ఇలా ఉందని మన అమ్మ, ఎలా చెప్పటం?

srikanth

ఆకాశం నుంచి ఈ నేల దాకా
ఒక లేత వాన పరదా జారితే
యిక ఎందుకో నాకు ఎప్పుడో
నా తల్లి కట్టుకున్న చుక్కల చీరా నేను తల దాచుకున్న తన మల్లెపూల
నీటి యెదా గుర్తుకు వచ్చింది.

పమిట చాటున దాగి తాగిన పాలు
తన బొజ్జని హత్తుకుని పడుకున్న
ఆ ఇంద్రజాలపు దినాలు
రాత్రి కాంతితో మెరిసే
దవన వాసన వేసే ఆ
చెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ
గుర్తుకువచ్చాయి ఎందుకో, ఇప్పటికీ చీకట్లో
అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

ఉండే ఉంటుంది తను ఇప్పటికీ – ఎక్కడో –

నన్ను తలుచుకుంటో  ఏ
చింతచెట్ల నీడల కిందో
ఓ ఒంటరి గుమ్మం ముందో
కాన్సరొచ్చి కోసేసిన వక్షోజపు గాటుపై
ఓ చేయుంచుకుని నిమురుకుంటూ
తనలోనే తాను ఏదో గొణుక్కుంటూ
ఇన్ని మెతుకులు కాలేని ఆకాశాన్నీ
కాస్త దగ్గరగా రాలేని దూరాన్నీ ఎలా
అ/గర్భంలోకి అదిమి పట్టుకోవాలని
ఒక్కతే కన్నీళ్ళతో అనేకమై యోచిస్తో

వాన కానీ భూమీ కానీ మొక్క కానీ పూవు కానీ గూడు కానీ దీపం కానీ

అన్నీ అయ్యి ఏమీ కాక, ఒట్టి ప్రతీకలలోనే
మిగిలిపోయి రాలిపోయే లేగ దూడ లాంటి

మన అమ్మ
యిలా ఉందని

ఎలా చెప్పడం?

Image by Tote Mutter, Egon Schiele, 1910, oil on panel [Public domain], via Wikimedia Commons

మీ మాటలు

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    హ్మ్మ్ ….
    అమ్మా అంటూ తడుముకునే, ఎప్పటికీ
    ఎదగలేని ఈ నా నలబై ఏళ్ల గరకు చేతులకు-

    ఉండే ఉంటుంది తను ఇప్పటికీ – ఎక్కడో –

    …..
    మన అమ్మ
    యిలా ఉందని

    ఎలా చెప్పడం?
    …..
    …..నేను రాత్రి అనుకునే సమయాలలోంచి నిద్రమాని
    అక్షరాల సహారాతో అమ్మను చూస్తున్నాను
    ….ఇంకా ఏదో చూస్తున్నాను…. కలగంటున్నాను
    …నేను అమ్మ కాలేనితనం

  2. రాజేషు దేవభక్తుని says:

    కవిత చాల బాగుందండి, చదివితే కలిగిన అనుభూతిని వర్ణించడం కష్టం, బాల్యం నాటి జ్ఞాపకాలలోకి నెట్టేసింది.

    ” పమిట చాటున దాగి తాగిన పాలు
    తన బొజ్జని హత్తుకుని పడుకున్న
    ఆ ఇంద్రజాలపు దినాలు
    రాత్రి కాంతితో మెరిసే
    దవన వాసన వేసే ఆ
    చెమ్మగిల్లిన సూర్య నయనాల కాంతి కాలాలూ “

  3. mercy margaret says:

    చాలా బాగ్గుంది శ్రీకాంత్ గారు .. కనీరు కుడా అమ్మ గుర్తుగానే , తుడిచే తన చేతి వేళ్ళ కోసం ఎదురు చుస్తున్న్నట్టుగా ఉంది ..

  4. మాటలు చాలవు….

  5. ఎలా చెప్పను శ్రీకాంత్

  6. రమాసుందరి says:

    మీరిలాంటి కవితలు రాసి మమ్మల్నిఏడిపించకండి. అమ్మతనానికి మీరు అర్పిస్తున్న నివాళి చాలా గొప్పది.

  7. చాల బాగుంది . ఏడిపించారు మరి

  8. ఫీలింగ్ ని వాక్యాలలోకి ఒంపినతీరు చాలా బాగా నచ్చింది,…మంచి కవిత

  9. సి.వి.సురేష్ says:

    చాలా అద్బుత౦గా ఉ౦ది మీ కవిత. కవిత చదువుతున్నా౦తసేపు ఒక క౦ట్లో దృశ్య౦ అలా జాలువారుతూ వస్తో౦ది. కొన్ని మన పరిధిలోని దృశ్యాలు కళ్ళెదుటే చిత్రీకరి౦చబడుతున్నాయి. ఒక చక్కటి దృశ్య కవిత….! దృశ్య౦ ఇమిడి ఉన్న కవిత….!

  10. vijay kumar svk says:

    చాలా బాగా రాసారు సర్… సలాం…

Leave a Reply to సి.వి.సురేష్ Cancel reply

*