మనిషి వోడిపోతున్నాడు, తుపాకి గెలుస్తోంది!

March_on_Washington_for_Gun_Control_032 (2)

1999లో ‘తుపాకి’ అని ఒక కథ రాశాను. అందులో అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో పెరుగుతున్న కిరణ్ అనే ఒక తెలుగు పిల్లవాడు, పదేళ్ళ వాడు, తనతోటి తెల్ల స్నేహితుల ప్రోద్బలంతో తనక్కూడా ఒక తుపాకి కొనిమ్మని వాళ్ళ నాన్నని అడుగుతాడు. కథ కొన్ని మలుపులు తిరిగాక, తుపాకి ఎటువంటి ఘాతుకాన్ని సృష్టిస్తుందో కళ్ళారా చూసి, తన కళ్ళముందే తన బడిలోనే తన ప్రాణ స్నేహితుడు ఆ మారణహోమానికి బలైపోవడం చూసి, కిరణ్ – నాన్నా, నాకు తుపాకి వద్దు – అనడంతో కథ ముగుస్తుంది. ఈ కథని నేను 1999 ఫిబ్రవరి ప్రాంతాల్లో రాశాను.

ఈ కథ రాసి, వంగూరి ఫౌండేషను వారి ఉగాది కథల పోటీకి పంపించాను. పంపిన కొద్ది రోజులకి (ఏప్రిల్ 20న) కొలరాడో రాష్ట్రంలో కొలంబైన్ హైస్కూలు మారణహోమం జరిగి ఈ దేశం మొత్తాన్నీ అచేతనం చేసేసింది కొన్నాళ్ల పాటు. ఆ మారణహోమానికి కారణం నా కథలో చెప్పినలాంటి జాతి విద్వేషం కాదు కానీ, మారణహోమాన్ని జరిపింది బడి విద్యార్ధులే, నా కథలో సూచించినట్టుగా కొంత మానసిక అనారోగ్య బాధితులే. నా కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ తరవాత అనేక తెలుగుకథల సంకలనాల్లో చోటు చేసుకుంది. కానీ ఈ కథని తలుచుకున్నప్పుడల్లా నాకు ఆ బహుమతి గుర్తు రాదు. కొలంబైనే గుర్తొస్తుంది. బాధే మిగుల్తుంది.

అమెరికాకి తుపాకులు కొత్తకానట్టే తుపాకుల వల్ల జరిగే హింస, ప్రాణనష్టం కూడా కొత్త కాదు. వ్యక్తిగతంగా ఆయుధాలను కలిగి ఉండే హక్కు, వాటిని వాడగలిగే హక్కు అమెరికను రాజ్యాంగములో రెండవ సవరణద్వారా ఇవ్వబడింది. ప్రాథమిక పౌరహక్కులను నిర్వచించి ఆమోదించడంలో వాక్-స్వాతంత్ర్యాన్ని ఇచ్చిన మొదటి సవరణ వెనువెంటనే ఈ సవరణ ఉండటం వలన ఆయుధధారణకి పౌరుల ఆలోచనా పరిధిలోనూ, అమెరికను రాజకీయ పరిధిలోనూ ఉన్న ప్రాముఖ్యత మనకి అర్ధమవుతున్నది.

రిపబ్లికన్ పార్టీ అంటే ప్రభుత్వపు చొరవని తగ్గించాలని ప్రయత్నించే పార్టీగా, తద్వారా ప్రజల వ్యక్తిగత హక్కుల్ని (ఆయుధ హక్కులతో సహా) కాపాడే పార్టీగా పేరుబడింది ఇటీవలి కాలంలో. ఆయుధాలని నిరోధించాలి, లేదా కనీసం నియంత్రించాలి అనేది లిబరల్ ఎజెండాగా ముద్ర బడింది. ఐతే సాధారణంగా లిబరల్ ఉద్యమాలని నెత్తికెత్తుకునే డెమోక్రాటిక్ నాయకులు కూడా ఈ ఆయుధ నియంత్రణని చేపట్టేందుకు సిద్ధంగా లేరు.

