సగలమ్మ పలికింది

sagalamma illustration(రమణజీవి కథాసంపుటి ‘సింహాల వేట’ ఈనెల 9 న హైదరబాద్ లో ఆవిష్కరణ)

క్రితం రాత్రి సరిగా నిద్రే లేదు వరాలుకి. మరునాడు బలి కాబోతున్న తన కోడిని తల్చుకుని!

తెల్లారింది.

చల్లటి నీళ్లు మొహం మీద పడేసరికి రెండు చేతుల్తో మొహాన్ని కప్పుకుంటూ అటువేపు తిరిగి పడుకుంది వరాలు.

వాళ్లమ్మ చెంగమ్మ పోతూ పోతూ ఇన్ని నీళ్లు చల్లి పోయింది వరాలు మీద.

‘‘ఒమ్మే! వొరాలు… సగలమ్మ కాడికి బోవాల గదా’’ అంది అవ్వ సుబ్బమ్మ కుండెడు నీళ్లల్లో పేడ కలుపుతూ.

మామూలుగా అయితే అంత తొందరగా ఎప్పుడూ లేవని వరాలు ‘సగలమ్మ’ అనేసరికి మెరుపులా లేచి కూర్చుని అరుగు మీదినించి కిందికి చూసింది.

కోడిపుంజు మంచానికి కట్టేసి వుంది. ఠీవిగా నిలబడి తలను అటూ ఇటూ కదుపుతుంటే నెత్తి మీద ఎర్రటి కిరీటం రాజసంతో కదులుతోంది. ముదురు పసుపురంగులో వున్న కంటి మధ్య గుండ్రటి నల్లగుడ్డు నిర్భీతితో మెరుస్తోంది. రానున్న ఆపదను ఏమాత్రం పసిగట్టలేనంత అమాయకత్వంతో కూడుకున్న నిర్భీతి. ఒళ్లంతా నలుపు, ఎరుపు ఈకల కలనేత మెరుపులు.

గబ గబా అరుగుదిగి కోడి దగ్గరకు వెళ్లింది వరాలు. కోడి భయంతో క్రో…క్రో… అంటూ కాలికి కట్టిన తాడును లాక్కు పోవాలని ప్రయత్నించింది.

చెంగమ్మ కూతురు వేపు మురిపెంగా చూస్తూ ‘‘మ్మె! పోమ్మే!! నీళ్లు దేపోమ్మే…’’ అని తన తల్లి వేపు తిరిగి ‘‘కోణ్ణి కూరొండినాక జాచ్చి చీలు దినేదిదే బలే మిడిమేలపు ముండగని’’ అంది. సుబ్బమ్మ సన్నసన్న పుల్లలు విరుస్తూ నవ్వింది.

‘‘హూ!’’ అని తల విదిలించుకుంటూ లేచి గూట్లోంచి ఓ బొగ్గు తీసి నోట్లో వేసుకుని కరకర నమిలి చూపుడు వేలుతో పళ్లు రుద్దుకోడం ప్రారంభించింది వరాలు.

గోడ దగ్గరికి వెళ్లి గోడమీద తుపుక్కుమని వుమ్మేసింది. శిథిలమై సున్నపు పెచ్చులు వూడి లోపలి బంక మట్టి, రాళ్లూ కనిపిస్తున్న గోడ మీద నల్లటి ఎంగిలి పడింది.

‘‘మెడ్తో గొడ్తా! లం…ముండ’’ అని చివాలున లేచిన చెంగమ్మకు దొరక్కుండా బయటికి పరుగెత్తింది వరాలు.

‘‘ఏమి దీనికి బొయ్యేకాలం. కండ్ల గావరం’’ అంది సుబ్బమ్మ.

సుబ్బమ్మకు ఆ ఇల్లంత అపురూపమైంది ఇంకోటి లేదు. ఆ ఇంటిని స్వంత చేతుల్తో కట్టింది.

అప్పటికి చెంగమ్మ వరాలంత పిల్ల. బంక మట్టిని పిసికింది. రాళ్లు పేర్చింది. వాసాలు కూర్చింది. కొండ మీది బోద కోసుకొచ్చి ఇంటిని కప్పింది. ఇప్పుడు ఆ బోదంతా ఏళ్లతరబడీ ఎండల్నీ వానల్నీ ఎదుర్కొనీ ఎదుర్కొనీ నీరసించి పోయింది. ముట్టుకుంటే నుసి నుసయి పోతోంది.

