స్నేహాలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ …ఇదే నా లోకం!

Dasari Amarendraఅక్షరాలు ముందు నేర్చుకొన్నానో, పుస్తకాలు ముందు తిరగేశానో గుర్తులేదు. అక్షరాలతోనూ, పుస్తకాలతోనూ పని లేకుండా కథల మీద మక్కువ పెంచుకొన్నది నాలుగేళ్ల వయసులో. తాతయ్య కథా జగత్తులో, జానపద గాధల ఊహాలోకంలో, జంతుజాలాల మార్మిక గాథలలో.

బంటుమిల్లి పిల్లల గ్రంథాలయం, విజయవాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం,  హైస్కూలులో తెలుగూ, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల్లోని చక్కని కథలూ, కవితలూ, పద్యాలూ, వ్యాసాలూ నాకు సాహిత్యమంటే స్వతఃసిద్ధంగా ఉన్న ఆసక్తికి నీరు పోశాయి. ఆ ఆసక్తి మారాకు వేసి మొగ్గ తొడగడానికి కాకినాడ కాలేజీ రోజులు సాయపడ్డాయి. సాంస్కృతిక సమితి సహాయ కార్యదర్శిగా ఎంతోమంది సాహితీకారులనూ, కళాకారులనూ అతి దగ్గరగా చూడటం, వినడం, మాట్లాడటం.. అదో మైమరపు, ఎడ్యుకేషన్! టౌన్‌హాల్లోని సాహితీ సదస్సులు, జిల్లా గ్రంధాలయంలోని కార్యక్రమాలు, సూర్యకళామందిరంలోని నాటకాలు, మేం ఏర్పరచుకున్న సాహితీవేదిక సమావేశాలు .. అన్నం కన్నా మిన్న అయ్యాయి. జీవితానికి సాహిత్యానికి మధ్యనున్న పేగుబంధం బోధపడింది.

1975లో ఉద్యోగంలో చేరాక చేసిన మొట్టమొదటి పని పుస్తకాల సేకరణ. కొడవటిగంటి, రావిశాస్త్రి, చలం, రంగనాయకమ్మ, విశాలాక్షి లాంటి వాళ్ల పుస్తకాలే కాకుండా సాహిత్య అకాడెమీ వాళ్లూ, విశాలాంధ్ర వాళ్లూ, ‘రాదుగ’ వాళ్లూ, నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్లూ వేసిన అనువాద సాహిత్యమూ సేకరించాను. రెండు మూడేళ్లు గడిచేసరికి మూడు నాలుగు వందల పుస్తకాలు. అదో పెన్నిధి. పుస్తకాలు  చదువుకోవడం ఓ వ్యవసనమయిన రోజులవి. ఇప్పటికీ వదలని వ్యసనమది.

రాయాలనే కోరికెప్పుడు కలిగిందీ? 1976 ప్రాంతాలలో ఒకటీ రెండు కథలు ప్రజాతంత్ర లాంటి పత్రికల్లో వచ్చాయి. అప్పట్లో ఆంధ్రప్రభలో నడిచిన ‘ఇదీ సంగతి’ శీర్షికలో నాలుగయిదు లఘు వ్యాసాలు వచ్చాయి. కానీ ఆదే సమయంలో ‘నేను రాయకపోయినా ఎవరికీ ఏమీ నష్టం లేదు’ అన్న స్పృహ. దాని పుణ్యమా అని రాయడం కట్టిపెట్టి చదువుకోవడం మీదే దృష్టి పెట్టాను. స్నేహితులకు మాత్రం పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసేవాడిని. “నీ ఉత్తరాలు చక్కగా కథల్లా ఉంటాయి. కథలే రాయవచ్చు కదా” అని ఒకరిద్దరు అన్నారు గానీ నేను పెద్దగా పట్టించుకోలేదు.