ఇరవయ్యో శతాబ్దపు చివరి భాగంలో రిపబ్లికన్ పార్టీకి జీవం పోసిన అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో ఆయన సహచరుడు జేంస్ బ్రేడీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాల వలన ఆయనకు పక్షవాతం వచ్చింది. గాయాలనుండి కోలుకున్న తరవాత ఆయన చిన్న తుపాకుల నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించారు. ఆ సంఘటన జరిగిన ఎనిమిదేళ్ళ తరవాత ఒక డెమొక్రాట్ అధ్యక్షుడు, బిల్ క్లింటన్ ఈ చట్టాన్ని అమలు చేశారు. దాన్ని బ్రేడీ చట్టమని వ్యవహరిస్తారు.

ఒక రిపబ్లికన్ అధ్యక్షుడి సహచరుడికి జరిగిన దుర్ఘటనకి సుమారు పదేళ్ళ రిపబ్లికన్ పార్టీ పరిపాలనలో రాజకీయ ప్రతిచర్య జరగలేకపోయింది అంటే అర్ధమవుతుంది ఈ వ్యవస్థ ఎంత పటిష్ఠంగా ఉన్నదో! ఇదొక రాజకీయ వింత. బ్రేడిలా లో భాగంగా పెద్ద తుపాకులు, రైఫిళ్ళు, ఎక్కువ సంఖ్యలో తూటాలని నింపుకునే తుపాకులు (వీటన్నిటినీ కలిపి ఎసాల్ట్ వెపన్స్ అని వ్యవహారిస్తుంటారు) 1994లో నిషేధించబడినాయి. ఆ నిషేధపు గడువు 2004లో ముగిసిపోయింది, రిపబ్లికన్ పరిపాలనలో. దాన్ని తిరిగి ధృవీకరించే ప్రయత్నం చెయ్యలేదెవరూ. అప్పటికి అందరి దృష్టీ ఇరాకుయుద్ధం మీదా, తీవ్రవాదంపై యుద్ధమ్మీదా కేంద్రీకృతమై ఉంది.

చారిత్రికంగా రాజకీయంగా జరిగిన సంఘటనలు అలా ఉంచితే, ఇటీవలి కాలంలో, అంటే గత మూడు నాలుగేళ్ళలో జరిగిన తుపాకి కాల్పుల దాడులు, ఒకదాన్ని మించి మరొకటి దేశప్రజలందరిలో భయాందోళనలని రేకెత్తించాయి.

  • వర్జీనియా టెక్ (2007) 32 మంది మరణించారు, 17 మంది గాయపడ్డారు. జరిగింది యూనివర్సిటీ కేంపస్ లో, చేసింది ఒక యూనివర్సిటీ విద్యార్ధి, అతనికి చిన్నప్పటినించి మానసిక రుగ్మతలున్నాయి.
  • ఫోర్ట్ హుడ్, టెక్సస్ (2009) 13 మంది మరణించారు, 29 మంది గాయపడ్డారు. జరిగింది ఆర్మీ బేస్ మీద మెడికల్ సెంటర్లో. చేసింది ఆర్మీలో మేజర్ గా ఉన్న 39 ఏళ్ళ సైకయాట్రిస్ట్. ఇతనికీ దారుణమైన మానసిక సమస్యలున్నాయని దర్యాప్తులో తెలిసింది.
  • ట్యూసాన్, అరిజోనా (2011) కాంగ్రెస్వుమన్ గేబ్రియేల్ గిఫర్డ్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆరుగురు మరణించారు, మరో 13 మంది గాయపడ్డారు. జరిగింది ఒక సూపర్ మార్కెట్లో, చేసింది 22ఏళ్ళ యువకుడు. అరెస్టయిన తరవాత అతను తీవ్రమైన మానసిక అనారోగ్యంతో ఉన్నాడని తేలింది.
  • ఆరోరా, కొలరాడో (జూలై 2012) పన్నెండు మంది మరణించారు. డెబ్భై మంది గాయపడ్డారు. జరిగింది సినిమాహాల్లో, సినిమా జరుగుతుండగా. చేసింది 24 ఏళ్ళ యువకుడు, కాలేజి విద్యార్ధి. ఇతనికీ మానసిక రుగ్మత అని డిఫెన్సు లాయర్లు వాదిస్తున్నారు.
  •  విస్కాన్సిన్ గురుద్వారా (ఆగస్టు 2012) ఆరుగురు మరణించారు, నలుగురు గాయపడ్డారు. జరిగింది గురుద్వారా సిక్కు మతాలయంలో ఆదివారం ప్రార్ధనలు జరిగే సమయంలో. చేసింది నలభయ్యేళ్ళ ఆర్మీ వెటరన్. ఇతనికి జాత్యహంకార నేపథ్యం ఉన్నది.
  • న్యూటవున్, కనెక్టికట్ (డిసెంబర్ 2012) 27 మంది మరణించారు. అందులో ఇరవైమంది ఒకటో తరగతి చదువుతున్న ఆరేడేళ్ళ పిల్లలు. చేసింది 20 ఏళ్ళ యువకుడు. ఇతనికి మానసిక అనారోగ్యాలు ఉన్నవా లేదా అని ఇంకా తేలలేదు.

