చీర చెప్పిన కథ!

bhuvanachandra“నిజంగా మీ పేరు బయటికి రానీను… కానీ… నిజం మాత్రమే చెప్పాలి.. సరేనా?”

“అలాగే.. నేను పుట్టిన వూరు ‘క’తో మొదలవుతుంది. బాగా ధనవంతులం కాదుగానీ ఏదడిగినా ‘లేదు’ అనకుండా మా అమ్మానాన్న పెంచారు.. గొప్పగానే పెరిగాను. ఓ క్షణం మౌనంగా వుండిపోయింది కమల.

” ఊ.. తరవాత?” అడిగాను.

“9thలో పెద్దమనిషినయ్యాను. అప్పటిదాకా నా గురించి నేనేం పట్టించుకోలేదనే చెప్పాలి. పెద్దమనిషి అయ్యాకే మొట్టమొదటిసారి నేను ‘అందగత్తె’నని నాకు తెల్సింది… నాకే కాదు మా ఊరందరికీ కూడా తెలిసింది..” నవ్వింది.

ఆ నవ్వులో ఓ నిర్లిప్తత వుంది. నేను మౌనంగా కూర్చున్నా.

” ఓ మాట చెప్పనా.. తను అందగత్తెనని ఆడదానికి ఎప్పుడు తెలుస్తుందో అప్పటినించే మనసు వెర్రితలలు వేస్తుంది. దానికి నేనే ఉదాహరణ. చదువుమీద నాకు తెలీకుండానే శ్రద్ధ తగ్గింది. అప్పటిదాకా అసలు పేరే తెలియని క్రీములూ, పౌడర్లు, నెయిల్ పాలిష్‌లూ వాడటం మొదలుపెట్టి ఎవరు నా వంక మళ్ళీ మళ్ళీ తిరిగి చూస్తున్నా పొంగిపోయేదాన్ని!” మళ్ళీ నవ్వింది. ఆ నవ్వులో ‘గతపు’ కమల ప్రతిఫలించింది.

“అలాంటి అలంకార సామగ్రి అందరూ వాడేదేగా.. అలాగే ఏ ఆడపిల్ల ఐనా అందంగా వుంటే జనాలు వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ చూడటం ఆ పిల్ల పొంగిపోవటమూ సహజమేగా?” మామూలుగా అన్నాను.

“మీరొకటి మర్చిపోతున్నారు.. అప్పటి నా వయసు గురించీ, ఆ వయసులో కలిగే భావాల గురించి ఆలోచించండి. నేను ఏ స్టేజికి చేరుకున్నానంటే ఏ కుర్రాడైనా నా వంక చూడకపోతే అది ప్రెస్టీజ్‌గా తీసుకుని , ఎలాగైనా వాళ్ల అటెన్షన్ నా మీద పడేట్టు చేసుకునేదాన్ని. అప్పటికిగానీ నా ‘ఈగో’ చల్లారేది గాదు!”

పరీక్షగా ఆమె వంక చూశా. ఆ కన్ను ముక్కు తీరూ, ఆ పెదవుల వొంపూ, శరీరాకృతీ చూస్తే ఇప్పటికీ అంటే యీ వయసుకీ ఆమె అందంగానే వుందని చెప్పుకోవాలి. నలభై దాటాయి గనక శరీరం వొడలటం, అందం అలవటం తెలుస్తోంది. అలిసిపోయినా అందం అందమేగా. “కాలేజీ కొచ్చేసరికి నా శరీరాకృతి ఎంత అందంగా తయారైందో, నా మనసు అంతకన్నా ఎక్కువ అహంభావంతో నిండిపోయింది. డబ్బుకి పెద్దగా లోటు లేదు గనక నన్ను పొగిడే స్నేహితురాళ్ళనే చుట్టూ వుంచుకునేదాన్ని. వాళ్లకీ సరదాలు వుండేవి గనక నేను ఎక్కడికెళ్తే అక్కడికి నాతో వచ్చేవాళ్ళు…!”

