హైదరాబాద్‌ చెప్పుకున్న ఆత్మకథ ‘యుగసంధి’

sangisetti- bharath bhushan photoహైదరాబాద్‌ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక జీవనానికి అక్షరరూపం భాస్కరభట్ల కృష్ణారావు నవలలు. 1950-66ల మధ్య మొత్తం నాలుగు నవలలు రాసిన ఈయన పైదాయిషీ హైదరాబాదీ.
నగరం స్మృతిని, జీవితాన్ని, జీవితాల్లోని సంఘర్షణలను, ఆలోచనలను, ఉన్నత ఆదర్శాలను, అంతకుమించి అత్యున్నత జీవిత విలువల్ని ఒకవైపూ ఛిద్రమవుతున్న బతుకుల్ని, చిదిమేస్తున్న దోపిడీ వ్యవస్థ, దానికి అండగా నిలిచిన వెన్నెముకలేని రాజకీయాలు, అన్ని విధాలుగా భాగ్యవంతులైన వారు అభాగ్యులుగా మారిన అమానవీయతను మరోవైపూ తన నవలల్లో కృష్ణారావు అక్షరీకరించారు.

హైదరాబాద్‌ నగర జీవితానికి సంబంధించినంత మేరకు భాస్కరభట్ల కృష్ణారావు నవలలు ఒక డాక్యుమెంటరీ. ప్రస్తుతం ‘అభివృద్ధి’ ఆవరించి మెట్రో రైలుపేరిట నగరాన్ని దిగమింగుతున్నాయి. చారిత్రక కట్టడాలు కనుమరుగవుతున్నాయి. సుల్తాన్‌ బజార్‌లాంటి నవలల్లోని ప్రదేశాలు రూపుమారనున్నాయి. కోఠీ విమెన్స్‌ కాలేజి కళావిహీనం కానుంది. వందల యేండ్లుగా సజీవ సంఘటనలకు సాక్ష్యాలుగా నిలిచిన ప్రదేశాలు మూగగా రోదిస్తూ రూపు మార్చుకుంటున్నాయి. తరిగిపోతున్న, నాశనం అవుతున్న ఒక చారిత్రక వారసత్వాన్ని ఈ నవలలు దివిటీపట్టి ఆకాశమెత్తు ఎత్తి చూపించాయి. ఇట్లాంటి నగరంపై, నగర చరిత్రపట్ల, సంస్కృతి పట్ల ఎలాంటి పట్టింపులేని పాలకులు, ప్రతిపక్షాలు ఒకేరీతిలో ప్రజాభిప్రాయాన్ని ‘బుల్‌డోజ్‌’ చెయ్యడమే పనిగా పెట్టుకున్నాయి.

‘బుల్‌డోజ్‌’కు గురవుతున్న చరిత్ర, సంస్కృతిని, సాహిత్యాన్ని కాపాడుకునేందుకు కొత్తతరం నడుంకట్టేందుకు కృష్ణారావు నవలలు స్ఫూర్తి కావాలి. యుగసంధి  నవల మొదట 1956లో ‘తెలుగు స్వతంత్ర’ పత్రికలో సీరియలైజ్‌ అయింది. తర్వాత 1957లో నవలగా వెలువడింది. ఇందులో 1920- 48 మధ్య కాలంలో హైదరాబాద్‌ కేంద్రంగా మొత్తం తెలంగాణలో చోటుచేసుకున్న సకల మార్పులు, ఉద్యమాలు, ఉద్వేగాలు, జీవితాలు, ఆర్థిక ప్రగతి, ఆదర్శాలు అన్నీ కలగలిసి ‘యుగసంధి.’.

ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటేనే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదుమిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు ఈ ఆరున్నర దశాబ్దాల ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దిశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము.

ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్నకాలంలో వాటిని చూసి అనుభవించి వ్యాఖ్యానిస్తే వాటిపై భావోద్వేగాల ప్రభావం ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల, విశ్లేషణ మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనల్లో మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.

ఆనాటి వుద్యమాల డాక్యుమెంటు

1921 మొదలు 1948 వరకు తెలంగాణలో జరిగిన ఉద్యమాలన్నీ ‘యుగసంధి’ నవలలో రికార్డయ్యాయి. ఉద్యమాలకు నవలలోని పాత్రలకు విడదీయరాని సంబంధం ఉండడంతో ఈ అంశాలు చొప్పించినట్లుగాకుండా సాఫీగా సాగిపోతాయి. ఆంధ్రమహాసభ మొదలు హైదరాబాద్‌పై పోలీసు చర్య వరకు వివిధ ఉద్యమాలు ఇందులో విస్తృతంగా చర్చకు వచ్చాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సందర్భంలో సంప్రదాయ, అంధ విశ్వాసాల/ మూఢనమ్మకాలను ఆచరించే వర్గానికి, ‘అభ్యుదయ’ భావాల ఆచరించే వారి మధ్యన జరిగే ఘర్షణను ‘యుగసంధి’గా ఆవిష్కరించాడు రచయిత. నిజానికి ఈ రచయిత కథలు, నవలలు 1940-60వ దశకంలో చదువుకున్న తెలంగాణ వారందరికీ గ్రాహ్యమే. గోలకొండ పత్రిక, దక్కన్‌ రేడియో ద్వారా తెలంగాణ సాహితీ ప్రియులందరికీ పరిచయమే!