కొద్ది వ్యవధిలోనే చాలా మంది బలవ్వడం, ఇటువంటి సంఘటన జరుగుతందేమోనని ఊహించలేని చోట్ల ఇవి జరగడం, ఈ ఘాతుకాలకి ఒడిగట్టినవారు యువకులు కావడం ఈ సంఘటనల అన్నిటి మధ్యా సామాన్యంగా ఉన్న లక్షణాలు. అంతే కాదు, ముద్దాయిలు అందరూ ఏదో ఒక తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది.

తుపాకి చెడ్డదా? తుపాకి పట్టుకున్న మనిషి చెడ్డవాడా? తుపాకి పట్టుకున్న మనిషిలో ఉన్న బుర్ర చెడ్డదా? అమెరికను సమాజం ఈ ప్రశ్నలతో కుస్తీ పడుతోంది ప్రస్తుతం.

కనెక్టికట్ రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాలలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇదివరకెన్నడూ లేనంతగా తుపాకులని నియంత్రించాలనే డిమాండ్ మిన్నుముట్టింది. దేశ ప్రజలు ఇంకా ఆ విస్మయాన్నించి తేరుకోకముందే రాజకీయులూ, అరాజకీయులూ అరుపులు మొదలెట్టేశారు. వారికి తోడు మీడియా వారు శాయశక్తులా హోరెత్తిస్తున్నారు. మధ్యలో మామూలు ప్రజలు కూడా తమ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అర్జంటుగా తుపాకుల అమ్మకాల్ని అరికట్టాలి అన్నారు. లేదు లేదు, రిజిస్టరు చేసి ఉన్న దుకాణాలైతే పరవాలేదు, అక్కడక్కడా ఎగ్జిబిషన్లలాగా పెట్టి అమ్మేస్తున్నారు, వాళ్ళని అరికట్టాలి ముందు అన్నారు.

వారంరోజుల పాటు ఉగ్గబట్టుకుని నిశ్శబ్దంగా ఉన్న ఎన్నార్యే సింహం అప్పుడు గొంతు విప్పింది. తుపాకులు కాదు చంపేది, తుపాకుల్ని పట్టుకున్న మనుషులు అంది. గన్ను పట్టిన చెడ్డవాణ్ణి ఆపాలంటే అక్కడ గన్ను పట్టుకున్న మంచోడు ఉండాలన్నది. ముందు మానసిక ఆరోగ్య వ్యవస్థని చక్కబరచాలన్నది. చివరికి తప్పంతా వినోద పరిశ్రమదే, పిచ్చి పిచ్చి హింసతో నిండిన సినిమాలు, టీవీ షోలు, విడియో గేములు ప్రజలమీదికి వదిలేసి మన యువతని తప్పుదారి పట్టిస్తున్నారు వీళ్ళన్నది, ఉరుమురిమి మంగలం మీద పడినట్టు. ఐతే ఈ సందడి అంతటిలోనూ అసలు కొన్ని మౌలికమైన విషయాలు వినబడకుండా పోతున్నాయి.

గేలప్ పోల్ ఒకదాని ప్రకారం 47 శాతం అమెరికను పౌరులు కనీసం ఏదో ఒకరకమైన తుపాకిని కలిగి ఉన్నారు. ఇంచుమించు వీరందరూ ఆయుధధారణ విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని సహించబోమని తెగేసి చెప్పారు. కేవలం 26 శాతం మంది మాత్రమే సభ్యసమాజంలో తుపాకులకి స్థానం లేదనీ, తుపాకులని పూర్తిగా నిషేధించాలనీ అభిప్రాయపడ్డారు. ఆయుధ హక్కులని తలకెత్తుకునే ఎన్నార్యే వంటి సంస్థలు రాజకీయంగా బలమైనవే, సందేహం లేదు. కానీ వాటికి ఆ బలం ఎలా వచ్చిందో పైన చెప్పిన గణాంకాలని బట్టి కొంత అర్ధం చేసుకోవచ్చు. రాజకీయ పార్టీలకి అతీతంగా అనేక రాజకీయ నాయకులే స్వయంగా తుపాకి ధారులైనప్పుడు, రెండవ సవరణని అంతర్గతంగా నమ్మేవారై యున్నప్పుడు ఆ బలగాలని అధిగమించి తుపాకి నిషేధ ఉద్యమాలు ఏవో సాధిస్తాయని ఆశించడం అత్యాశే అవుతుంది.