“ఊ…”

“అప్పుడు పరిచయమైనవాడే మధు. చదువులో మా కాలేజీలోనే బెస్ట్. చదువుతున్నది డిగ్రీ అయినా అపారమైన తెలివితేటలుండేవి.

మా కాలేజీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో చెప్పగలిగినవాడు అతనొక్కడే. అంతే కాదు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టించుకోనివాడు అతనొక్కడే!”

“తరవాత?”

“కాలేజీ యానివర్సరీ ఫంక్షన్‌లో ఓ నాటకం వెయ్యాల్సి వచ్చింది. దాన్ని సులభమైన వ్యావహారిక భాష లో రాసిందీ, డైరెక్ట్ చేసిందీ కూడా మధునే.శకుంతలగా నన్ను వెయ్యమన్నారు. మధు దుష్యంతుడుగా వేస్తేనే నేను వేషం వేస్తాననీ లేకపోతే వెయ్యననీ పంతం పట్టాను.!” అన్నది కమల. ఆమె చూపులు ఎక్కడో వున్నాయి. నాకు నవ్వొచ్చింది.

“కమలా.. యీ ఇన్సిడెంట్ మాత్రం కొంచెం సినిమాటిక్‌గా ఉంది సుమా!” అన్నాను.

“సినిమా జీవితం కాకపోవచ్చుగానీ, జీవితం మాత్రం సినిమాలాంటిదే కవిగారు!” ఆమె గొంతులో కొంచెం కోపం.

” ఆ విషయం ప్రస్తుతానికి వొదిలేద్దాం. సరేనా.. సారీ. ఇప్పుడు చెప్పండి. మధుగారు దుష్యంతుడుగా వేశారా?”

“పంతం పట్టానన్నాగా. వెయ్యకుండా ఎలా ఉంటాడూ? ఆ సందర్భాన్ని ‘చనువు’గా మలుచుకున్నాను. అప్పుడే ఓ సంఘటన నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసింది!” నిట్టూర్చింది.

” ఏ సంఘటన?”

” ‘ము’గారు మీకు తెలుసుగా.. ది గ్రేట్ హీరో. ఆయన మా కాలేజీ పూర్వ విద్యార్థి కావటంతో ఆయన్నీ యానివర్సరీకి ఆహ్వానించారు. మా శకుంతల నాటకం చూసి నా అందమూ, నటనా, ఆ నాటకానికే ఓ ‘వన్నె’ తెచ్చాయనీ, నేను ఫిలిం ఫీల్డులోకి వస్తే చిత్ర పరిశ్రమ నన్ను చేతులు జాచి ఆహ్వానిస్తుందని అన్నారు. ఆ పొగడ్తలకి నేను పూర్తిగా ‘ఫ్లాట్’ అయిపోయాను. అంతేగాదు మధులో గొప్ప రచయిత వున్నాడనీ, అతను సినిమాల్లోకొస్తే ఆత్రేయగారంత పేరు తెచ్చుకొనగలడనీ కూడా అన్నారు.” ఓ క్షణం మళ్ళీ మౌనం మౌనంగా నర్తించింది.

“తరవాత?”

“మధూది దిగువ మధ్య తరగతి ఫేమిలీ. రెస్పాన్సిబిలిటీసూ ఎక్కువే. కానీ నేను పెంచుకున్న ‘చనువు’తో అతనిలో ఓ కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. మావాళ్ళు సాంప్రదాయాల్ని బాగా పాటిస్తారు. నేను నాటకంలో వేషం వెయ్యడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. అందుకే పెళ్ళి సంబంధాలు చూడటం మొదలెట్టారు. కానీ అప్పటికే నేను ‘హీరోయిన్’ కావాలని ఫిక్సైపోయా. బలవంతాన మధూని ఒప్పించి చాలా డబ్బు, నగలతో మద్రాసు పారిపోయా…!”