హైదరాబాద్‌ స్టేట్‌ అస్తిత్వం కనుమరుగై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవతరిస్తున్న సందర్భంలో వచ్చిన ‘యుగసంధి’ నవలలో ఒక రాజ్యం అంతర్థానమై ఇంకొక రాష్ట్రం ఏర్పాటు సంధి కాలంలో హైదరాబాద్‌ ముఖ చిత్రాన్ని నవలాకర్త ఆవిష్కరిస్తాడు. నవల హైదరబాద్‌పై పోలీసు చర్యతో ముగిసినా ఆ తర్వాతి కాలంలో ఈ అంశాలేవి తెలుగు సమాజానికి పాఠ్యపుస్తకంగా గానీ, సాహిత్య రూపకంగా గానీ అందుబాటులోకి రాకపోవడంతో దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదు. ఇది ఒక్క భాస్కరభట్ల కృష్ణారావుకు జరిగిన అన్యాయం కాదు. 1956కు ముందు సాహిత్యసృజన చేసిన తెలంగాణ సాహితీవేత్తలందరికీ జరిగిన అన్యాయం. ఇక్కడి వారు ప్రచారానికి విముఖులు కావడం ఒక కారణం కాగా, వారి గురించి, వారి రచనల గురించి విమర్శ, విశ్లేషణ, చర్చ తెలుగు పత్రికల్లో తగినంతగా జరుగకపోవడం మరో కారణం.

ఈ కారణంగానే అటు ఒద్దిరాజు సోదరులు మొదలు సురవరం ప్రతాపరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి తదితరులెవ్వరికీ న్యాయంగా తెలుగుసాహిత్యంలో న్యాయంగా దక్కాల్సిన స్థానం దక్కలేదు. తెలంగాణ సాహిత్యాన్ని కేవలం సాయుధ పోరాటంతో ముడివేసి చూడడం కారణంగానే అంతకుముందూ ఆ తర్వాత వచ్చిన సాహిత్యానికి గుర్తింపు లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలుగు సాహిత్యంలో ఉపశీర్షికలకు, ఫుట్‌నోట్స్‌కు మాత్రమే పరిమితమై ఉన్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొత్త పరిశోధనలకు, కొత్త రచనలకు ఊతమిస్తున్నాయి. ఇదే విషయాన్ని భాస్కరభట్ల కృష్ణారావు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘న్యూరైటింగ్‌’ పేరిట అనేక రచనలు వెలువడ్డాయని, ఎక్కడైనా పోరాటం ఉంటేనే సాహిత్య సృజన ఎక్కువగా ఉంటుందని చెప్పకనే చెప్పిండు.

bhaskerabhatla-1

అందుకే ఇప్పటికీ తమ హక్కుల కోసం, పీడన నుంచి విముక్తి కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆఫ్రికన్స్‌, ‘బ్లాక్స్‌’ (పాజిటివ్‌ అర్థంలోనే) సృష్టిస్తున్న సాహిత్యం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంది. ఈ సాహిత్యం మాదిరిగానే ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో వందల సంఖ్యంలో సంకలనాలు పది జిల్లాల నుంచి వెలువడుతున్నాయి. సంవేదనతో, ఆగ్రహంతో, పీడన నుంచి విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం పది జిల్లాల కవులు, కథకులు, రచయితలు తమ గళాన్ని, కలాల్ని, పిడికిళ్ళను ఎత్తిపడుతున్నారు. అదే విధంగా గతకాలపు ఆణిముత్యాలు కూడా కొత్తగా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న ఈ నవలలు కచ్చితంగా జనం మరిచిన తెలంగాణను తెలుసుకునేందుకు అకరాలు అవుతాయి. గత కాలపు విస్మృత తెలంగాణను దర్శించేందుకు దివిటీలవుతాయి.

సరిగ్గా ఇవే విషయాలు ఇక్కడ మనం చర్చించుకుంటున్న నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గత కాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటేనే వాస్తవాల్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, జీవన్మరణ సంఘర్షణలు అన్నీ కలగలిసి ‘యుగసంధి’, ‘వెల్లువలో పూచిక పుల్లలు’ నవలలుగా రూపుదిద్దుకున్నాయి ఈ రెండు నవలలు ఆనాటి తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టాయి. రచయిత వీటిల్లో మానసిక సంఘర్షణలను, పరిస్థితులు, వ్యక్తులు, సమాజంపై వేసిన ప్రభావాల్ని భిన్న పార్శ్వాల నుంచి తడిమి పాఠకుణ్ని తనతో పాటు నడిపించాడు. చైతన్యస్రవంతి శిల్పంతో, అధివాస్తవికత భావనలతో తన నవలల్ని తీర్చి దిద్ది తెలుగు పాఠకులకు ఒక కొత్త తరహా సాహిత్య రుచిని చవి చూపించాడు.
అక్షరమక్షరం పాతల్ర మానసిక సంఘర్షణను, జీవన పోరాటాలను, నింపాదిగా ఉండనివ్వని ఆలోచనలు, ఆదర్శాలు అన్నింటినీ ఈ నవలలు చిత్రించాయి. యుగసంధి నవలలో పైరవీలు, పటేలు`పట్వారీ తగాదాలు మొదలు, కొంతమంది రొహిలాలు, అరబ్బుల దౌర్జన్యాలు, విధవా వివాహాలు, ఆర్యసమాజ్‌, ఆంధ్రమహాసభ, వందేమాతరం, కమ్యూనిస్టులు, రజాకార్లు, అతలాకుతలమైన హైదరాబాద్‌ జీవనం, అవి ఆయా కుటుంబాల్లో తీసుకువచ్చిన మార్పులు, కాలంతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న` మారుతున్న విలువలు, ఒకవైపు శుద్ధశ్రోతియ బ్రాహ్మణులు పాటించే ఆచారాలు, మరో వైపు బ్రాహ్మణుడైనప్పటికీ జంధ్యంతో పాటు అన్నీ త్యజించి తాగుడు, డిబాచిరీకి అలవాటు పడ్డ ‘లంపెన్‌’ వ్యక్తి విశ్వేశ్వరరావునీ ఇందులో చిత్రించాడు.