పైగా, ఇప్పుడూ కొత్త అమ్మకాలని నిషేధించడమో, వాటిపై మరిన్ని ఆంక్షలు విధించడమో ఈ సమస్యని పరిష్కరించలేదు. ఎందుకంటే, ఇప్పటికే సుమారు 30 కోట్ల తుపాకులు అమెరికను పౌరుల చేతుల్లో (ఇళ్ళల్లో) ఉన్నాయని అంచనా. అంటే, దేశంలో వివిధ మిలటరీ, పోలీసు, తత్సంబంధ యూనిట్ల తుపాకులు కాక, కేవలమూ పౌరుల ఆధీనంలో ఉన్నవి.

30 కోట్లు! అమెరికా జనాభా 32 కోట్లలోపే. అంటే ఇంచుమించు ప్రతి అమెరికనుకీ – అప్పుడే పుట్టిన పసిబిడ్డ నించీ కాటికికాళ్ళు చాచుకునున్న వృద్ధునివరకూ తలా ఒక తుపాకి ఉన్నదన్నమాట. ఇది కాక ఏటా సుమారు 40 లక్షల కొత్త తుపాకులు మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి. అందుచేత, ఏదో రాజకీయ మాయాజాలం జరిగి అకస్మాత్తుగా రెండవ సవరణ ఉపసంహరించబడినా కూడా ఇప్పటికే పౌరుల ఆధీనంలో ఉన్న ఈ 30 కోట్ల తుపాకులని నియంత్రించడం అసంభవమైన పని. న్యూటవున్ కేసులో నిందితుడు ఏడం లాన్జా తన తల్లికి చెందిన తుపాకులని ఉపయోగించాడు తన మారణహోమానికి – కొత్తగా కొనలేదు.

ఇక్కడ నా అనుభవంలోనించి ఒక చిన్న పిట్టకథ. టీనేజి వయసులో పిలిస్తే పలికినట్లు వస్తుండేది కోపం నాకు. సమాజం మీద, మనుషుల మీద, వారు వీరని లేదు. అవ్యాజమైన ప్రేమలాగానే ఈ అవ్యాజమైన కోపం. కాలేజి ముగిశాక క్రిక్కిరిసిన సిటీబస్సులో వస్తుంటే, మధ్యలో ఏదో స్టాపులో వాళ్ళు బస్సు ఆపి ఎంతకీ కదలకపోతే ఆ ఉక్కలో, చిరాకులో ఆ బస్సు డ్రైవరు కండక్టర్ల మీద విపరీతమైన కోపం వచ్చేది. నా చేతిలో గనకా ఆక్షణాన ఒక తుపాకి ఉంటే వాళ్ళని బెదిరించి వెంటనే బస్సు కదిలేలా చేసేవాణ్ణి. అప్పటికీ వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసి, నేనే బస్సుని నడిపించుకు పోయేవాణ్ణి (నాకు డ్రైవింగు రాకపోయినా) నా కలల్లో.

kottapaliఅదృష్టవశాత్తూ నా దగ్గర తుపాకి లేదు. నా తరం తోటి విద్యార్ధులు, కొన్ని వేలమంది విజయవాడ బస్సుల్ని ఉపయోగించి ఉంటారు. ముందటి తరవాతి సంవత్సరాల్లో లక్షలమందో, కోట్లమందో అవే బస్సుల్లో ప్రయాణించి ఉంటారు – వాళ్ళెవ్వరి దగ్గరా తుపాకులు లేవు. ఐతే ఇప్పటికీ ఒక ప్రశ్న. నా దగ్గరే గనక ఆ పూట తుపాకి ఉండి ఉంటే ఆ డ్రైవరు ప్రాణాలతో ఉండేవాడా?

