తూ, కాసేపు అక్కడే తచ్చాడి, తర్వాత వచ్చినత్రోవలోనే వెనుతిరిగి, తనకి పూర్వపరిచయంవల్ల ఎక్కడ తిండీ, చలిమంటా దొరుకుతాయో అటువైపు పరిగెత్తుకుంటూ పోసాగింది.

***

To read the original story in English please visit this link:

http://www.jacklondons.net/buildafire.htm

Front page image by Edwin Tappan Adney [Public domain or Public domain], via Wikimedia Commons. Photograph, A. C. Company’s dog team, Dawson, YT, 1899, Edwin Tappan Adney, Silver salts on glass – Gelatin dry plate process – 10 x 12 cm

మీ మాటలు

*