మంచీ చెడుల సహ గమనం

హైదరాబాద్‌ నగర జీవన విధానం, రాజకీయ పరిస్థితులు, సామాజిక, సాంస్కృతికరంగాలు, హిందూ`ముస్లిం దోస్తానా దానితో పాటే మజ్లిస్‌ మతవిద్వేషం, జమీందార్లలో కూడా మంచీ చెడూ రెండూ ఉంటాయని భాస్కరభట్ల చెప్పిండు. ఆధునిక స్త్రీ స్వయం నిర్ణయాధికారం కోసం తండ్రిని సైతం ఎదిరించడం, విద్యా ప్రాధాన్యత ఈ నవలలో ప్రధానంగా చోటు చేసుకున్నాయి.

ముఖ్యంగా రుక్మిణి, రమణ, పద్మల పాత్రల ద్వారా ఆనాటి స్రీల ఆలోచనాసరళిని వారి తెగింపుని, కట్టుబాట్లకు లొంగని తిరుగుబాటు దోరణిని చదువుకున్న, ప్రగతిశీల భావాలు గల స్త్రీల మనోభావాల్ని రికార్డు చేసి నవలకు సమగ్రత కల్పించిండు. నిరుద్యోగం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం కూడా ఇందులో అంతర్లీనంగా చోటు చేసుకున్నాయి.భాస్కరభట్ల మొత్తం నాలుగు నవలలు రాసిండు. అవి వింతప్రణయం, భవిష్యద్దర్శనం, యుగసంధి, వెల్లువలో పూచిక పుల్లలు. భాస్కరభట్ల నవలల్లో మొదటగా చెప్పుకోవాల్సింది యుగసంధి. ఇందులోని రఘు, రుక్మిణి, రమణ, పద్మ పాత్రలు భిన్న ధృక్కోణాల్లో ఆనాటి సమాజాన్ని ఆవిష్కరిస్తాయి. భిన్నమైన ఆలోచనలు కలవాళ్ళని ఒక్కదగ్గర చేర్చి నవల నడిపించడమంటే చాలా క్లిష్టమైనపని. ఆ పనిని భాస్కరభట్ల విజయవంతగా చేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘యుగసంధి’ నవల్లో రఘుపాత్రలో అక్కడక్కడ భాస్కరభట్ల కనిపిస్తాడు.‘యుగసంధి’ నవల హీరో రఘు స్వయంగా ఇంగ్లీషు ఎమ్మే ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. రఘు పాత్ర  ద్వారా ఆనాటి తెలంగాణ సమాజానికి పరిచయమైన పాశ్చాత్య సాహిత్యాన్ని గురించి రచయిత విశ్లేషిస్తాడు.

నిజానికి హైదరబాద్‌లో 1917లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడే వరకు కూడా ఇంగ్లీషు మాధ్యమంగానే ఉన్నత చదువులు కొనసాగేవి. అయితే బ్రిటీషిండియాలో గాంధీ లేవదీసిన ‘ఉర్దూ`హిందుస్థానీ’ జాతీయ ఉద్యమాల ప్రభావంతో ఉస్మానలీఖాన్‌ తన పేరిట ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించడంతో ఇక్కడ విద్యాబోధన ఉర్దూమాధ్యమంగా ప్రారంభమయింది. ఈ విశ్వవిద్యాలయం ఉర్దూ మాధ్యమంగా ఆరంభం కావడానికి ప్రధాన కారకుడు రవీంద్రనాథ్‌ టాగోర్‌. ఆయన సూచనల మేరకే ఉర్దూ మాధ్యమంగా యూనివర్సిటీని ప్రారంభించారు. అయినప్పటికీ నిజాం కాలేజి, దాంతోపాటు మరి కొన్ని కళాశాలల్లో బోధన పూర్తిగా ఇంగ్లీషులోనే కొనసాగేది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉర్దూ బోధనా భాష చేయడంతో హైదరాబాద్‌ రాజ్యంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు దెబ్బతిన్నాయని కూడా రచయిత చెప్పిండు.

ఎన్ని అవరోధాలు ఉన్నా నిజాం కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో పంచభాషా సంస్కృతి ఉండేది. నగరంలోని దాదాపు చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఫార్సీ భాషలు వచ్చేవి. పోలీస్‌ యాక్షన్‌ తర్వాత ప్రభుత్వాలు ఎకాఎకిన తెలుగును అధికార భాష చేయడంతో ఈ భాష తెలిసిన ఆంధ్రప్రాంతీయులు ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాద్‌లో ఉద్యోగాలు సంపాదించారు. అంతేగాకుండా స్థానిక పంచభాషా సంస్కృతి కూడా సర్వ నాశనమయింది. భాషారాష్ట్రాల పేరిట ఐదారు భాషలు, కలిసిమెలిసి ఉండిన సంస్కృతిని భ్రష్టుపట్టించి ఏకైక భాష ‘తెలుగు’కు మాత్రమే పట్టం కట్టారు. ఉర్దూ మూలంగా కన్నా ‘తెలుగు’ మాత్రమే వెలిగించే ప్రభుత్వాల మూలంగా హైదరాబాద్‌ పంచభాష సంస్కృతి, తెహజీబ్‌ కనుమరుగయ్యింది.