వ్యక్తిగత బాధ్యత, దానికి తగిన ప్రవర్తన – పైన జరిగిన సంఘటనలు అన్నిటిలోనూ, తరవాత జరిగిన చర్చలో ఎక్కడా ఈ వ్యక్తిగత బాధ్యత గురించిన మాట వినబడలేదు. అతగాడికి మానస రుగ్మత అట .. అంతే, అదొక మంత్రం. ఆ మాట అనేస్తే అంతా అర్ధమైపోతుంది. ఇంక ఎవ్వరూ దాన్ని గురించి బాధపడక్కర్లేదు. ముద్దాయి ప్రాణాలతో ఉన్నసందర్భంలో అతను వ్యక్తిగతంగానే నేరారోపణ ఎదుర్కున్నప్పటికీ, తత్సంబంధ విశ్లేషణలో ఆ వ్యక్తికి సంబంధించిన కోణం దాదాపుగా కనుమరుగై ఉన్నది. ఇతరత్రా వ్యక్తిగత స్వేఛ్ఛనీ, వ్యక్తిగత హక్కుల్నీ, బాధ్యతల్నీ పరమ ప్రమాణంగా భావించే అమెరికను సమాజం, అమెరికను మీడియా, ఈ విషయంలో పరమ సైలెంటయిపోయింది. ఎందుకంటే – భయం. వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి అంటే, ఎవరికి వాళ్ళే తమని తాము అద్దంలో చూసుకోవాలి గనక.
పోయిన వారం ఇక్కడ మావూళ్ళో (డెట్రాయిట్లో) ఒక రేడియో షో వింటున్నాను. మాట్లాడుతున్న అతను మాజీ గేంగ్ మెంబర్. ప్రయత్న పూర్వకంగా అవన్నీ విడిచిపెట్టేసి ఇప్పుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ, తన చుట్టు పక్కల వాళ్ళకి సహాయం చేసేట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడట గత ఐదేళ్ళగా. అతను చెప్పాడు, ఈ సంఘటనని గురించి మాట్లాడుతూ – నిజమే తుపాకులున్నై. నిజమే మానసిక రుగ్మత కూడా ఉంది. ఐనా మనిషిగా నీకంటూ ఒక విలువుంది, ఒక ఛాయిస్ ఉంది. నువ్వు తుపాకి వాడక్కర్లేదు. ఆ రోజు ఆ బడికి పోయి ఆ పిల్లలందరినీ చంపనక్కర్లేదు. మనిషిగా నీకా ఛాయిస్ ఉంది. బాధ్యత కూడా. కానీ ఇది ఎవరికీ పట్టటంలేదు.

వినోదం వినోదం కోసమే. సినిమాలో చూపించే కాల్పుల్ని, చంపడాలని, నరుక్కోవడాలని ఎవరూ నిజమనుకోరు. చిన్నప్పుడు కత్తులు, బాణాలు, తుపాకుల వంటి ఆటవస్తువులతో ఆడుకున్నట్టే పెద్దయినాక ఈ వినోద సాధనాలు. అంతదాకా ఎందుకు – పరమశాంత స్వభావుడినైన నాకు విపరీతమైన రక్తపాతంతో నిండి ఉండే క్వెంటిన్ టరంటీనో సినిమాలంటే చాలా ఇష్టం. మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేవరైనా – అమ్మో, అంత వయొలెన్సు మేం భరించలేం అంటే, నాకు నవ్వొస్తుంది. అది సినిమా, వినోదం కోసం తీసినది అనే విచక్షణ తెలియదా అని విస్తుపోతుంటాను.

న్యూటవున్ సంఘటన వంటి మహాఘాతుకచర్య తరవాత మొట్టమొదటి ప్రకటనలోనే ఎన్నార్యే వినోద పరిశ్రమ మీద విరుచుకు పడేప్పటికి సినిమా-టీవీ-విడియోగేంల వాళ్ళు మ్రాన్పడిపోయారు. ఈ హింస మా వల్ల రావడం లేదు అని గట్టిగా చెప్పలేరు. ఏమో ఎక్కడన్నా లింకున్నదేమో అని భయం. దీనికీ మాకూ ఏమీ సంబంధం లేదని అసలే చెప్పలేరు – మనసులేని కౄరులుగా కనిపిస్తామేమో అని మరింత పెద్ద భయం. మింగలేకా కక్కలేకా తలకిందులవుతున్నారు. ఏమాటకామాట – పరిశ్రమలో అతిహింస, తుపాకుల సంస్కృతికి సంబంధించిన సబ్జక్టులతో పని చేస్తున్న రచయితలూ, దర్శకులూ, నిర్మాతలూ అందరూ భుజాలు తడుముకుంటున్నారు.

