అవును, ఆ జూలీని నిజంగా చూశాను!

“ఊదారంగు తులిఫ్ పూలు”

2011 సెప్టెంబర్ 11 వ తేదీనాడు రాత్రి 2 గంటలకు సాక్షి టీవీలో షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాను. ఇంకా నిద్ర రావడం లేదు. అప్పుడు టీవీ పెట్టుకొని  ఛానెల్  తిరగేస్తుంటే నేషనల్ జియోగ్రఫీలో ఓ ప్రోగ్రాం నన్ను కట్టిపడేసింది. అరె! నేను ఈ రోజు మర్చిపోవడం ఏమిటి? అని ఆశ్చర్యం వేసింది. సెప్టెంబర్ 11 ఎటాక్స్ జరిగి సరిగ్గా పది సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ప్రత్యేకమైన కథనం. నాకు కూడా గతం రివైండ్ అయింది.

2001 సెప్టెంబర్ 10వ తేదీ నా మిత్రుడు రమణ ఫోన్ చేసి న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్‌లో సినీనటుడు మురళీమోహన్‌గారు వస్తున్నారు, నువ్వు రిసీవ్ చేసుకొని కొంచెం హోటల్‌లో వదలగలవా?” అని అడిగాడు. “ఓ! యెస్. తప్పనిసరిగా,” అని చెప్పా. 11వ తేదీ ఉదయమే ఫ్లయిట్ కాబట్టి ఉదయమే లేచి నేనుండే క్వీన్స్ నుండి బయలుదేరి ట్విన్ టవర్స్ క్రింద వున్న స్టేషన్ లో బండి మారి “న్యూయార్క్”కు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. సాయంత్రం  రమణ మరల ఫోన్ చేసి”న్యూయార్క్ దూరం ఆవుతుంది. నేను ఇక్కడ న్యూజెర్సీ నించే మా ‘ఎంప్లాయి’ని పంపిస్తున్నాను ” అన్నాడు. సరే తరువాత ఆయనను కలవచ్చులే అనుకొని పడుకొన్నాను. 11వ తేదీన ఉదయం సుమారు 8 గంటలకు ఫోన్ కాల్‌కు మెలకువ వచ్చింది. తీరా ఫోన్ ఎత్తితే కొలరాడో నుంచి పాత మిత్రుడు వెంకోజీ .. మీ ఊరులో (న్యూయార్క్‌లో) ఏదో టూరిస్ట్ విమానం ట్విన్ టవర్స్‌ను గుద్దిందంటగా” అన్నాడు. “అరే! నాకు తెలియలేదు” అంటూ టీవీ వైపు పరుగు పెట్టాను. ఇంకా ముందే ఓ టవర్ నుండి పొగలు వస్తున్నాయి. సి.ఎన్.ఎన్. యాంకర్ మాట్లాడుతుండగానే మరో విమానం రెండో టవర్‌ని ఢీకొట్టింది. కొద్దిసేపటికి కళ్లెదుటే రెండు టవర్‌లు కూలిపోయాయి. 10 గంటలకే మా అమ్మాయి స్కూల్ నుండి వచ్చేసింది. వస్తూనే అంది. “టెర్రరిస్ట్ ఎటాక్ జరిగిందటగా. అందుకే శెలవిచ్చేశారు.” తరువాతి పరిణామాలు అందరికీ తెలిసినవే.

‘ట్విన్ టవర్స్‌తో అనుబంధం చాలా వుంది. న్యూయార్క్‌లో వుంటున్నాం కాబట్టి మిత్రులు, చుట్టాలు వచ్చినప్పుడూ నేను ‘గైడ్’గా మారిపోయేవాడిని. వచ్చినవాళ్లకు స్టాచ్యూ  ఆఫ్ లిబర్టీ, స్టాక్ ఎక్స్చేంజ్, ఎంపైర్ ఎస్టేట్ బిల్డింగ్, టైమ్ స్క్వేర్, ట్విన్ టవర్స్ చూపించాల్సిందే. సుమారు ఏడుసార్లైనా వెళ్ళి వుంటాను. పక్కనే వున్న పార్క్‌లో ఓ బెంచి పైన తన సూట్‌కేస్ సర్దుకొంటున్న ఓ వ్యక్తి శిల్పం వుంది. దాని ప్రక్క ఫోటోలు తీసుకునేవాళ్లం. రెండు టవర్స్ మధ్యలో వున్న మోడరన్ శిల్పం ‘బాల్’ దగ్గర ఎన్నో ఫోటోలు. వచ్చిన గెస్ట్‌లు టవర్స్‌తో ఫోటో తీయడానికి వళ్లు వంచాల్సి వచ్చేది. క్రింద నేల మీద పడుకొని క్రిందనుంచి పైకి తీస్తే గాని టవర్స్ పూర్తిగా ఫోటోలు వచ్చేవి కావు. పైన డెక్ పైనుంచి మన్‌హటన్‌ని చూస్తూ వుంటే వింత అనుభూతి కలిగేది. గాలి విపరీతంగా వీయడం వల్ల జుత్తు రేగిపోయేది. జనం ఎక్కువసేపు ఉండలేకపోయేవారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ  పక్కనే వున్న ‘బర్గర్ కింగ్’ రెస్టారెంట్  నుంచి అద్దాలలో ట్విన్ టవర్లను చూస్తూ కాలం గడిపేవాళ్లం. ఈ అనుభూతులన్నీ ఆ రోజు భూమిలో సమాధి అయిపోయాయి.

లేదు అవి అన్ని తిరిగి లేచాయి. ప్రజ్వలించాయి. అవి బాధపెడుతూనే వున్నాయి. ఇంతలో టి.వి.లో మరో కధనం. ఓ ఏడు కుటుంబాలతో ఇంటర్వ్యూలు. ఒకటి ఆస్ట్రేలియన్ కుటుంబం. వాళ్లబ్బాయి అమెరికాలో చదవాలని కోరిక. ఓ శ్రీలంక కుటుంబం. వాళ్లబ్బాయి గురించి. మిడిల్ ఈస్ట్ నుంచి ముస్లీం కుటుంబం. ఓ భార్య గర్భవతి. ఆ రోజు తన భర్తను  ఎలా సాగనంపిందో చెప్పింది. అన్నీ కన్నీటి ప్రవాహాలే. నాకూ కన్నీరు ఆగలేదు. భవనాలు పడిపోయినప్పుడు మనవాళ్ళో, మన మితృలో వుంటే ఎలా వుంటుంది? ఈ ఆలోచనే భయంకరంగా వుంది. ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఈ మానసిక సంఘర్షణలో నుంచే ఈ కథ ఉద్భవించింది.

ఈ కథ చదివిన ఒకాయన నన్నడిగారు. జూలీని నిజంగా చూసారా? అని. నేను మౌనంగా వున్నాను. ఆయన మళ్లీ అడిగాడు.”చూసాను,” అన్నాను. “ఎప్పుడు? ఎక్కడ,?” అన్నాడు క్యూరియాసిటీతో. కొద్దిసేపు ఆగి.. ‘కలలో,’ అన్నాను. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ.. “ఎప్పుడు,?”

“2011 సెప్టెంబర్ 11 రాత్రి 3 గంటలకు నిద్ర పోయిన తర్వాత.”

Image: Mohan

మీ మాటలు

  1. కథ, కథ వెనక కథనం మరియు మోహన్ గారి బొమ్మలు అధ్బుతం గ వున్నై….మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాం…

  2. Nice. If you get a chance, please read Amy Waldman’s The Submission.

Leave a Reply to S. Narayanaswamy Cancel reply

*