హైదరబాద్‌ నగరంలో ఉద్యోగం చేయాలంటే కేవలం ఉర్దూ, కొంత ఫార్సీ వస్తే చాలు అన్న పరిస్థితులున్న కాలంలోనే భాస్కరభట్ల కృష్ణారావు కలకత్తా వెళ్ళి అక్కడ బి.ఎస్‌.సి చదివాడు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చి లా చదివాడు. దక్కన్‌ రేడియోలో ఉద్యోగం సంపాదించి ఎందరో తెలుగువారికి అవకాశం కల్పించాడు. స్వయంగా తన నాటకాలు ప్రసారం చేయడమే గాకుండా, పాటలకు ప్రథమ స్థానం కల్పించాడు. హైదరాబాద్‌ రాజ్యం తన అస్తిత్వాన్ని కోల్పోయి భారతదేశంలో విలీనం కావడంతో ‘దక్కన్‌ రేడియో’ కూడా ఆలిండియా రేడియోలో సంలీనమయింది. దీంతో తనదైన హైదరాబాద్‌ ముద్ర చెరిగిపోయి ప్రాంతేతర ‘తెలుగు ముద్ర’ పడింది.

అప్పటివరకూ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నందగిరి ఇందిరాదేవి, మాడపాటి సత్యవతి లాంటి వారికి పుట్టినిల్లుగా ఉండిన ‘రేడియో’లో ప్రాంతేతరుల ప్రవేశం ప్రారంభమయింది. దీంతో ఉర్దూ, తెలుగు మిశ్రిత భాష క్రమంగా తెరమరుగయింది. ఇవే విషయాల్ని నేడు తెలంగాణవాదులు ఉద్యమ సందర్భంలో పదే పదే ముందుకు తీసుకువస్తున్నారు. తెలంగాణ తనదైన తెలుగుభాషను కోల్పోయిందని చెబుతున్నారు. కేవలం భాష విషయమే గాకుండా ‘యుగసంధి’ నవల ద్వారా అనాటి అనేక సమకాలీన అంశాలను కూడా చరిత్రకెక్కించాడు.

‘యుగసంధి’ నవలలో రెండున్నర దశాబ్దాల తెలంగాణ ఉద్యమాలను ఆంధ్రమహాసభ మొదలు పోలీసు చర్య వరకు సుదీర్ఘంగానే చర్చించాడు. ఆంధ్రమహాసభ వారు ‘వర్తక స్వాతంత్య్రం’, ‘వెట్టిచాకిరి’, మగ్గంపన్ను, పేరిట వేసిన చిన్న పుస్తకాలు ఆనాడు ఉద్యమానికి ఎలా ఊతమిచ్చాయో ఈ నవల ద్వారా తెలుస్తుంది. అలాగే బహద్దూర్‌ యార్జంగ్‌ మజ్లిస్‌ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వం వాక్‌, సభా స్వాతంత్య్రాలను అరిగడుతూ గస్తీనిషాన్‌`53 పేరిట వెలువరించిన జీవో, పాఠశాలలు స్థాపించుకోవాలంటే అనుమతి తప్పనిసరి, వార్షికోత్సవాలు జరుపుకోవాలంటే లిఖితరూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోవని రాసివ్వడం అన్నీ ఇందులో చర్చకు వచ్చాయి.

బ్రిటీషాంధ్రలో గాంధీజి పిలుపుమేరకు ఉద్యమాలు జరుగుతూ ఉండటం వాటి ప్రభావం హైదరబాద్‌లో ఏమాత్రం లేకపోవడంతో ఒక దశలో స్వయంగా ఉద్యమాన్ని లేవదీద్దామనే ఆలోచన కూడా ‘రఘు’కు వస్తుంది. అయితే అనంతర కాలంలో గోవిందరావ్‌ నానల్‌ వంటి వారు హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లో ‘సత్యాగ్రహం’ చేపట్టడంతో తాను కూడా అందులో చేరాలని భావిస్తాడు. ఇలాంటి సందర్భంలోనే తాను ఎమ్మే చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడంతో దానికి ‘రఘు’నాయకత్వం వహించి విజయవంతంగా ఒక సంవత్సరం పాటు నడిపిస్తాడు.

చందాలు వసూలు చేసి విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగకుండా నాగపూర్‌లాంటి ప్రాంతాలకు పంపించి అక్కడ విద్యాబుద్ధులు చెప్పిస్తాడు. అలా నాగపూర్‌ వెళ్ళి చదివిన ఉస్మానియా విద్యార్థుల్లో పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఉన్నారు. ఆనాటి విద్యార్థుల కష్టాలు, విద్యార్థినులచే వందేమాతర ఉద్యమం చేయించాలని ప్రయత్నించి విఫలమైన తీరు అన్నీ ఇందులో చోటు చేసుకున్నాయి.

స్వయంగా వందేమాతర ఉద్యమానికి నాయకత్వం వహించడంతో, ఎమ్మే ఇంగ్లీషు ఫస్ట్‌ క్లాస్‌లో పాసయినా ఏ కళాశాల వారు కూడా రఘుకు ఉద్యోగం ఇవ్వలేదు. ఆనాటికి ఈనాటికి పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి లేదనడానికి ఇదే సూచన. ఈనాడు కూడా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థుల్ని అక్రమ కేసుల పేరిట భయపెడుతూ, మీకు ఉద్యోగాలు రావు అని హెచ్చరిస్తున్నారు. ఈ దశలో రఘుకి హైదరాబాద్‌ సివిల్‌సర్వీసెస్‌ రాయడానికి అవకాశమున్నా నిర్దయగా ఉన్న ప్రభుత్వంలో పనిచేయడానికి ఆయనకు మనస్కరించలేదు. నిజానికి ఒక మధ్యతరగతి హైదరాబాదీ ‘సివిల్‌ సర్వీస్‌’ ఉద్యోగం చేయాలని కలగనడమే ఒక అభివృద్ధి సూచిక. ప్రధాన పాత్ర పద్మ తండ్రి కూడా డాక్టర్‌ కావడం కూడా చూస్తే ఇది ఆనాటి ఉన్నత మధ్యతరగతి జీవితాలను చిత్రించిందనడంలో అతిశయోక్తి లేదు. అవినీతి, ఆశ్రితపక్షపాతం కారణంగా యూనివర్సిటీకంతటికీ ప్రథముడిగా నిలిచినా లెక్చరర్‌ ఉద్యోగం కూడా రాని సందర్భంలో రఘు ఉద్యోగ ప్రయత్నాలే విరమించుకున్నాడు.