ఇప్పటిదాకా బయటికి వచ్చిన ఇంటర్వ్యూలలో ఎవరికి వారు – నా సినిమా వరకూ, లేక నా టీవీషో వరకూ నేను బాధ్యతాయుతంగానే రాస్తున్నాను, నిర్మిస్తున్నాను, హింసని కథకి అవసరమైన మేరకే వాడుతున్నాను – అంటూ స్టేట్మెంట్లు ఇచ్చారు. రెండు చిన్న నిజాలు మనవి చేస్తాను. భీకరమైన తుపాకి కాల్పులు, పేలుళ్ళు చూపించిన జేంస్ బాండ్ సినిమా అమెరికాలోకంటే విదేశాల్లో కొన్ని రెట్ల వసూళ్ళు చేసింది. మరి ఇలాంటి వయొలెన్సు ఇతర దేశాల్లో జరగదేం? జపాను, కొరియా వంటి దేశాల్లో అమ్ముడయ్యే వీడియో గేముల్లో విపరీతమైన హింస ఉంటుందట. మరి అక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగడం లేదేం?

ఏమన్నా అంటే .. దాన్ని గురించి మనకి పూర్తిగా తెలీదు, సరైన సమాచారం లేదు, గాడిద గుడ్డు లేదు అంటారు. తుపాకి సంస్కృతి అమెరికా సంస్కృతిలో ఒక భాగం. అది మనం ఒప్పుకుని తీరవలసిందే. అది ఒప్పుకున్నాక, రెండవ సవరణని గురించి తీవ్రంగానూ లోతుగానూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రెండవ సవరణ తుపాకులు ధరించే హక్కుని ఆటపాటలకోసం చెప్పలేదు, మిలీషియాల మనుగడకోసం అని స్పష్టంగాచెప్పింది. మిలీషియా అంటే పౌర సైన్యం. ప్రభుత్వ సైన్యంలో చేరాలి అంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారే, మరి పౌరసైన్యానికి అర్హులుగా ఉండాలంటే కనీసార్హతల ప్రస్తావన ఉండవద్దా? కచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి – అందులో సందేహమే లేదు.

సమాజంలో ఈ రుగ్మతల పట్ల ఉన్న దురభిప్రాయాలు అలా ఉండగా, మంచి ఆరోగ్యబీమా పాలసీలు కూడా ఈ రుగ్మతలకి అవసరమైన ట్రీట్మెంటుని చిన్నచూపు చూస్తున్నాయి. ఇక్కడ శ్లేషని తమరు మన్నించాలి – ఈ తుపాకుల సమస్యని ఛేదించడానికి సిల్వర్ బులెట్ ఏదీ లేదు. అన్ని వైపులనించీ ఈ సమస్యని ఎదుర్కోవలసిందే. కానీ అన్నిటికంటే ముఖ్యం, మన బిడ్డల పైన, వారి పెంపకం పైన, వారికి మనమిచ్చే శిక్షణ పైన ఉండాలి మన దృష్టి. వారికి తుపాకి ధరించడానికి హక్కే కాదు, బయటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, తుపాకి ముట్టుకోకుండా ఛాయిస్ కూడా ఉన్నదని వాళ్ళకి తెలియాలి.

‘తుపాకి’ కథలో పిల్లవాడు కిరణ్ కి  ఆ ఛాయిస్ తెలిసింది. మరి అమెరికన్ పౌరులకి ఎప్పుడు తెలుస్తుందో?

Above Image by Slowking4 (Own work) [CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0)], via Wikimedia Commons Gun image by INVERTED (Own work) [Public domain], via Wikimedia Commons

మీ మాటలు

  1. ఇప్పటిదాకా నోరు జారితే వెనక్కి తీసుకొలేం అని అనుకున్నాం.. గుండు వదిలినా వెనక్కిరాదనేది అర్థం చేసుకోవాలి. చేతిలో తుపాకి వుంటే కోపం వచ్చినప్పుడల్లా కాల్చాలన్న దురద పుడుతుందనడానికి చాలా నిదర్శనాలు వున్నాయి. యూపి బీహారుల్లో బహిరంగంగా తుపాకులు పట్టుకోని తిరిగే వారి నుంచి మొన్నా మధ్య ఓ ప్రముఖ తెలుగు సినిమా హీరోదాకా చాలామంది ఈ దురదని ప్రదర్శించారు.. ఏతా వాతా చెప్పేదేమిటంటే మనస్సు మీద, మెదడు మీద కంట్రోల్ లేని వయసులో వున్న పిల్లాడి చేతిలో లాలీపాప్ పెట్టి నోట్లో పెట్టుకోవద్దు అంటే ఎలా? వాడి చేతిలోకి అది చేరకుండా చూసుకోవాలికానీ..