ఇంటికప్పు అడుగునున్న వాసాలు, దూలాలూ కూడా పొగ తాకిడికి కాటుక రంగుకి తిరిగాయి.

ఆ ఇంటికి చుట్టూ మనిషెత్తు ప్రహరీ గోడ. ప్రహరీగోడకు ఇంటికి వున్న ఖాళీ స్థలంలో ఎప్పుడో పోసిన మట్టి చీపురు కట్ట వూడ్పులకెగిరిపోయి అడుగున గులక రాళ్లు పొడుచుకుని వచ్చి నేలంతా ఎగుడు దిగుడుగా తయారయ్యింది. అయినా సరే ఆ నేల మీదే పేడ చల్లడం … ముగ్గులు పెట్టడం… ఆ గోడలకే సంవత్సరం సంవత్సరం సున్నం పూయడం… ఎరమట్టి గీతలు గీయడం…

ఆయితే వరాలుకివ్వేమీ పట్టవు. ఎంతసేపూ ఏదో ఒకటి పాడుచేసి తిట్లు తినడం సరదా.

సుబ్బమ్మ చెంగమ్మను పొయ్యి వెలిగించమని చెప్పి సగలమ్మ మొక్కుకు కావల్సిన ఏర్పాట్లలో మునిగిపోయింది.

ఇంటి తలుపుకు ఇటూ అటూ వున్న రెండు పెద్ద పెద్ద అరుగులకు చిక్కటి పేడ నీళ్లు పులుముతోంది. మధ్యలో వేసిన గోనెపట్టతో ఆడుకుంటున్న రెండు బూడిదరంగు పిల్లి పిల్లలు కాళ్లకు మాటిమాటికి అడ్డుపడుతూంటే చేత్తో అవతలికి తోసి ‘చేయ్‌’ అని అరిచింది సుబ్బమ్మ.

ఆ రెండు పిల్లి పిల్లలు కింద ఓ దొర్లు దొర్లి లేచి నిలబడి విస్మయంగా సుబ్బమ్మ కేసి చూసి గబగబా ఇంట్లోకెళ్లాయి. మళ్లీ అంతలోనే వొకదాన్నొకటి తరుముకుంటూ వచ్చి ఆగి సుబ్బమ్మను చూడబోయిన వాటి దృష్టిలో అప్పుడే నేల మీద వాలిన ఓ ఈగ పడింది.

చెవులు రిక్కించి శత్రువు మీదికి పొంచి రహస్యంగా దాడి చేసే వాటిల్లా శరీరాన్ని వెనక్కి లాగి ముందు కాళ్లతో మెల్లి మెల్లిగా ఈగను సమీపించిన పిల్లి పిల్లలు దూలం చాటునించి వాళ్లమ్మ అరుపు విని చప్పున ఆగిపోయి తోకల్ని నిటారుగా ఎత్తి నడుమును తల క్రిందులైన అర్ధ చంద్రుడి ఆకారంలోకి మార్చి గొప్ప ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ బొమ్మల్లా నిల్చుండి పోయాయి.

‘‘వొసే నా సయితీ… వొరాలూ…నీళ్లు తీసకరాయే… మళ్లా ఫవరు తగ్గి పోతాది’’ అని కేకేసింది చెంగమ్మ. చుట్టుపక్కల ఎక్కడున్నా వరాలుకు వినపడేలా వుంది ఆ కేక. పొగవల్ల మండుతున్న కళ్లని కొంగుతో తుడుచుకుంది.

బయట గులక రాళ్ల దారి మీద రాత్రి కురిసిన వాన నీళ్లకు ఎడం కాలి బొటనవేలుతో కాలవలు తీస్తూ నిలబడి వుంది వరాలు. యాంత్రికంగా పళ్లను తోముతోంది, చూపుడు వేలుతో.

వరాలు మనసులో ఆ రోజు సగలమ్మకు బలి కాబోయే తన కోడి పుంజు మెదులుతోంది. గుడ్డులో నుంచి బయటపడినప్పట్నించి తెలుసు తనకది. చిన్నప్పుడు దాన్ని నెత్తి మీదకి ఎక్కించుకుంటే అది తన చిట్టి చిట్టి గోళ్లతో మెడ మీదకి దిగి గిలిగింతలు పుట్టించిన దృశ్యం కళ్ల ముందు పదేపదే మెదులుతోంది. దూదిలాంటి మెత్తటి పిల్ల…. ఎంతగా ఎదిగింది తన చేతుల్లో!… ఈ రోజుతో ఆఖరా!