ఆనాడు తెలంగాణలో స్వతంత్రప్రతిపత్తితో పనిచేసే అవకాశమున్న ఏకైక వృత్తి న్యాయవాదం. అందుకే స్వాతంత్య్ర సమరయోధులందరూ లా చదివిన వారే. అడ్వకేట్లుగా రాణించిన వారే. ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించిన దాదాపు అందరూ న్యాయవాదులే కావడం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అందుకే రఘు చివరికి లా చదివి అడ్వకేటుగా స్థిరపడాలని నిర్ణయించుకుంటాడు. స్వాతంతత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగాలు రాని పరిస్థితే గాకుండా, జపాన్‌ సైనికులు మణిపూర్‌పై దాడి మొదలు, హైదరాబాద్‌ స్వతంత్ర ప్రతిపత్తి, సిడ్నీకాటన్‌ ఆయుధాల సరఫరా, రజాకార్లు ఇలా హైదరాబాద్‌ స్వాతంత్య్రోద్యమంలోని అన్ని అంశాల గురించి ఈ నవల చర్చించింది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొనే మహిళల గురించి ఒకవైపు, మరోవైపు సిగరెట్‌ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల్ని చిత్రించిండు.

స్త్రీల ఆధునిక జీవన దృశ్యం

మహిళలు కార్మికులుగా పనిచేయడమంటేనే అది అభివృద్ధికి చిహ్నం. ఎందుకంటే నగరాల్లో ఫ్యాక్టరీలు వెలువడడం, వారు తమ ఆర్థిక స్థితిని మెరుగు పరుచుకోవడానికి స్వీయ సంపాదనపై ఆధారపడడమంటేనే మారుతున్న సమాజానికి ఆనవాలు. ఇదే విషయాన్ని రమణ పాత్ర గురించి రచయిత ఇలా చెప్పాడు. ‘‘… తాను 20వ శతాబ్దపు యువతిగా బ్రతకదలచింది. తనకాళ్ళపై తాను నిలబడదలచింది. నేడు స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం వుంటేనే గాని ఆమెకి సంఘంలో గౌరవం లేదు. తాను ఆర్థిక స్వాతంత్య్రం కోసం పాటు పడదలచింది’’. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి సంఘంలో గౌరవం వుంటుందనే విషయాన్ని 60యేండ్ల కిందనే గుర్తించి ప్రచారం చేశాడంటే ఆయన దార్శనికత అర్థమవుతుంది. నవలల్లో స్త్రీ పాత్రలను తీర్చి దిద్దడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడని అనిపిస్తుంది. పదికి పైగా ఉన్న మహిళా పాత్రలను ఒకదానితో ఒకటి ఎక్కడా సారూప్యత లేకుండా భిన్నంగా మలిచాడు. వీటన్నింటిలోకి రుక్మిణి పాత్ర విశిష్టమైనది.

ఎనిమిదో ఏట పెళ్ళయి ఆర్నెల్లకే ‘మొగుడ్ని’ కోల్పోయిన రుక్మిణికి విధవా పునర్వివాహం గురించి, దాన్ని ఆంధ్రదేశంలో ప్రచారం చేసిన కందుకూరి వీరేశలింగం గురించీ, హైదరబాద్‌లో కూడా వాటిని చేసుకున్న వాళ్ళ గురించీ ‘బావ’ రఘు ద్వారా తెలుసుకుంది. నిజానికి సరోజిని నాయుడు` ముత్యాల గోవిందరాజుల వివాహం కందుకూరి వీరేశలింగం చేయించిన నాటినుంచే ఆయన గురించి తెలంగాణ వారికి కూడా కొంత తెలిసింది. ఆర్యసమాజ పద్ధతిలో వివాహం చేసుకుంటానని చెప్పిన ‘విశ్వేశ్వరరావు’ తుదకు డొక్కలో తన్ని మానవ మృగంలా తనని ఆక్రమించుకున్నా ఏమిజేయలేని స్థితికి చేరుకుంటుంది. నమ్మి విశ్వేశ్వరరావుతో వచ్చినందుకు మానంతో పాటు కంటె, గొలుసు కూడా అర్పించుకుంది. ఇలాంటి అభాగ్యురాళ్లు అప్పటికీ, ఇప్పటికీ మన కండ్లముందు కనబడుతూనే ఉంటారు. అయితే వారి పట్ల సంవేదనతో, సానుభూతితో, సాంత్వనతో రాసిన వాళ్ళు అరుదు. ఆ అరుదైన ఘట్టానికి ‘యుగసంధి’లో భాస్కరభట్ల జీవం పోసిండు.

చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ‘విధవ’ అయిన రుక్మిణి లంపెన్‌ ‘విశ్వేశ్వరరావు’ చేతిలో బలయిన తీరు. విశ్వేశ్వరరావు లైంగిక వాంఛను తీర్చడానికి అనుభవించిన హింసను నవలాకర్త భాస్కరభట్ల కృష్ణారావు మనస్సుల్ని కదిలించే విధంగా చిత్రిక గట్టిండు. ఈ నవల తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పులను చిత్రిక గట్టాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలను, భాష, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలను చర్చించాయి. భిన్న దృక్కోణాల్లో భిన్నమైన రీతిలో నవలలోని పాత్రలు సమాజాన్ని దర్శించాయి.

