ఉన్మాది మనస్సినీవాలిలో…

స్పర్శ, చూపు, వినికిడులు అందించే పై పై ఐంద్రియక సమాచారానికి కూడా సవాలక్ష ఇంద్రియ పరిమితులున్న అంథులం, బధిరులం కదా-

……………… ఆధునిక కవనఘృణి విశ్వరూపసాక్షాత్కారం కోసం ‘చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో’ ఉన్న మహాకవి విన్న …. ‘ఉన్మాది మనస్సినీవాలిలో…. ఘూకంకేకా, భేకంబాకా….’

……………. సామాన్యులం మనమెలా వినగలం?

వినగలం!

జీవన వేదన ప్రచ్ఛన్నంగా, ప్రతీకాత్మకంగా వినిపించే వేనవేల ఘోషల్లో అతి సంక్లిష్టమైన ఘూకంకేకా, భేకంబాకా…. లను మనం సైతం వినగలిగే మహదావకాశాన్ని తెలుగులో కలిగించిన అతికొద్ది రచనల్లో రమణజీవి ‘సింహాలపేట’ కథాసంపుటి ముఖ్యమైంది.

రమణజీవి అనే కథోన్మత్తుడు, ఉన్మాది (కథాసంకలనమనే) మనస్సినీవాలిలోని వ్యక్తావ్యక్తాలాపనలు, వెర్రి ప్రేలాపనలే ఆ ఘూకంకేకా, భేకంబాకా! అంటే వాచ్యార్థంలో  గుడ్లగూబ అరుపు, కప్ప బెకబెకానూ.

అంటే, ఇవి పిచ్చి కథలు కావు గానీ, పిచ్చివాళ్ళ కథలు, ‘ఎయిర్స్’ వంటి ఏవేవో మాయపేర్లతో పిచ్చి ఎక్కించే కథలు.

ఉదాహరణకి, సముద్రం కథ –

ఒకానొక పిచ్చివాడు చెప్పిన ఓ fable- సముద్రం. ఈ పిచ్చివాడి కథలో నాయకుడు కూడా కథకుడిలా పిచ్చివాడే. వర్తమాన ప్రపంచంలో కథకుడు ఏ విధంగా ఒంటరో, ఆ కాల్పనిక గాథలో కథానాయకుడు ఏలే రాజ్యం కూడా పొరుగు రాజ్యాల మధ్య ఏకాకి. డబ్బులు చించేయ్యాలని తెగబడిన పిచ్చోడు ఈ నేరేటర్‌. అదే మాదిరిగా, బంగారంలాంటి బంగారాన్ని, అష్టైశ్వర్యాల్ని తెగనమ్మి ఇనుప గునపాలు కొనుక్కునేంత పిచ్చోళ్లు ఆ రాజ్య ప్రజలు. ‘ఒక అనుభూతి కోసం బతకాల’న్న సామూహిక నిర్ణయంతో, ఒక ఉమ్మడి ఆదర్శాన్ని నిజం చేయాలని తమని, తరతరాల్ని కూడా పణంగా ఒడ్డిన పరమపిచ్చోళ్లు. ప్రతిఫలాన్ని కాలానికి, దైవానికి అప్పగించిన నిష్కామయోగులు. వారి మహా సంకల్పానికి, ఏకైక లక్ష్యానికి మూలం వారి రాజు కన్న ఓ కల- సముద్రం!

ఆ మహద్విశ్వ స్వప్నాన్ని సాకారం చేసుకోవచ్చునేమోగానీ, సందేహపడితే మాత్రం కల కరిగిపోతుంది. ‘ఎప్పుడైతే దానికొక పేరు ఖాయం అయ్యిందో అప్పణ్ణించీ ఆ కల రావడం మానేసింది.’ దాని సాక్షాత్కారం ఆగిపోతుంది. జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. పాతబడే కొద్దీ మాసిపోవచ్చు కూడా. అందుకే కలని నిజం చేసే మహోద్యమం ప్రారంభించాడు రాజు. తన కలని తన వాళ్ళందరి ఉమ్మడి కల  చేయడం, కలని నిజం చేసే క్రమంలో సముద్రా న్నే తవ్వి దేశానికి కానుక ఇవ్వడం ఆ రాజు సంకల్పం.