చెంగమ్మ కుడి చేతిలో వూదురు గొట్టం, ఎడం చేతిలో బిందెతో బయటికి వచ్చింది కళ్లు నులుముకుంటూ.

‘‘మెట్టుతో పదారేట్లు గొడతా యెంచి లం…’’ అని అరిచింది.

వరాలు వులిక్కి పడి వాళ్లమ్మకు అందకుండా కొంచెం దూరం పరిగెత్తి దూరంగా నిలబడి ‘‘ఆడబెట్టు బిందె’’ అంది నేలవేపు చూపిస్తూ.

వాళ్లమ్మ బిందెను అక్కడ బెట్టి ‘‘ఇంట్లోకి రాయే వుండాది నీ కత’’ అని లోపలికి వెళ్లి పోయింది.

వరాలు బిందెను చేత్తో నిర్లక్ష్యంగా పట్టుకుని జవహర్‌ రోజ్‌గార్‌ నీళ్లకోసం వెళ్తుంటే మట్టి గొట్టుకు పోయిన జానెడుజడ గంజి పెట్టినట్టు బిరుసుగా వుంది.

ఇంట్లోంచి రాయుడు వొళ్లు విరుచుకుంటూ లేచి వచ్చాడు. అతడు చెంగమ్మ రెండో కొడుకు. అతడి వుంగరాల జుట్టు రాత్రి పడుకోబోయేముందు ఎలా వుందో ఇప్పుడూ అలాగే వుంది.

నెల రోజుల్నించీ గడ్డం పెంచుకుంటున్నాడు తిరుపతి పోవాలని.

‘‘ఏంబ్బీ! లేచినావా. రా. నాయినా, నువ్వు ముందు బోసుకుంటే నీళ్లు… మళ్ల నేను వరాలు బోసుకుంటాం’’ అంది సుబ్బమ్మ.

రాయుడు బ్రష్‌ మీద పేస్ట్‌ వేసుకుని పళ్లు తోముకుంటూ తుమ్మచెట్టు ఇవతల ‘జాలారి’ దగ్గరికి వచ్చాడు. జాలారి అంటే కింద పరచబడిన నాలుగు బండలు. ఓ బండ మీద పెద్ద నీళ్ల మట్టి తొట్టె. అక్కడ వాడిన నీళ్లు పక్కనే వున్న ముద్దబంతి, మల్లె, సన్నజాజి, బొప్పాయి పాదుల్లోకి పోతాయి.

రాయుడు టవలుతో వొళ్లు తుడుచుకొని వచ్చి మంచం మీద వొక పక్కకి వొరిగి పడుకుని కోడిపుంజు వేపు చేయి సాచాడు. అది ఎగరాలని ప్రయత్నించి బోళ్లా పడిరది, కెక్కిరిస్తూ.

‘‘కేజీ వుంటాదా ఇది’’ అడిగాడు రాయుడు కోడిపుంజు వేపు చూస్తూ.

‘‘కేజీ యేం కేజీరా! వొకటిన్నర పైనుండాదయితే’’ అంది చెంగమ్మ.

‘‘మేయ్‌! ఈ వరాలుముండ యాడికి బోతే ఆడ్నే. అబ్బికి నాస్టా అన్నా తెచ్చాదనుకుంటే’’ అంది బయటికి చూస్తూ. తలుపులోంచి వరాలు చంకలో బిందె పెట్టుకుని గబగబా వచ్చింది. బిందెకున్న చిల్లులోంచి సన్నటి ధార వేగంగా వస్తూంటే వుచ్చ…వుచ్చ… చూడండి అని నవ్వుతున్న వరాలు హాస్యాన్ని ఎవరూ పట్టించుకోలేదు. అయినా అది ఒకళ్ల కోసం సృష్టించబడిన హాస్యం కాదని వరాలు మొహంలో ఆనందం చెబుతూనే వుంది.

‘‘మ్మేయ్‌! వరాలూ నువ్వు బొయ్యి కొండయ్యింటి కాడ అన్నకంట దోసె తేమ్మే’’ అంది సుబ్బమ్మ కొంగు విప్పుతూ.