‘యుగసంధి’ నవల్లో ఈ భిన్నత్వాన్ని సహజసిద్ధంగా తీర్చిదిద్దిన పాత్ర రమణ. ఆర్థిక స్వాతంత్య్రం ద్వారానే స్త్రీకి గౌరవం దక్కుతుందని నమ్మి దాన్ని సాధించుకునేందుకు ఆత్మగౌరవంతో ముందడుగేసిన మహిళ రమణ. త్యాగం, ఆత్మగౌరవం, పట్టుదల, తిరుగుబాటు, అభ్యుదయ భావాలు అన్ని కలగలిపిన పాత్ర రమణ.ఇక పోతే ‘పద్మ’ పాత్రలో ఆనాడు ‘స్త్రీ’ స్వతంత్రంగా ఎదగడానికి తండ్రి తోడ్పాటు, దాన్ని దుర్వినియోగం కాకుండా ఆమె ఉపయోగించిన తీరు నవలలో ప్రస్తావనకు వస్తాయి. మనసులో ఉన్నది ఎదుటివారికి సూటిగా చెప్పే పాత్రగా పద్మని తీర్చాడు. రఘు డబ్బు తీసుకొని బాగా చదువుకున్నాడు. అదే డబ్బుని తీసుకోవడానికి కనీసం అప్పుగా కూడా తీసుకోవడానికి నిరాకరించి ‘రమణ’ తన ఆత్మగౌరవాన్ని చాటుకుంది.

రజాకార్ల రాజ్యంలో

ఇక్కడ రజాకార్ల గురించి కొంచెం విపులంగా చర్చించుకోవాలి. హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగిన నాడే రఘు`పద్మలకు కూతురు పుడుతుంది. ఆమె పేరు కళ్యాణి అని పెడతారు. లోక కళ్యాణం కోసం హైదరాబాద్‌పై పోలీసుచర్య జరిగింది కాబట్టి ఆ పేరు పెట్టారని రచయిత చెబుతాడు. అయితే తర్వాతి కాలంలో ఇది తప్పని రచయిత తెలుసుకొని ఉంటాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రజాకార్ల దౌర్జన్యాలు, దుర్మార్గాలు మాత్రమే రచయితకి కనబడ్డాయి. నిజానికి 1948లో రజాకార్ల గురించి కాళోజి ‘నల్లగొండలో నాజీల కరాళ నృత్యం ఇంకెన్నాళ్ళు’ అని నిరసించాడు. అయితే 1969 వచ్చే సరికి రజాకార్లే నయం ఈ ఆధిపత్య ఆంధ్రులకన్నా అనే అభిప్రాయాన్ని వ్యక్తం జేసిండు. 1956లో సమైక్యవాదిగా ఉన్న కాళోజి 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నాటికి తెలంగాణవాదిగా మారిండు. దాశరథి 1964 నాటికి కొంత తెలంగాణ బాటపట్టిండు. ఇలా రజాకార్ల విషయంలో గానీ, తెలుగు భాష విషయంలో గానీ, పోలీసుచర్య విషయంలోగానీ అందరికీ ఎప్పటికీ ఒకే అభిప్రాయం లేదు. అది విషయపరిజ్ఞానంతో పాటు మారుతూ వచ్చింది. నిజానికి పోలీసుచర్య మూలంగా వేలాది కమ్యూనిస్టు వీరులు తెలంగాణలో పటేల్‌ సైన్యం చేతిలో హతులయ్యారు. నిజాం సైన్యం చేతిలో పదులు, వందల సంఖ్యలో కమ్యూనిస్టు నాయకులు/కార్యకర్తలు చనిపోతే అదే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో ఒకవైపు వేలాది ముస్లింలు మరఠ్వాడా, హైదరాబాద్‌`కర్నాటక ప్రాంతాల్లో హతమయితే, మూడు వేలకు పైగా తెలంగాణ సాయుధ పోరాటవీరులు అమరులయ్యారు. ఇంతమందిని చంపి బలవంతంగా కైవసం చేసుకున్న హైదరాబాద్‌పై పోలీసుచర్య ఆక్షణంలో ‘లోకకళ్యాణం’ కోసం జరిగిందనే అభిప్రాయం కలిగి వుండవచ్చు.

అయితే దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే హైదరాబాద్‌పై పోలీసుచర్య ఒక్క రాజ్యాధినేత ఉస్మాన్‌అలీఖాన్‌ని మాత్రమే మార్చింది. (ఇది కూడా పూర్తి నిజం కాదు. ఎందుకంటే 1956 వరకు హైదరాబాద్‌ రాష్ట్ర రాజ్‌ ప్రముఖ్‌ ఉస్మానలీఖానే) నిజానికి మిలిటరీ, ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వ పాలనను కొనసాగించింది. ప్రజలకు ఏమాత్రం సంబంధం లేని అధికారుల్ని రుద్దింది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో వెల్లోడి లాంటి అధికారులు ముఖ్యమంత్రులుగా చలామణి అయ్యారు. రజాకార్ల అణచివేత పేరిట వేలాది మంది కమ్యూనిస్టుల ప్రాణాలను హరించిన జె.ఎన్‌.చౌదరి సైన్యం హీరోలుగా వెలిగిపోయారు. ఇంత విషాదం దాగి ఉన్న హైదరాబాద్‌పై పోలీసుచర్యపై ఇప్పటికీ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, మరాఠీ భాషల్లో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే పోలీసుచర్య, రజాకార్లపై 1948`56ల కాలంలో చేసిన వ్యాఖ్యానంలో కొన్ని ఖాళీలున్నాయి. కొన్ని మార్పులున్నాయి. మరి కొన్ని చేర్పులున్నాయి. ఇవన్నీ మేళవించి ఆలోచిస్తే గానీ అసలు విషయం అర్థం కాదు. ఇట్లా కొత్త సమాచారం అందుబాటులోకి రావడం మూలంగా భాస్కరభట్ల కృష్ణారావు వ్యక్తపరచిన అభిప్రాయాల్లో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించే పని ఇప్పుడు జరుగుతోంది.