ఇదిలా ఉంటే, ఈ కథలో రెండవ సూత్రపాత్రైన సముద్రానిది మరో రకం ఉన్మాదం.

ఇంతకీ సముద్రం అంటే ఏమిటి? అన్నీ నీళ్ళు అక్కడ ఒలకబోసిందెవరు? కెరటాల్ని ఎంత కాలమలా మెటికలు విరుచుకుంటూ యాష్ట పోతుంటుందది? ఇవేవి సైన్సుకు సంబంధించిన ప్రశ్నలు కావు. ‘లక్షలాది సముద్ర పక్షుల్ని, దట్టని మబ్బుల్ని వెంటేసుకుని జూలు విదిల్చి అది కదిలి వస్తుంటే,’ ప్రచండ మారుతాలు దానికి రెడ్‌ కార్పెట్‌ పరవడాన్ని తర్కంతో చూడలేము. అంటే సముద్రపుటుద్రేకాలు, ఉద్వేగాలు, ఉప్పని కన్నీళ్లు అన్నీ తర్కరహితమని కాదు, తర్కాతీతం! ఇరుకిరుకు మనుషుల్నేకాదు, మనుషుల దేవుళ్లని చూసికూడా సముద్రం ఈసడించుకుంది, తన తొలి ప్రయాణ సంపర్కంలో. ఇంత అందమైన లోకానికి మనిషి ఒక దిష్టిచుక్క అనిపించింది. కాని నిజమైన మనుషుల ముందు మోకరిల్లింది. కాయలు కాసిన వారి అరిచేతుల్లోంచి అగరు పరిమళాల్ని ఆస్వాదించింది. విభ్రాంతితో విచ్చుకున్న వారి కళ్లల్లో తన ఆత్మను దర్శించుకొని ధన్యమైంది.

Fableని తెలుగులో కొంచెం పెడసరిగా చెప్తే కట్టుకథ అని, సున్నితంగా చెప్పుకుంటే కాల్పానిక గాథ అని అనుకోవచ్చు. జంతువులు, చెట్లు, పుట్టలు చిత్రవిచిత్ర జీవులు, ప్రకృతి… అన్నింటికి మానవీయ లక్షాణాల్ని ఆపాదించి చెప్పే కథని fable అనవచ్చు. అలా చూస్తే ఈ నవీన యుగంలో, సాంస్కృతికంగా ఆధునికోత్తరత అని గుర్తింపు పొందిన ఈ యుగంలో తెలుగు సాహిత్యంలో వచ్చిన అత్యద్భుత fable ఇది.

కలగన్న మహాకడలిని ప్రజలకి కాన్క చేసే ఈ ఉటోపీయుడిలా ఇంకొందరో పిచ్చివాళ్ళు ఉన్నారీ  కథాసంపుటిలో.  ఆశపచ్చని లోకంకోసం నిర్జన భూగోళాన్ని (వి)నిర్మించిన హరకిరిస్టుడు, హోలోకాస్టుడు, సృష్టి చిట్టచివరి మనిషి కన్‌ఫెషనల్ కన్నీళ్ళని పుక్కిటపట్టిన ఫ్యూచరిస్టుడు, ‘కారుణ్యం లేక అద్భుత సృష్టికి అనర్హమైన’ మగజాతిని తోడేళ్ళ పాల్జేసిన పేరడాక్సుడు, చీమలపేట మీదుగా వెండిలోకం దాటీ దాటని కాఫ్కీయుడు, ఒకానొక జరతుష్రుడు, ఒక ఐకనోక్లాస్టుడు, మరొక రెబలుడు, వైపరీత్యుడు, ఒడిదుడుకుడు… ఇంకా ఇంకొన్ని పాత్రల, సూత్రపాత్ర (protagonist)ల కథలు; వస్తురూపశైలీగత వ్యథలై బద్దలైన అద్దం ముక్కలు. ‘మానవ సృష్టిలో ఉన్న మూసదనా’న్ని ఈ రచయితలానే వెక్కిరిస్తున్న గాజుపెంకులు.