‘‘వుప్మా జేస్తే బొయ్యేది గదుమ్మా అందురూ దినేవాళ్లము’’ అంది పొయ్యి మీద బానలో రాయుడు పోసుకోగా ఏర్పడిన వెలితిని చల్లనీళ్లతో నింపుతూ.

‘‘అబ్బి తిండు లేమ్మే. నువ్‌ బోమ్మే వరాలు’’ అంది సుబ్బమ్మ, అయిదు రూపాయల నోటు వరాలు చేతిలో కుక్కి.

‘‘ఇదో వరాలూ! లోపల నా చొక్కా జేబీలో వుండాది గాని లెక్క… తీసుగోని పో’’ అన్నాడు రాయుడు.

‘‘వొద్దులేన్నా’’ అని అరుస్తూ బయటకి పరిగెత్తింది వరాలు.

రాయుడు మనసులో నవ్వుకున్నాడు.

‘ఈ మర్యాదలు ఎంత కాలం! నాలుగేళ్లయింది తను ఇంట్లోంచి పారిపోయి. నిన్ననే వచ్చింది.

అందుకే ఈ దోసెలూ… ఈ కోళ్లు కోసి వండటాలూ… ఇంక నాల్రోజులు పోతే మళ్లీ మాములే. నా బట్టా… నా కొడకా… ఇంత సద్ది కూడు మొహానేసి…’ ఓ నవ్వు అతడి పెదాల మీద అలా వచ్చి వెళ్లిపోయింది.

అంతలో చెంగమ్మ భర్త శంకరయ్య చేతిసంచీతో లోపలికి వచ్చాడు. బట్టతల మీద మెరుస్తున్న చెమట బిందువుల్ని భుజం మీది టవలుతో తుడుచుకున్నాడు. కళ్లు నిలకడ లేకుండా అటూఇటూ కదులుతున్నాయి. సన్నగా రివటలా వున్న శంకరయ్య మల్లెపువ్వులాంటి తెల్ల చొక్కా, పంచ కట్టులో వున్నాడు. చాలా అరుదుగా చేసే స్నానాన్ని ఆ రోజు చాలా పెందలాడే కానిచ్చాడు.

‘‘ఏమి బ్బే! నాస్టా జేసినావా?’’ అన్నాడు రాయుడి వేపు చూస్తూ. ఎవరో తరుముతున్నట్టు తత్తరబిత్తరగా వుంటుంది అతడి ధోరణి.

‘‘ఓయ్యా! నాయినా! ఇప్పుటికయి పొయ్యిందా నీ బజారు…’’ అడిగింది చెంగమ్మ భర్తను బియ్యంలో రాళ్లేరుతూనే.

శంకరయ్య మాట్లాడకుండా సంచీలోంచి శనగపిండిపొట్లం, తమలపాకులు, వక్కలు, కుంకుమ, పసుపు, మల్లెపూలు, అరటిపండ్లు, కొబ్బరి కాయలు, జేబులోంచి చిన్న కర్పూరం పొట్లం తీసి అరుగు మీద పెట్టాడు.

చెంగమ్మ కళ్లు ఇంతవి చేసి కొబ్బరికాయను చేతికి తీసుకుంది.

‘‘ఓయ్యో! ఇదేంది టెంకాయా? ఇంత వులకంగా వుండాది… దీంట్లో కొబ్బిరుంటాదా?’’

శంకరయ్యకు చిర్రెత్తి పోయింది ‘‘ఇంగ్‌… ఇంగేముంటాది…’’

‘‘ఓయ్యా! నాయనా! ఏదో ఒకట్లేకానీ’’ అంది సుబ్బమ్మ గుడ్డలో బెల్లం పెట్టి గుండ్రాయితో నలగ్గొడుతూ, మొగుడూ పెళ్లాలు గొడవల్లోకి దిగకుండా వారిస్తూ.

చెంగమ్మ నాలుగు బియ్యం గింజల్ని నోట్లో వేసుకుని`

‘‘నిన్న దెచ్చిన చెనిగిపిండి ఎవురి దెగ్గిర దెచ్చినావు. పిండి తక్కువగని. ఈ పొద్దు తూంచితే తెలుచ్చుంది వాడి రంగం… నీ రంగం…’’ అంది తాపీగా.

శంకరయ్య కోపంతో వొణికిపోయాడు.