మన అనుభవాలు పంచుకోవాలన్న తపన రచనలు చేయడానికి ఉన్న అనేకానేక ప్రేరణలలో అతి ముఖ్యమైనది. నేనో ప్రయాణాల పక్షిని. ఊళ్లు తిరగడం, కొండలెక్కడం, అడవులు గాలించడం, నదులు దాటడం.. నా అభిమాన విషయాలు, అలాంటి నాకు 1989 అక్టోబరులో ఓ పదిరోజులపాటు యూరప్ వెళ్ళే అవకాశం ఆఫీసు ద్వారా దొరికింది. మూడు దేశాలు, మూడు నగరాలు తిరిగాను. పది గంటలు ఆఫీసు పనీ, మరో ఆరేడు గంటలు ఊళ్లు చూడటం.. ఆ పది రోజులూ నిర్విరామంగా గడపగా అనేకానేక అనుభవాలు మనసును నింపేశాయి. వాటిల్ని కాగితం మీద పెట్టకుండా ఉండలేని స్థితికి నన్ను నెట్టాయి. అలా రాసుకుంటూ వెళ్లాను. రాతలో అరవై డెబ్భై  పేజీలు.

మా తమ్ముడు శైలేంద్ర సీనియర్ జర్నలిస్టు హనుమంతరావుగారి అల్లుడు. ఆ కాగితాలు ఆయన కంటబడ్డాయి. ఆయన ముచ్చటపడ్డారు. అప్పట్లో ‘ఉదయం’ దినపత్రికలో పనిచేస్తోన్న దేవీప్రియగారికి అందించారు. 1990లో కొన్ని వారాల పాటు ఆదివారం అనుబంధంలో సీరియల్‌గా వచ్చింది ఆ మూడు నగరాల ట్రావెలాగ్. తెలుగుదేశం మీద నా అక్షరాల దాడికి అది నాందీ ప్రస్తావన. దాదాపు అదే సమయంలో నా అనుభవాల నేపథ్యంలో చిన్న చిన్న ఇంగ్లీషు మేనేజ్‌మెంటు వ్యాసాలు రాయగా అవి ఫైనానిషియల్ టైమ్స్, ఎకనమిక్ టైమ్స్ లాంటి దినపత్రికల్లో వచ్చాయి. అలా నాకు తెలిసి తెలియకుండానే సాహితీయాత్ర మొదలయింది.

కాకినాడ రోజుల్లోనే గొప్ప గొప్ప రచయితలను దగ్గరగా చూసి, వ్యవహరించిన అనుభవం ఉన్నా నాకు సహజంగానే ఉండే సంకోచం వల్ల గాబోలు, మళ్లా రచయితల దగ్గరికి వెళ్లలేదు. ‘వాళ్లు మనకు అందని చందమామలు. దేవలోకపు జీవులు’ అన్న గౌరవంతో కూడిన బెరుకు ఉండేది. అది దేవీప్రియగారి పరిచయంతో తగ్గింది. వాసిరెడ్డి నవీన్ కథా సంకలనాలను వెలువరించడం మొదలుపెట్టిన సమయమది. ‘అదిగో ద్వారక, కవుల మందలవిగో’ అని సాహిత్యం తెలిసినవాళ్లు సరదాగా పాడుకొంటున్న రోజులవి. అలాంటి ద్వారకా హోటల్లో ఓ సాయంత్రం పూట అడుగుపెట్టాను.

కథలతో పాటు సాహితీ వ్యాసాలూ, సమీక్షలూ నా అభిమాన విషయాలయ్యాయి. అడపా దడపా కవితలూ, విరివిగా అనువాదాలూ. మధ్యమధ్యలో ఇంటర్వ్యూలు. నాకు అతిప్రియమయిన యాత్రారచనలు సరేసరి. సాహితీ మిత్రుల పరిచయాలు అన్న వ్యాపకం మెల్లగా సాహిత్య సదస్సులకు దారి తీసింది. వేదగిరి రాంబాబు గారి ‘సరికొత్త కథ’ ఆవిష్కరణలో ఇరవై ముప్పై మందితో ముచ్చట్లు, కేశవరెడ్డి గారి నవలల ఆవిష్కరణలో ఆయనతో ఆత్మీయ పరిచయం. సాహిత్య అకాడెమీ వల్ల తెలుగు కథా సదస్సు కోసం హైదరబాదు- ఇవన్నీ ఒక ఎత్తు. అప్పాజోశ్యుల -విష్ణుభొట్ల వారు  రాజారామ్ గారికి అవార్డు ఇస్తూ మంజుశ్రీ గారి సారధ్యంలో విజయవాడలో 1996లో జరిపిన రెండు రోజుల సాహితీ సదస్సు మరో ఎత్తు. సుమారు యాభై మంది ఇష్టమయిన సాహితీకారులతో రెండు రోజులు గడపడం ఎంత అదృష్టం! తిరుమల రామచంద్ర, బలివాడ కాంతా రావు, పెద్దిభొట్ల లాంటి గొప్పవారి కొత్త పరిచయం కలిగిందక్కడే!