ఏ ఒక్కటీ మరొకదానితో పొత్తే లేని ఆ శకలాలన్నింటిలో కుడిఎడంగా ప్రతిబింబించే ఏ స్థాయి ఉన్మీల ఉన్మాదమైనా అది రమణజీవే. తనని ఆరాధించిన, ఆదర్శించిన  లక్షలమంది తడికళ్ళలో సముద్రం ప్రతిబింబించినట్టు, అదే ఉద్వేగ స్థాయిలో ప్రతిఫలిస్తున్నాడు రచయిత, ఆ పాదరస బిందు సందోహంలో.

రమణ జీవి ఉన్మత్త తీవ్రత అర్థం కావాలంటే, అతని మనస్సినీవాలిలోని గుడ్లగూబ అరుపులు, కప్ప బెకబెకలూ between the lines బోధపడాలంటే, ప్రళయోధృతితో పోటెత్తుతున్న సముద్ర నీలి బీభత్స సౌందర్యాన్ని ప్రణయావేశంతో చూసి, ‘అడుగో నా కృష్ణుడం’టూ దూకేసిన చైతన్యుడి తాదాత్మ్య ఉన్మాదం అర్థంకావాలి. సన్నమూతి గాజుసీసా పగలగొట్టకుండా, లోన బాతుని చావకుండా బయిటకి తీయడానికి- ‘యోచన’కీ ‘గ్రహించడాని’కీ మధ్య అగాథాన్ని ఏ వంతెనల వైఫల్యంతో కాకుండా, ఒక్క అదాటున దాటేటువంటి తర్కాతీత వివేకస్థాయి కావాలో, దాన్ని అందుకోవాలి.

అవి లేకపోతే ఈ సంకలనమనే పిచ్చివాళ్ళ కథల్ని తెరవడానికి అనర్హులు… అంటున్నానంటే, నేనా ఉన్మాద, వివేక తీవ్రతని అందుకున్నానని ఎంతమాత్రం కాదు. మతిచెడిన వాళ్ళ పట్ల నా వ్యవహారం సగటు స్థాయికి ఎంతమాత్రం ఎక్కువేమీ కాదు. ఏ పిచ్చివాడి విషయంలోనూ నేను, నా చుట్టూ ఉన్న మర్యాదస్తులు చాలామందికి మల్లే, empathetic  కాదు సరికదా sympathetic కూడా కాదు. ఒకడిమీద జాలిపడాలంటే, తనని న్యూనపరిచి, నన్ను గొప్ప చేసుకునే సావకాశం చిక్కాలి కదా. కానీ, మనం వెంపర్లాడే పచ్చనోట్ల కాగితాలు చింపిపోగులు పెడతాడని, మనం అంగలార్చే పరువు ప్రతిష్టల్ని దిసమొలతో వెక్కిరిస్తాడని, మన ఇంటి ఇరుకుతనాలమీద ఉచ్చపోస్తాడని, మన విలువలు, మర్యాదలు,  తొడతొక్కిడి పరుగులు…. ఒకటేమిటి,

మనల్ని మనిషితనం నుంచి దూరం చేస్తున్న ప్రతి పార్శ్వాన్నీ పట్టి పట్టి గేలిచేస్తాడని కదా పిచ్చివాడిమీద మన అక్కసు!

పిచ్చివాడిని దూరంగా నెట్టేయడానికి తన చేతిలో రాయి ఒక నెపమౌతుంది సాధారణంగా. రమణజీవి అనే ఈ జీవనోన్మాది విషయంలో ఈ సంకలనమే రాయి అని నా (నాలో) revelation!

మీ మాటలు

 1. ప్రపంచమనే నల్లబల్ల (బ్లాక్‌బోర్డ్) మీద వున్న చిందరవందర అక్షరాల గజిబిజిలో తికమక పడి, తిరగబడి, అవి అర్థంకాలేని ఉన్మాదస్థితిలో వున్నాయని తెలుసుకోని.. చివరికి – “మొత్తం తుడిచేసి మళ్ళి కొత్తగా రాస్తే బాగుండు” అన్న కోరికను బలంగా వినిపించే కథలు. మీ సమీక్ష చాలా బాగుంది నరేష్‌గారు.