‘‘నా రంగమేం తెలుచ్చాది లేయే. లచ్చుమయ్య వోటలు కాడ దెలీలా నీ రంగం…’’

‘‘ఇంగ బోనీమ్మే తల్లీ… నా తల్లి’’ అంది సుబ్బమ్మ పొడిచేసిన బెల్లం పక్కన బెట్టి విడి మల్లెపూలూ, దారం చెండూ చేతికి తీసుకుని.

వరాలు టిఫిన్‌ తెచ్చి రాయుడికి ఇచ్చి చిన్న మట్టిగిన్నెలో నీళ్లు తెచ్చి కోడి ముందు పెట్టి చూస్తూ కూచుంది.

ఇంతలో ఓ కాకి మట్టిగోడ మీద కూచుని వకటే అరవడం మొదలెట్టింది.

‘‘వరాలూ… తోలుమ్మే… బందుగులేమన్నా దిగుతారో ఏం శనిద్రమో…’’ అంది చెంగమ్మ.

‘‘దిగనీలే ఏమయితాది’’ అంది వరాలు కోడి తలను పట్టుకుని నీళ్ల గిన్నెలో ముంచుతూ.

‘‘నీకు ముదిగారం చానా జాచ్చయుండాది. దించుతా లం…’’ అని చేతిలో వున్న మట్టి బెడ్డను కాకి మీదికి విసిరింది ‘‘షూ’’ అని అరుస్తూ.

బంధువులంటే చెంగమ్మ కంగారుపడడంలో పెద్ద విశేషమేమీ లేదు. చెంగమ్మ చేసిన బోండాల్ని శంకరయ్య సాయంత్రం దాకా బస్టాండులో వచ్చేపొయ్యే బస్సుల దగ్గర తిరిగి అమ్మితే రోజుకు పదిహేను రూపాయలదాకా మిగులుతాయి. యావత్తు కుటుంబానికీ అదే ఆధారం.

అంతలో పిల్లిపిల్లలు అరుస్తూ చెంగమ్మ చుట్టూ తిరగసాగాయి. వాటికి తెల్సు ఎవరి చుట్టూ తిరగాలో.

‘‘మ్మేయ్‌ వరాలూ నా తల్లీ ఈ అద్దురుపాయికి పాలు దెచ్చి ఈటికి పొయ్యే. అలమటిస్తాండాయి’’ అంది చెంగమ్మ బొడ్లోంచి చిల్లర తీస్తూ. అయితే వరాలుకి కోడిని వదిలిపోవాలని లేదు. పాలంటే అరమైలు దూరం పోయి రావాలి.

‘‘ఆ కోణ్ణేం జూచ్చావ్‌ పోమ్మా! సగలమ్మ తల్లి వుండాది అన్నిటికీ పైన. నీకు మంచి మొగుడొస్చాడు. ఆ తల్లి సలవుంటే కోయేట్నించి మీ పెద్దన్న దండిగా లెక్క పంపిస్చాడు లేమ్మా! ఫో నా తల్లీ’’ అని వరాలు గడ్డం పట్టుకుంది. వరాలు అయిష్టంగా లేచింది.

వరాలు పాలు తీసుకొచ్చేటప్పటికి-

ప్రకాశంగా వెలుగుతున్న ఆకాశం కింద సగలమ్మ మొక్కుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

పెద్దగంపకు పేడ అలికి ఎర్రమట్టి చారలు పూశారు. నల్లటి నూలుదారం గంప చుట్టూ చుట్టి మధ్యమధ్య వేప మండలు వేలాడదీశారు. కడిగిన బియ్యపు సిల్వర్‌ గిన్నెనూ, నీళ్ల బిందెనూ ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రిని సర్దేశారు.

రెండు కాళ్లూ కట్టేసిన కోడిని శంకరయ్య చంకలో పెట్టుకున్నాడు. చెంగమ్మ గంపను నెత్తి మీదికి ఎత్తుకుంటుంటే సుబ్బమ్మ సాయం చేసింది.

‘‘ఓమ్మో! సూరుకత్తి… సూరుకత్తి యాడ దీసుకున్నాం’’ అరిచింది చెంగమ్మ.

సుబ్బమ్మ గబగబా ఇంట్లోకి పోయి ఓ కత్తిని తెచ్చి గంపలో వొక వైపుకు దోపింది, వరాలు రెప్పవేయకుండా ఆ కత్తి వేపు చూస్తూండగా.

అందరూ బయలుదేరారు.

శంకరయ్య, రాయుడూ కొంచెం ముందూ… చెంగమ్మ, సుబ్బమ్మ, వరాలు కొంచెం వెనక. వరాలు చూపంతా శంకరయ్య చంకలో వున్న కోడి మీదే వుంది.