ఈ లోపల ఢిల్లీలోని మా సాహితీ అనుబంధానికి క్రమరూపం కల్పించాం. నేనూ, లక్ష్మీరెడ్డి గారూ, రంగారావు గారూ, సంపత్, తోలేటి – మేం అయిదుగురమే కాకుండా మాలాంటి సాహితీ ఆసక్తి వున్న మరో పదిమందిని కూడదీసి, నెలకోసారి – ఒక్కొకసారి ఒక్కొక్కరి ఇంట్లో- ఒక్కో ఆదివారం కలిసి గడిపే ఏర్పాటు చేసుకున్నాం. ఒకరి సాహిత్యకృషిలో ఇంకొకరు సాయపడడం, రాసినవి చదవడం, ముఖ్యమయిన సాహితీ వార్తలు అందరూ పంచుకోవడం, ఢిల్లీ వచ్చే రచయితలతో గోష్టి ఏర్పాటు చేసుకోవడం – ఇలా సాగింది మా బృందపు కార్యక్రమం. దాదాపు ఏడేళ్లు నిరాటంకంగా సాగిన వేదిక ఇది.

శ్రీపతి గారికి చలంగారంటే భక్తి. ఆయన శతజయంతి సభ ఢిల్లీలో కూడా నిర్వహించాలని భగీరధులయ్యారాయన. అదో గొప్ప సంఘటన. ఆయన నిర్విరామ కృషి, మా బృందపు చేయూత – సభని దిగ్విజయం చేశాయి. మహీధర, వాడ్రేవు వీరలక్ష్మి దేవి, కుప్పిలి పద్మ, అంపశయ్య నవీన్, వావిలాల సుబ్బారావు, పీ. సత్యవతి, మరో అయిదుగురు కవులూ రచయితలూ ఈ సభల కోసమే ఆంధ్ర నించి వచ్చారు. అప్పుడు రాజ్యసభ సెక్రెటరి జనరల్ గా వున్న వీ. యస్. రమాదేవి గారు ఉత్సాహంగా సభల్లో పాల్గొన్నారు.

శ్రీపతి గారి పూనిక పుణ్యమా అని ఢిల్లీ ఏపీ భవన్ సిబ్బంది యావత్తూ సభలకు ఉతమిచ్చారు.  ‘ తెలుగు సాహితి ఢిల్లీ’ రథసారథి రామవరపు గణేశ్వర రావు గారు సరే సరి. వెరసి రెండు మూడు వందల మంది ప్రేక్షకులతో సభ చక్కగా జరిగింది.అదే ఒరవడి లో నేనూ, లక్ష్మీరెడ్డి గారు చలం సభలకు విజయవాడ, హైదారాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడా పాల్గొన్నాము.