  2. రాజేషు దేవభక్తుని says:

    ఇప్పుడే ” ఏం.వి.రమణారెడ్డి ” గారి ” ఆయుధం పట్టని యోధుడు ” చదివి ముగించాను , అమెరికాలో ఉండే జాతి వివక్షను గురించిన గొప్ప కనువిప్పు, అయితే ఇది 1960 ల నాటి పరిస్థితి దృశ్యమానము, ఇప్పటికి ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయో లేదో తెలియదు. అయితే రాజకీయంగా అమెరికా సాగించే కార్యాలను గురించి కుడా ఒక అవగాహన కల్పిన్స్తుంది.

    అయితే అప్పటికే అమెరికాలో గన్ కల్చర్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

    ఈ పుస్తకం చదివిన తరువాత మన దేశంలో గాంధీ ఎంత గొప్పవాడని అనుకుంటామో, అంతే గొప్ప వాడు ” మార్టిన్ లూథర్ కింగ్ ” అని నాకనిపించింది, ఆయన చెప్పిన ఈ క్రింది మాటలు ప్రతివారికి ఆచరణీయాలు…!

    ….. 1967 మార్చి 25 వ తేదిన చికాగో నగరంలో వియత్నాం యుద్దాన్ని వ్యతిరేకిస్తూ లూధర్ తన మొట్టమొదటి ఊరేగింపు నిర్వహించాడు, అప్పుడు తన సొంత గూటిలో, తనతో పాటు పనిచేసిన నీగ్రో పెద్దలైన ” బెయర్డ్ రస్టిన్, ఏ.రాండాల్ఫ్” వంటి వారు లూధర్ ను సమర్దించకపొగా …. శక్తికి మించి ఎగురుతున్నాడని , పౌర హక్కుల పనేదో చూసుకోక ఇవ్వన్ని అతనికేందుకు ? అని విమర్శలు గుప్పించారు… అప్పుడు లూధర్ స్పందించిన తీరు నాకు నచ్చింది, చెప్పిన మాటలు *అక్షర సత్యాలు*…..

    నేను మాంట్గొమేరి చర్చిలో పనిచేసే సమయంలో మతభోధ చేసుకోక, బస్సుల విషయం నీకేందుకన్నారు, బర్మింగ్ హం వెళ్ళినప్పుడు, జార్గియా వాడికి ఇక్కడేం పని ? అన్నారు. సమాజ శ్రేయస్సనేది ఎవరో కొందరు వ్యక్తులకు ప్రత్యేకించిన వృత్తి కాదు, అది ప్రతి పౌరుడు పంచుకోవలసిన భాద్యత.

    నా ఉద్దేశంలో మేఘాలు లేకపోతే వర్షం లేనట్లు, ఇహః మీదట గన్ కల్చర్ లేని కుడా అమెరికా కుడా ఒక కల్ల లాంటి కల.

    • రాజేషు గారు, అమెరికాలో జాతి వివక్షత తప్పకుండా ఉంది. ఐతే దానికీ gun కల్చరుకూ పుర్తిగా ముడి పెట్టలేమని అనుకుంటున్నాను.

  3. In India a firearm costs from 10 thousand to 100 thousand. I did not buy it. Even if I have money, I would buy an Ipad or some other but not a weapon.

  4. స్వామి గారి తుపాకి కథ ఎప్పుడో చదివాను. చాలా మంచి కథ అని అనుకున్నాను అప్పుడు. ఇప్పుడీ విశ్లేషణాత్మకమైన వ్యాసం చదువుతుంటే ఆ కథ చదవడం మన ఎన్నారై సోదరులకి ఎంత అవసరమో అని పిస్తోంది. 32 కోట్ల జనం దగ్గర 30 కోట్ల తుపాకులా? ఇవన్నీ ఆత్మ రక్షణకే ? అమెరికన్ పాలకులు తక్షణం దృష్టిసారించవలసిన విషయమిది.ఈ నరమేథాలకి పాల్పడుతున్నవారు మానసిక రోగులని సరిపెట్టుకోబోవడం సమస్యని పక్కదోవ పట్టించడమే.మంచి సమస్యను చక్కగా విశ్లేషించినందుకు స్వామి గారిని అభినందిస్తున్నాను.