చెరువు కట్ట చేరుకున్నారు. అక్కణ్ణించి ఇంకా రెండు ఫర్లాంగులుంటుంది సగలమ్మమాను. దూరంగా కనిపిస్తోంది. తన కోడిని కబళించబోతున్న సగలమ్మంటే చాలా కోపంగా వుంది వరాలుకి.

‘‘అమ్మా! సగలమ్మంటే ఎవురే’’ అడిగింది వరాలు.

చెంగమ్మ నెత్తి మీది గంపను కొద్దిగా ఇంకోవైపుకు తల మీద సర్దుకుంది.

‘‘సగలమ్మ ఎవురంటే ఏం చెప్తామే పిలా?! కాపోళ్లామె. వాళ్ల నాయిన ఆచ్చీపాచ్చీ అన్నీ అమ్ముకోని చెరువు కట్ట కట్టించినాడంట. ఎన్ని మాట్లు గట్టినా కట్ట నిల్చడం లేదంట. రోజూ వొడ్డోళ్లను దీసకపొయ్యి కట్ట కట్టించేదీ… మళ్లా పొద్దున్నే చూస్తే కట్టుండేది కాదంట.

‘‘ఇంగాయన అన్నం దినకుండా, నీళ్లు దాక్కుండా పండుకోనుంటే ఈ సగలమ్మ తల్లి బొయ్యి ‘ఏం నాయనా అట్ట బండుకోనుండావు’ అంటే ‘ఈ మాదిరి అయిపోయుండాదమ్మా పరిచ్చితి’ అన్నేడు. అంటే అప్పుడు సగలమ్మ ‘నువ్వు లెయ్యి నాయినా. నీకేంటికి నేనుండా పా’ అని తానం చేసి పెండ్లి కూతురు మాదిరిగా తయారయ్యి గడ్డపార బుజానేసి నాయిన్ను ఎంట దీసుకోని – సెరువెంబడి బయలుదేరిందంట.

‘‘అంతే – వాళ్ల నాయిన చూచ్చావుండంగానే ఆ తల్లి పామయి ఆడెత్తిన పడగ దించకండా…’’ అని ఆపి చెంగమ్మ తల్లి వేపు చూసింది. ‘‘ఏమ్మా! పామయిపొయిండ్లా’’ అడిగింది సందేహంగా.

అక్కణ్ణించి సుబ్బమ్మ చెప్పడం ప్రారంభించింది.

‘‘ఆ! గాలా పాము? నాయినా ఈ మాదిరి నేను పామయి పోతాండాను. నా యెంబడి సెరువు కట్ట ఏసుకుంటా రా…! కొనా మొదులుకు’ అనిందంట…’’

‘‘ఆ ఆడమనిషి పామయిపోయిందావ్వా’’ అడిగింది వరాలు కళ్లు పెద్దవి చేసి. వరాలు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి.

‘‘పాము గాదుమ్మే… పాము అవుతారమైబోయింది. ఇంగాపాట్న కట్టట్నే నిలబడిపొయ్యింది. ఇంగాణ్ణించి సగలమ్మ దేవతైపొయ్యింది. ఎవురన్నా పెండ్లిండ్లకు బోతా ‘ఓ సగలమ్మ తల్లీ! పెండ్లికి గావాల నీ సొమ్ములిస్తావా’ అంటే సొమ్ములిచ్చేది. పెండ్లయి బొయినాక సగలమ్మ సొమ్ములు సగలమ్మకిచ్చే వోళ్లు ఎనిక్కి.

‘‘గానీ వొగరోజు వొగ గొల్లోడు కొండ మీద జీవాల్ని మేపుకుంటా – వాడి కూతురు పేరూ సగలమ్మే – ‘సగలమ్మా నీ అంకవలు బడిపోనూ… పలకవేమే’ అని కూతుర్ని తిట్నాడంట. ఆమయిన సగలమ్మ తల్లికి కోపమొచ్చి ‘నా అంకవలు పడిపొయ్యేది నిజమే. నువ్వు నా యెనక కుంటి యాపమానై నిలబడేది నిజమే. నీ జీవాలు నల్ల రాళ్లయి పొయ్యేదీ నిజమే’ అననిందంట.