ఇది మా బృందం లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఒరవడి కోనసాగించాలనిపించింది. కథాసాహితీ నవీన్ తో అప్పటికే అంటూ వచ్చాను –” మీ పుస్తకం ఆవిష్కరణ సభ ఒకటి మా వూళ్ళో కూడా ఒకటి ఉండాలి ,”అని. అలా  ‘కథ96’ ఆవిష్కరణ అక్టోబర్ 1997 లో ఢిల్లీ లో అని నిర్ణయించుకున్నాము. అప్పుడు సాహిత్య అకాడమీ కి కార్యదర్శి గా మళయాళీ కవి సచ్చిదానందన్ ఉండేవారు. అంతకు ముందు ఆయన ‘ ఇండియన్ లిటరేచర్ ‘ కు ఎడిటర్ గా పని చేశారు. పుస్తకం ఆవిష్కరించడానికి ఆయన సంతోషంగా అంగీకరించారు. ఇది పెద్ద ప్రయత్నం కాబట్టి ఒక స్థిరమైన సంస్థ అండదండలుండాలనిపించి ఇటు గణేశ్వర రావు గారి ‘ తెలుగు సాహితి’ నీ, అటు ఢిల్లీ ఆంధ్రా ఆసోసియేషన్ కృష్ణమూర్తి గారినీ, గోవర్థనరావు గారినీ సహాయం అడిగాము. ‘ ఆర్థిక భారం మాది, ఆర్గనైజేషన్ భారం మీది, ‘ అని ఫ్రీహాండ్ ఇచ్చారు. నవీన్, శివారెడ్డి, దేవీప్రియ, కాళీపట్నం, శివశంకర్ పాపినేని , ‘కథ96’ లో ఎన్నికైన కథారచయితలు ఆరేడు మంది – అదో పండుగ. ఆవిష్కరణ తో పాటు పూర్తి రోజు కథాసదస్సు పెట్టుకున్నాము. వాకాటి ప్రత్యేక అతిధి. కళింగ కథ గురించి మాట్లాడారు కాళీపట్నం.

ఢిల్లీ లో ఉండటం వల్ల అందివచ్చిన మరో సాహితీ అవకాశం -గీతా ధర్మరాజన్ నడిపే కథాసంస్థ కు నాలుగయిదేళ్ళు తెలుగు కథల నామినేటింగ్ ఎడిటర్ గా వ్యవహరించటం. నవీన్ వాళ్ళు ఆ ఏడాది వచ్చిన మంచి తెలుగు కథలను ఏర్చికూర్చి తెలుగు కథా సంకలనాలు వెలువరిస్తే , గీతా ధర్మరాజన్ వాళ్ళు ఆ ఏడాది వివిధ భాషలలొ వచ్చిన మంచి కథలను నామినేటింగ్ ఎడిటర్ల సాయంతో గుర్తు పట్టి, వాటిల్ని ఇంగ్లీష్ లోకి అనువదింపచేసి వార్షిక సంకలనాలు వెలువరించారు. ఖదీర్ బాబు, డా. వి.చంద్రశేఖరావు, గోపిణి కరుణాకర్, శ్రీరమణ  లాంటి వాళ్ళ కథలను ఇంగ్లీష్ లోకి పంపి పదిమందికి అందించే ప్రక్రియ లో నేనూ భాగస్వామినయ్యానన్న సంతృప్తి మిగిలింది. కానీ ‘ కరడు కట్టిన పురుషాధిక్జ్య మనోహరపు పురాణశ్రేణి గాథ కు పంచదార పూత పూసి వదిలిన ” మిథునం” ను నామినేట్ చేయకుండా ఉండలేకపోయానే , అన్నచింత మాత్రం ఇప్పటికీ వదలలేదు.

ఇలా నా సాహిత్యీ యాత్రలో రకరకాల ఘట్టాలు…

ఇంతకూ నేను పాఠకుడినా? రచయితనా? సాహితీ కార్యకర్తనా?

చదివేసి వూరుకోకుండా మంచి సాహిత్యాన్ని పదిమందికీ  పంచే ప్రయత్నం చేసే పాఠకుడి ని.

సాహిత్యామూ, సాహిత్య కారులూ ఎక్కడ కనిపించినా వాళ్లను పదిమందితోనూ కలిపే వ్యసనమున్న కార్యకర్త ను.

అంతా కలిసి ఓ రెండు వేల పేజీలు రాసిన మాట నిజమే కానీ, అదంతా సాహిత్యమనీ, నేను రచయితననీ అనుకోవడానికి ధైర్యం చిక్కడం లేదు.