 2. రమణజీవి”సింహాల పేట” పుస్తకావిష్కరణ సభలో ప్రముఖకవి నగ్నముని గారు “ఈ కథలు చదివాక రమణజీవిని కలవాలంటే నాకు భయమేసింది” అన్నారు. నిజమే! భయపడాల్సిన కథలే ఇవి. కల్లోలిత సామాజిక రచనలో ఆదమరిచి, మానవబలహీనతల్ని సగర్వంగా నెత్తికెత్తుకుని మెలకువగా బ్రతికేస్తున్నామని భ్రమపడుతున్న ఆధునిక మానవుడిని ఒక్క గుంజాటనతో అర్థరహిత,అత్యంతభయానకమైన కలలోకి…కాదు కాదు సర్రియల్ కలల మధ్యకి లాక్కెళ్ళి సత్యాన్ని అవగతం చేసే బలవంతపు పొలికేక పెట్టిన రమణజీవిని చూసి నిజంగా భయపడాల్సిందే. దయగల మానవుడికోసం, ప్రకృతికోసం మారగలిగే మనిషికోసం ఒక మారణహోమమైనా చేద్దామనే జాలిహృదయం కలిగిన కథకుడు రమణజీవిని చదివి భయపడాల్సిందే.

 3. ns murty says:

  సముద్రం కథ నిస్సందేహంగా చాలా గొప్ప కథ. అది ఒక్క పిచ్చివాడు చెపుతున్నట్టు చెప్పించడం లో నాకు రచయిత చాలా నేర్పు కనపరిచేరని అనిపిస్తుంది. మిగతా కథలు చదవాలని కుతూహలంగా ఉంది.

 4. “మనల్ని మనిషితనం నుంచి దూరం చేస్తున్న ప్రతి పార్శ్వాన్నీ పట్టి పట్టి గేలిచేస్తాడని కదా పిచ్చివాడిమీద మన అక్కసు!
  పిచ్చివాడిని దూరంగా నెట్టేయడానికి తన చేతిలో రాయి ఒక నెపమౌతుంది సాధారణంగా. రమణజీవి అనే ఈ జీవనోన్మాది విషయంలో ఈ సంకలనమే రాయి అని నా (నాలో) revelation!”

  ఇలాంటి మంత్రించిన మాటలతో సంకలనం సారాంశాన్ని చెప్పడం ‘వచన మాంత్రికుడు ‘, మిత్రుడు నరేష్ కే సాధ్యం …
  ‘సముద్రం’ లాంటి కథల్లో వున్నగొడవల్లాంటివి ఏవీ లేకుండా కూడా మొత్తం జీవితాన్ని వున్నది ఉన్నట్టుగా చిత్రిక కట్టి అబ్బుర పరిచిన కథ ‘సగలమ్మ పలికింది’…ఈ కథ లోని సౌందర్యం గురించి కూడా నరేష్ రాస్తే చదవాలని వుంది..

  • naresh nunna says:

   Dear Koduri, ur personal affection on me is being reflected on your comment. However, I am overwhelmed by your love…

 5. బాగా చెప్పారు, నరేష్!

 6. రివ్యూ చాల బాగుంది నరేష్ గారు…

 7. ఏం చెప్పాలి నరేష్, రమణజీవి సముద్రంలో దూకినట్టు, మీరు రమణజీవి లోకి దూకినట్టు, నేను మీలోకి దూకేయటం తప్ప.. :)
  అణచిపెట్టుకోవటం వల్లకావట్లేని చాలా విసుగుల మధ్య మీ మాయతెలియని మాయాలోకల్లోకి రావటం చిరంతన విశ్రాంతి.

 8. naresh nunna says:

  Thank u, BVV Prasad, Narayana Swamy, Anil Reddy garlu…..

మీ మాటలు

*