‘‘ఇంగప్పట్నించి ఎవురు బిల్చినా పలికేది లే. సొమ్ములిచ్చేది లే’’ అని ముగించింది సుబ్బమ్మ. వరాలు మనసులో సగలమ్మంటే భయమూ భక్తీ కలిసిన ఒకలాంటి భావం స్థిరపడ్డం ప్రారంభించింది.

ముందుకెళ్లి శంకరయ్య చంకలోని కోడిని చేతుల్లోకి తీసుకుంది. దానికేదో చెప్పడానికి ప్రయత్నించింది.

అందరూ సగలమ్మ కట్ట చేరుకున్నారు.

గాలి హోరుమంటూ వీస్తోంది. ఆడవాళ్లకి ఎగిరిపోతున్న చీరల్ని పట్టు కోవడమే సరిపోయింది. గట్టిగా అరిస్తే గానీ వొకరిమాటలొకరికి వినిపించే పరిస్థితి లేదు.

సగలమ్మ మీదున్న పెద్ద వేపచెట్టు గాలికి విరుగుతుందా అన్నట్టు వూగుతోంది. సగలమ్మకు అటు మూడు ఇటు మూడు పెనవేసుకున్న పాముల్ని చెక్కివున్న నల్లరాతి పలకలున్నాయి. ముందు విశాలంగా నల్ల బండల్తో కట్టలా కట్టి చుట్టూ మోకాలెత్తు ఇనుప ఫెన్సింగ్‌ వేశారు. ఫెన్సింగ్‌కు ఓ చిన్న తలుపు లోపలికి వెళ్లడానికి.

కోడిని ఆ ఫెన్సింగ్‌ లోపల పడేశారు. రెండు కాళ్లు కట్టెయ్యడం వల్ల వొక వైపుకు వొరిగిపోయి కళ్లు మూస్తూ తెరుస్తోంది. భయం వల్ల అక్కడి నేలనంతా పాడు చేసేసింది. వరాలు వొంగి ఫెన్సింగ్‌ లోపలి కోడి వేపే చూస్తోంది.

సుబ్బమ్మ విగ్రహాల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టింది. చెట్టు కింద కొంచెం దూరంలో అప్పటికే సిద్ధంగా వున్న మూడు రాళ్ల మీద బియ్యం గిన్నెను పెట్టి ‘‘మ్మేయ్‌ వొరాలూ… ఎండుపుల్లలు ఏరకరాయే బెరీన’’ అంది చెంగమ్మ.

వరాలు ఎండు పుల్లల కోసం చెరువు కట్టెంబడి పోతూంటే చెరువు కోళ్లు ఒక్కసారిగా నల్లటి మబ్బుల గుంపుల్లోకి ఎగిరాయి టపటపా శబ్దం చేస్తూ. ఆ దృశ్యం వరాల్లో ఎంత సంతోషం కలిగించిందంటే తాను కూడా ఓ చెరువు కోడి అయిపోయినంత సంతోషం కలిగి ఓసారి తన వేపు చూసుకుంది ఆ గాలిహోరులో.

పుల్లలు తల్లి ముందు పడేసి ‘‘బలపం బట్టి బేమ్మ వొళ్లో… అ… ఆ… ఇ… ఈ…’’ అని బిగ్గరగా పాడింది కులుకుతూ.

అందరూ నవ్వేరు. అప్పుడు వాతావరణం ఎంత వుత్తేజపూరితంగా వుందంటే ఎప్పుడూ చిటచిటలాడే శంకరయ్యకు కూడా లేచి గెంతాలనిపించింది.

పుల్లలతో నానాతిప్పలు పడి పొయ్యి వెలిగించారు.

అన్నం పూర్తిగా వుడకక ముందే వరాలు గబగబా బెల్లం పొట్లం తెచ్చి చెంగమ్మ వారిస్తున్నా వినకుండా అన్నం గిన్నెలోకి బెల్లాన్ని వొంపేసి కాగితానికి అంటిన బెల్లాన్ని పళ్లతో గీక్కుంటూ నిలబడింది.