( దాసరి అమరేంద్ర 60 ఏళ్ల జీవన యాత్రా  సంరంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో మార్చి 14 న విడుదల కానున్న పుస్తకం నుంచి కొన్ని జ్ఞాపకాలు)

Image by Pinisetti

మీ మాటలు

 1. మహాశయా,

  నా పేరు వంగూరి చిట్టెన్ రాజు. మనం మూడు సార్లు కలుసుకున్నాం. మొదటి సారి కాకినాడలో మన ఇంజనీరింగ్ కాలేజీ డైమండ్ జూబిలీ సందర్భంగా మీరే నాకు…నా ఫొటోకి కాదు….దండ వేసి అందరి తరఫునా సత్కరించారు. ఆ తరువాత మీ ఆధ్వ్రర్యంలోనే, నిడమర్తి వారి ఇంట్లో అంబిక గారూ మొదలైన ప్రముఖుల సమక్షంలో నా మొట్ట మొదటి కథా సంపుటి అందరికీ పరిచయం చేసారు. రెండు నెలల క్రితం కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారు ఢిల్లీ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో మిమ్మల్ని కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. అప్పుడు మీరు అడిగిన అన్ని ప్రశ్నలూ…….ముఖ్యంగా “మీరు ఎప్పుడూ ప్రధమ పురుషలోనే..అంటే నేను చెప్తున్నట్టుగానే ఎందుకు రాస్తారు…ఇతర ప్రక్రియలు మీకు నచ్చవా అనీ,… అలాగే అసలు మంచి కథ అంటే నిర్వచనం ఏమిటీ అని కూడా అడిగారు… అప్పుడు నాకు తోచిన సమాధానం చెప్పాను…అవి మీకు నచ్చాయి అనే అనుకుంటున్నాను….మీ వ్యాసంలో ప్రస్తావించిన ఆనేక మంది ప్రముఖ రచయితలతో పరిచయం ఉన్న మీలాంటి గొప్ప వారు నాకు కూడా తెలుసు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అన్నట్టు, మీరు నాకు ఇచ్చిన శేఫాలిక కథా సంపుటి చాలా సార్లే చదివాను. చాలా మంచి కథలు..

  నేను మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది. మీరు అంగీకరిస్తే మరొక సారి మిమ్మల్ని కలుసుకుంటాను.

  –వంగూరి చిట్టెన్ రాజు

  • amarendra says:

   రాజు గారూ..చాలా థాంక్స్..మీ రాక కోసం వెంకటేశం లాగా ఎదురుచూస్తూ ఉంటాను!!

 2. అమరేంద్ర గారూ
  మిమ్మల్నిక్కడ చదవడం బాగుంది . ‘ ‘కరడు కట్టిన పురుషాధిక్జ్య మనోహరపు పురాణశ్రేణి గాథ కు పంచదార పూత పూసి వదిలిన ” మిథునం” ను నామినేట్ చేయకుండా ఉండలేకపోయానే , అన్నచింత మాత్రం ఇప్పటికీ వదలలేదు.”అన్న మీ మృదుత్వం లోని కాటిన్యం కూడా బాగుంది.

  డిల్లీ కి వచ్చినపుడు మీరిచ్చిన ఆత్మీయ ఆతిద్యం ,లక్ష్మి గారి స్నేహశీలత ఈ సందర్భం లో జ్ఞాపకం వచ్చాయి .మీరు బహుకరించిన పుస్తకం చాలా నచ్చింది నాకు .మీ డిల్లీ సహృదయ స్నేహితులకు కూడా నా కృతజ్ఞతలు.

 3. వావ్! సారంగ లో మీరు! అంతర్జాలంలో కనిపించి కనువిందు చేసారు.మంచిమనసున్న మీ దంపతుల స్నేహం మా అదృష్టం.

  • amarendra says:

   భలే వారే! లక్నో నవాబుల్లా మనం vaadinchukovaddu ..అది మన నలుగురి అదృష్టం..మళ్ళా kaluddaam

 4. అమరేంద్రగారూ, మళ్ళీ ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళకి ఇక్కడ మీ దర్శనం. మహదానందంగా ఉన్నది. 1990లలో గీతగారి కథ వార్షిక సంచికలు నాకు నిత్య పఠనీయాలుగా ఉండేవి.
  2002లోనో 2003లోనో హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మీ శేఫాలిక ఆవిష్కరణ, అదంతా ఒక కుటుంబ వేడుకలాగా జరగడం ఇంకా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. హైదరాబాదులోనూ బెంగుళూరులోనూ మళ్ళి కలిసి ముచ్చటించుకున్నా మీతో కలిసి ప్రకృతి ఆరాధన యాత్ర చెయ్యలేదే ఇంకా అన్నలోటు అలాగే ఉంది. మీరు అమెరికా రండి. మిషిగన్‌లోనే బోలెడు చక్కటి ప్రదేశాలు ఉన్నాయి.