    • గోపాలకృష్ణగారు , మీ వ్యాఖ్య ఇప్పుడే చూస్తున్నాను. మీ అభిమానానికి నెనర్లు

  5. attada appalnaidu says:

    vyaasam chadivindi ippude.katha chadavale.americalo tupaki vaadakam,daani nepathyam chaala chakkagaa raasaru.abhinandanalu.

  6. Subhadra says:

    బాగా రాసేరు నారాయణ స్వామి గారు! ఎంత రాసిన సరిపోని టాపిక్, చాలా నాకు అర్ధం కాని ప్రశ్నలు – అసలు అందరికి గన్నులు ఎందుకు అనే దాని దగ్గరనుండి. నిజంగా గన్ను ఉన్నవాళ్ళు ఆత్మ రక్షణ చేసుకో గలరా దానితో, అంత అవరసం అదే థ్రెట్ ఉంటుందా.. ఇంకా ఎన్నెన్నో…

    ఒకటి మాత్రం మీతో ఏకీభవించను – సినిమా లో చూసిన వన్నినిజం కాదు ఓన్లీ వినోదం అని అనలేము. Mature వయసులో చూసే వాళ్ళకి ఓకే, యంగ్ మైండ్స్ మీద వాటి ప్రభావం డిఫరెంట్ గ ఉంటుంది. ఇంకా too much అఫ్ something కి ఎక్కువ expose అయితే కొంత సేన్సిటివిటి కూడా తగ్గుతుందేమో..

    • సుభద్ర గారు, ధన్యవాదాలు. అమెరికా స్వాతంత్ర్యాన్ని తుపాకులతో గెల్చుకుంది. అప్పణ్ణించీ వారికి ఎక్కడ ప్రభుత్వం తమ ఆయుధాల్ని (తద్వారా స్వాతంత్ర్యాన్ని) లాగేసుకుంటొందో అని ఒక భయం. పిల్లలూ సినిమా ప్రభావాల గురించి మీ అభిప్రాయం అర్ధమయింది.

  7. Potu rangarao khan am says:

    నారాయణస్వామి గారి తుపాకుల కల్చర్ వ్యాసం బాగుంది.అమెరికా సమాజం ఎందుకు అబద్రతలో vundhi. ప్రపంచాన్నేమో బయపెడుతుంది.ఎదిగిన సమాజం,వోదగని,ఎదగని పొఉరులా?కాపిటల్ పోగేసుకున్నా,ఆదిపత్యం వున్నాసమజంపు aadipatyam లక్సనమెమొ ఇది? మీ కత కూడా చదవాలని వుంది

    • రంగారావుగారు, మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. సమాజం వేరు, ప్రభుత్వం వేరు సర్. విదేశాల్లో జులుం చెలాయించేది అమెరికా ప్రభుత్వమూ, దాని తొత్తులు. సమాజం యొక్క అభద్రతా దానికి పట్టదు. తుపాకి కథకి లింకు పైన అప్పలనాయుడు గారి కామెంటు కింద రాశాను.

  8. Potu rangarao khammam says:

    మీ సైట్ రేగులర్గా chad uvula afsar ji.

  9. జేమ్స్‌బాండ్ సినిమాల దగ్గర్నుంచి జపాన్‌-కొరియా వయెలెంట్‌ వీడియోల ప్రభావం వరకు అమెరికాను సెంటర్‌ పాయింట్‌గా తీసుకుని మైకెల్‌ మూర్‌ తన బౌలింగ్‌ ఫర్‌ కొలంబైన్‌లో తులనాత్మక అధ్యయనం చేసినట్టు గుర్తు. అందులో ఆయన ఆర్మ్స్‌ ఇండస్ర్టీ-అమెరికా సమాజం..ఒక పరిశీలన అన్న స్థాయిలో చర్చ జరిపినట్టుగా గుర్తు. బహుశా మీరు చూసే ఉంటారు. దానిమీద మీ అభిప్రాయం తెలుసుకోవాలని ఉంది.

  10. మైకేల్ మూర్ సినిమాలేవీ నేను చూళ్ళేదు. ఆయన పద్ధతి కానీ, ఎప్రోచ్ కానీ నాకు మొదణ్ణించీ నచ్చలేదు.

మీ మాటలు

*