మూడు రావిఆకుల్ని తెచ్చి వొక్కొక్క దాంట్లో కొద్దికొద్దిగా బెల్లపన్నమూ, వొక్కొక్క అరటిపండూ సగలమ్మకు నైవేద్యంగా పెట్టారు. విగ్రహం కిందుగా వున్న త్రికోణాకారపు గూట్లో చాలా కష్టపడి ప్రమిదను వెలిగించారు. అగరుబత్తీలు అంటించి ఓ సిమెంటు పగులులో గుచ్చి, కర్పూరం వెలిగించింది సుబ్బమ్మ. వెంటవెంటనే రెండు కొబ్బరికాయలు కొట్టి శంకరయ్య వేపు తిరిగి-

‘‘కొయ్‌! కోణ్ణి కొయ్‌. కర్పూరం ఆరిపోతుంది. అయ్యో నాయినా కోడికి గుది గాళ్లు దీలా… ఏం దీలా…’’ అని అరిచింది.

శంకరయ్య వుత్సాహంగా కోడి కాళ్లకు కట్టిన తాడును కోసేస్తూంటే, అంతవరకూ కొబ్బరిచిప్పల కేసి చూస్తున్న వరాలు గబగబా కోడి దగ్గరికి పరిగెత్తు కొచ్చింది. సుబ్బమ్మ విదిలించుకుంటున్న కోడి శరీరాన్ని పట్టుకుంది రెండు చేతుల్తో గట్టిగా. శంకరయ్య ఎడం చేత్తో కోడితలను పట్టుకుని కుడిచేతిలోని కత్తిని కోడి గొంతు మీద పెట్టాడు.

వరాలు కాళ్లు దబదబా అదిరాయి. చెమటలు పడుతున్న అరిచేతుల్తో లంగాని గట్టిగా పట్టుకుంది.

శంకరయ్య కోడి మొండేన్ని సర్కారు కంపల్లోకి విసిరి తలని చెంగమ్మకు అందించాడు.

చెంగమ్మ కోడితలని సగలమ్మ ముందు పెట్టింది. చెంబులోని నీళ్లు కుడిచేతిలో వొంపుకుని విసురుగా దాని తల మీద చల్లుతూ-

‘‘పలుకు తల్లీ! పలుకు… సగలమ్మ తల్లీ పలుకు!’’ అని అరిచింది.

కోడి తల రెండుసార్లు నోరు తెరిచి మూసింది.

‘‘అదో తల్లి పలికిందే. ఎర్రిముండా ఏడుస్తాండాయేమే. సగలమ్మ తల్లి పలికితే’’ అంది వరాలు వేపు చూస్తూ.

కళ్లలో నీళ్లు ఇంకి పోకముందే వరాలూ వుత్సాహంగా నవ్వింది.

మీ మాటలు

  1. Rajesh Devabhaktuni says:

    కధ బాగుంది. ఇల్లు గడవడం కష్టంగా ఉన్న వాళ్ళ ఇళ్లలోనే నేను అనేకానేక పెంపుడు జంతువులు చూశాను.

    ‘‘మ్మేయ్‌ వరాలూ నా తల్లీ ఈ అద్దురుపాయికి పాలు దెచ్చి ఈటికి పొయ్యే. అలమటిస్తాండాయి’’ అంది చెంగమ్మ

  2. లలిత says:

    వరాలు ఎలా అయినా కోడిని విడిపిస్తుందని చివరివరకు నిబ్బరంగా ఉన్నాను. కానీ …….హుమ్మ్!!
    చెంగమ్మ ఇంటికి చుట్టంగా వెళ్ళి అక్కడ జరిగే తంతంగవంతా స్వయంగా చూసినట్టు వుంది.
    సంభాషణల్లో వాడిన యాస ఏ ప్రాంతానికి చెందినదో చెపుతారా ?

  3. frigging brilliant, sir!

  4. మాట్లాడిన భాష నెల్లూరు కాని చిత్తూరు కాని అనుకుంటున్నా.

    • ramanajeevi says:

      కథ జరిగిన ప్రాంతం రాజంపేట. కడప జిల్లా యాస. అయితే కొంత చిత్తూర్ ప్రభావం ఉండొచ్చు, తిరుపతి దగ్గర కావడం వల్ల.

  5. TENNETI KRISHNA says:

    పల్లె జీవుల యదార్థ జీవిత చిత్రణ . వారి బాష , అలవాట్లు , పరిసరాలు కళ్ళకు కట్టినట్టు చూపారు . బలి ఇస్తే దేవత కోరికలు తీరుస్తుంది అనే మూఢనమ్మకాన్ని పల్లె ప్రజల మనసుల్లోనించి తొలగించాలి . ఇది రాయలసీమ మాండలికం అనుకొంటాను. రచయితకు అభివందనలు.

Leave a Reply to ramanajeevi Cancel reply

*