 5. amarendra says:

  థాంక్స్ నాసీ గారూ..మనం తప్పకుండా యాత్ర చేద్దాం..ఓ పాత పాత గుర్తొస్తోంది..చూసే కనులకు మనసుంటే, ఆ మనసుకు కూడా కనులుంటే…ఎటు చూసినా అందమే..ఏది నా అనుభవం లోకి వచ్చిన సంగతే!! తప్పకుండా మిషిగన్ అందాలు చూద్దాం..మీరు డిల్లి వచ్చినపుడు నాకనులు మీవిగా చేసుకుని ఢిల్లీ చూద్దురు గాని!!

 6. ns murty says:

  అమరేంద్ర గారూ,

  నేను మీ సాహితీ ప్రయాణాన్ని దూరం నుండే వీక్షించిన వ్యక్తిని. భరాగో గారి ద్వారా ఒకటి రెండు సార్లు కలవడానికి ప్రయత్నించినా సఫలమవలేదు. ఈ సారి ఎప్పుడైనా ఢిల్లీ వచ్చినపుడు అవుతుందేమో ప్రయత్నిస్తాను. మా అంకుల్ RS Krishna Moorthy కి మీతో ఎక్కువ పరిచయం అనుకుంటాను.

  • amarendra says:

   మూర్తిగారూ థాంక్సండి! మనం అప్పట్లో ప్రయత్నం చెయ్యడం గుర్తుంది..ఢిల్లీ రండి తప్పకుండా కలుద్దాం

 7. kalluri bhaskaram says:

  అమరేంద్ర గారూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని పలకరించే అవకాశం కలిగింది. కొన్నేళ్ళ క్రితం bengaluuru లో మీ ఇంట్లో మనం కలుసుకున్నాం. ఆత్మీయమైన మీ ఆతిథ్యం పొందాను. ప్రస్తుతానికి వస్తే, ‘మిథునం’ గురించి మీ వ్యాఖ్య ఆసక్తి కలిగించింది. అయితే పూర్తిగా అర్థం కాలేదు. అభ్యంతరం లేకపోతె కాస్త వివరిస్తారా?

  • amarendra says:

   భాస్కరంగారూ , బావుంది ఇలా అంతర్జాల ‘అంతరిక్షంలో’ కలుసుకోవడం!! ముందు మీకు థాంక్స్, మీరు ఆంధ్ర ప్రభలో ఉన్నపుడు ఎన్నో పుస్తకాలను విపులంగా సమీక్షించే అవకాశం ఇచ్చారు ,,ఇపుడు అవి కొన్ని నా కొత్త పుస్తకం: సాహితీ యాత్ర- వ్యాసాలూ,interviewloo లో ఉన్నాయి..మరోసారి థాంక్స్
   మిథునంమీద నా వ్యాఖ్యను simplegaa చెప్పాలంటే అది అనాది దినాల సీతారాముల ఆదర్శ దాంపత్యాన్ని శ్లాఘిస్తూ రాసిన కథ.. అది నాకు బాగా అభ్యంతర కరం..అదీ సంగతి!!

   • kalluri bhaskaram says:

    థాంక్స్ అమరేంద్ర గారూ, ప్రత్యేకించి మిథునం గురించి కాకపోయినా ఒక సెక్షన్ అఫ్ writings మీద నాకు కూడా మీ కున్న అభిప్రాయమే ఉంది. అందుకే మీ వ్యాఖ్య ఆసక్తి కలిగించింది. ఇలా మాట్లాడుకోగాలిగినందుకు సంతోషంగా ఉంది. మీ కొత్త పుస్తకం వచ్చిన సందర్భంగా మీకు అభినందనలు.

మీ మాటలు

*