60 యేండ్ల కాలంలో రజాకార్ల విషయమై ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా దొరలు, దేశ్‌ముఖ్‌లు, దళిత, బీసీలు కూడా ఉన్నారనే విషయం రూఢీ అయింది. ముస్లిం మతంలోకి మారిన వారు కూడా చాలామంది దళితులే అనే విషయం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రజాకార్ల అణచివేత పేరిట వేలాదిమందిని భారతసైన్యం ఊచకోత కోసిందనే విషయం ప్రభుత్వం నియమించిన కమిటీలే నిర్ధారించాయి. అంతేగాకుండా హిందూత్వవాదులు ప్రచారం చేసినట్లుగా ఈ రజాకార్లకు నిజాం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందేది కాదు. అందువల్లనే వాళ్ళు నవలలోని పద్మ తండ్రి దేశ్‌ముఖ్‌ ఆంజనేయుల్ని కూడా డబ్బులివ్వమని డిమాండ్‌ చేస్తారు.

అలాగే సిగరెట్‌ ఫ్యాక్టరీ మేనేజర్‌ రషీద్‌ని కూడా డబ్బులు డిమాండ్‌ చేస్తారు. అంతేగాకుండా రుక్మిణిని మత మార్పిడి చేయించాలని కూడా హెచ్చరిస్తారు. దీనికి రషీద్‌ తిరస్కరిస్తూ నేను జాతీయవాదిని రుక్మిణిని మతం మార్చుకొమ్మని చెప్పేది లేదని తెగేసి చెబుతాడు. తెగేసి చెప్పినందుకు గాకుండా అడిగిన డబ్బు ఇవ్వనందుకే ఆగ్రహంతో రజాకార్లు రషీద్‌ని కూడా చంపేస్తారు. అంటే రజాకార్లకు మతంతో సంబంధంలేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. తమ పబ్బం గడుపుకునేందుకే ముస్లింలీగ్‌ రాజకీయాల్ని హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బహద్దూర్‌ యార్‌జంగ్‌ ఇత్తెహాదుల్‌ పార్టీని ఏర్పాటు చేసిండు. ఇట్లాంటి సందర్భంలో మజ్లిస్‌పార్టీ, మతతత్వాన్ని బాహాటంగా ప్రచారం చేసిన కాసిం రజ్వీ చర్యల్ని తప్పకుండా ఖండిరచాల్సిందే. అయితే ఇక్కడ ముస్లింలందరూ కాసిం రజ్వీ అనుచరులే అన్న రీతిలో ఇప్పటికీ కొన్ని సంస్థలు, పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాటిని అడ్డుకోవాలంటే లేదా వారి ఆలోచనల్లోని డొల్ల తనాన్ని బయటపెట్టాలంటే ఇందులోని రషీద్‌ పాత్ర, రజాకార్ల చర్యల్ని రెండిటినీ జమిలిగా విశ్లేషించాల్సి ఉంటుంది. నగరానికి జమీందార్లు, దేశ్‌ముఖ్‌ల వలస వారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడం కూడా ఈ న వల ద్వారా మనకు తెలుస్తాయి. వెలమ సామాజిక వర్గం అప్పటికే హైదరాబాద్‌ చేరుకోవడం తమ పిల్లల్ని చదివించడం, వారికి పూర్తి స్వేచ్ఛనివ్వడం కూడా అర్థమవుతుంది.

మీ మాటలు

 1. పసునూరి రవీందర్‌ says:

  “వినేవాళ్లకు చేదుగా ఉన్నా సరే, నిజాలే మాట్లాడు”అన్నాడు హుస్సేన్‌ షావలి.
  ఒక చారిత్రక నవల మీద సరైన విశ్లేషణ చేసిన.. చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ గారికి ధన్యవాదాలు. ఒక మంచి వ్యాసాన్ని అందించిన సారంగ టీంకు కూడా థ్యాంక్స్‌. సామాజిక శాస్ర్తాలు చరిత్ర బాహ్యస్వరూపాన్ని అర్థం చేయిస్తే, సాహిత్యం మాత్రమే దాని అంతఃస్వరూపాన్ని అర్థం చేయిస్తుందనేందుకు ఈ ‘యుగ సంధి’ నవలే ఒక నిదర్శనం. చరిత్ర వ్యాఖ్యానాల విషయంలో ఇప్పటికీ వివాదాలు లేకపోలేదు. తెలంగాణ సాయుధ పోరాట సాహిత్యం అనగానే ప్రజలమనిషి, చిల్లరదేవుళ్లు వంటి నవల పేర్లు మాత్రమే ఒకమేరకు వినిపించాయి. కానీ, ఈ యుగ సంధి నవల గురించి తొలిసారిగా వింటుంటే మిగిలిన ప్రాంతాల సృజనకారులకు ఎలా ఉన్నా తెలంగాణ ప్రాంత ప్రజలకు మాత్రం తమ చరిత్రను తాము తెలుసుకుంటున్న అనుభూతి మాత్రం కలుగకపోదు. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంతో పాటు, తెలంగాణేతరులకు కూడా ఈ చరిత్ర పట్ల అనేక తప్పుడు అవగాహనలున్నాయి. నిజాం అనగానే కౄరుడని, రజాకార్లంటే ముస్లింలని, భారతసైన్యం జరిపిన పోలీసు చర్య ద్వార మాత్రమే తెలంగాణ విముక్తి అయి మేలు జరిగిందని భావించే వాళ్లకు లెక్కే లేదు. ఇప్పటిదాకా రికార్డు అయినా తెలంగాణ చరిత్ర చాలావరకు అగ్రవర్ణ కమ్యూనిస్టు దృక్పథం నుండి, మరికొంత తెలంగాణేతరుల నుండి జరిగింది. దీంతో తెలంగాణ సాయుధ పోరాటమంటే రెడ్లతో మొదలై, రెడ్లతో ముగిసినట్టుగా కనిపిస్తది. అందువల్లనే మెజారిటీగా ఉన్న ఎస్సీఎస్టీబీసీమైనారిటీలు చేసిన త్యాగాలకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది. ఇది అత్యంత సహజం కూడా. ఎందుకంటే చరిత్రను లిఖించేవాళ్ల దృక్కోణం నుంచి మాత్రమే నమోదు అవుతుంది. ఇప్పటికైనా వాస్తవాల నుండి చరిత్ర పునర్మూల్యంకణం జరగాలి. అందుకోసం ఇలాంటి నవలలే కీలక ఆధారం అవుతాయి. ఈ యుగసంధి నవలను పునర్ముద్రిస్తే విలువైన చరిత్రను బతికించినట్లవుతుంది.
  అయితే ఈ నవల మీద సంగిశెట్టి గారు చేసిన విమర్శ చదువుతుంటే కొన్ని సందేహాలు కలిగాయి. ఈ నవలను ఇప్పటివరకు వెలుగులోకి రాకుండా చేసిందెవరు? తెలుగు సాహిత్యచరిత్రలో ఎందుకని తెలంగాణ ప్రాంత సాహిత్యం కనీస స్పర్శకు నోచుకోలేదు? తెలంగాణ సాహిత్యానికీ ఇప్పటికీ కేటాయిస్తున్న స్పేస్‌ ఎంత? అరవయేండ్ల ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తెలంగాణ ప్రాంత సాహిత్యానికి జరిగిన అన్యాయం మీద కూడా ఇలాంటి విశ్లేషణలు జరగాలి. ఇప్పటికీ జరుగుతున్న అన్యాయం మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆధిపత్యాల కోటలు కూలనంత కాలం, సాహిత్యం వికసించదు. సాహిత్యంలో కూడా ప్రజాస్వామిక వాతావరణం నెలకొనాలంటే ఈ దిశగా చర్చ జరగాలి.
  -పసునూరి రవీందర్‌

 2. పసునూరి రవీందర్‌ says:

  సూపర్ అన్న చాల బాగుంది… సుందర్….

 3. సంగిశెట్టి శ్రీనివాస్‌ వ్యాసం,
  పసునూరి రవీందర్‌ స్పందన
  రెండూ చాల బాగున్నాయి..
  నిజంగానే ఈ విషయాల మీద
  ఎంతో చర్చ జరగవలసి ఉంది..
  చరిత్రను పునర్లిఖించవలసి ఉంది..
  సామాన్యులందరి మెదళ్ళను ఆక్రమించిన అబద్ధపు ప్రచారాలను సరిచేయడం గురించి ఆలోచిస్తేనే భయం వేస్తోంది..
  ఇదంతా ఎప్పటికి జరిగేను? ఈ లోగా, ఇప్పటికే జరిగిన నష్టానికి
  ఎవరు బాధ్యత వహిస్తారు? నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు?
  నేరస్తులను ఎలా, ఎవరు నిర్ధారిస్తారు?
  బాధగా ఉంది సంఘిశెట్టి అన్నా..!

 4. Chennuri Sudarshan says:

  యింత వరకు మన తెలంగాణ విజ్ఞాన సంపద గూర్చే నాకు తెలియదు. మన సంగిశెట్టి శ్రీనివాస్ చేసిన అపూర్వ కృషితో మరుగున బడ్డ మన సాహిత్య సంపద వెలుగులోకి రావడం శ్లాఘనీయం.

  ‘యుగ సంధి’తో బాటుగా తదితర నవలలు దొరికే చోటు చెబితే బాగుంటుందని నా అభి ప్రాయము.

  యిలాంటి వ్యాసాలను తెర పైకి తీసుకొచ్చినందులకు సారంగ సంపాదక బృందానికి కృతజ్ఞతలు.

 5. veldandi Sridhar says:

  ఒకప్పుడు ఎంతో దివ్యంగా వెలిగిన తెలంగాణా సాహిత్య భవంతి కొంత మంది కుట్రదారుల వల్ల అసలు గుడిసె కూడా లేనట్టు చరిత్రలో ఖాళీలు. ఒక్కో ఇటుకనే మళ్ళీ చేర్చి తెలంగాణా సాహత్య సౌదాన్ని నిర్మిస్తున్న సంగిశెట్టి గారికి అభినందనలు. సో కాల్డ్ ప్రేమ ఇతివృత్తాలతో నిండిన నవలలకు సాహిత్య చరిత్ర లో పెద్ద పీఠ వేసి “యుగసంధి” లాంటి జీవిత సంఘర్షణను చిత్రించిన నవలలకు స్తానం లేక పోవడం ఆచ్చర్యం కలిగిస్తుంది. ఇప్పుడున్న సాహిత్య చరిత్రల్ని కూలదోసి మళ్ళీ కొత్త చరిత్రల్ని రాయాల్సిన మూలమలుపులో ఉన్నాం. అందరం మెలకువతో ఉండాల్సిన సందర్భంలో ఉన్నాం.

  వెల్దండి శ్రీధర్

మీ మాటలు

*