“ఓహ్..! సామాన్యంగా ఇలాంటి పని మగవాళ్లు చేస్తారు.”

“ఆశకి మగా, ఆడా తేడా లేదు కవిగారూ. టి నగర్. ఆనందన్ స్త్రీట్‌లో ఒక సింగిల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తీసుకున్నాం. మీకు నేను గుర్తుండకపోవచ్చుగానీ, మీ మొదటి సినిమా ‘నాకూ పెళ్ళాం కావాలి’ ప్రొడక్షన్ ఆఫీసూ అదే స్ట్రీట్‌లో ఉండేదిగా? చాలా సార్లు మిమ్మల్ని చూశాను. మీ ఆఫీసులోనూ వేషం కోసం ప్రయత్నించా!” నవ్వింది కమల.

“నిజంగా? గాడ్… నాకు తెలీనే తెలీదే!” ఆశ్చర్యపోయాను.

“ఆశ్చర్యం ఎందుకూ? అందరూ మీలాంటి అదృష్టవంతులు కారుగా. సరే, మాట ఇచ్చాడు గనక మధు వచ్చాడు గానీ, అతనికి ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఇష్టం లేకపోయింది. మూడు నెలలు కలిసి ఒకే బెడ్‌రూం ఫ్లాట్‌లో వున్నా అతను నన్ను కనీసం ‘టచ్’ కూడా చెయ్యలేదంటే నమ్ముతారా?”

“నమ్ముతా.. ఎందుకంటే పెళ్ళి చేసుకుని కూడా దశాబ్దాల పాటు ఒకేచోట వున్నా ప్రేమకి తప్ప శరీరాకర్షణకి లోబడని ‘జంట’ నాకు తెలుసు. వారి జీవితం జగద్విదితం..!”

“నాకే జాలేసి అతన్ని వెళ్ళిపొమ్మన్నా.. మరో ‘పైకి రాగలడనుకున్న’ యువకుడ్ని నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నాను. ఓ రోజు రంగరాజపురం రోడ్డులో ‘ము’గారు కనిపిస్తే ‘గతం’ గుర్తు చేసి ఏమన్నా వేషం ఇప్పిస్తారేమోనని అడిగా. చిత్రమేమిటంటే ఆయనకి శకుంతల గుర్తుందేమోగాని ఆ వేషం వేసిన ‘కమల’ గుర్తులేదు. పైగా, “చూడమ్మా..అనేక ఫంక్షన్స్‌కి పిలుస్తారు. కొన్నిటికి వెళ్ళక తప్పదు. నీ విషయమే తీసుకో. ‘స్టేజీ’ మీద నువ్వు బాగా చేసి వుండొచ్చు. ఓ ‘మాదిరి’గా చేసినా మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం మేము మెచ్చుకుంటాం. దాన్నే ఓ ‘డిగ్రీ’ గా భావించి ఇలా వచ్చేస్తే ఎలా? హాయిగా ఇంటికెళ్ళి పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో వుండు” అని ఓ సలహా పారేసి తన దారిన తాను పోయారు!” సుదీర్ఘంగా నిట్టూర్చింది

కమల.

“ప్రస్తుతం పరిస్థితి ఏమిటి?”

“నేను ‘లేచిపోయానని’ మావాళ్లు మా వూళ్ళో తలెత్తుకోలేక వున్నవన్నీ అమ్మేసి ఇప్పుడు ‘బళ్ళారి’ దగ్గర ఓ విలేజ్‌లో వుంటున్నారు. నేను వెళ్ళినా నా మొహం చూడరని నాకు తెల్సు. అలాగే ఎవరు ‘పైకి’ వస్తాడని భావించి నా లివింగ్ పార్ట్‌నర్‌గా చేసుకున్నానో అతను నిజంగా పైకి వచ్చాడు. హీరోగా కూడా చేశాడు. పేరు ‘ర’ తో మొదలవుతుంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చాలా విభాగాల్లో చాలా వ్యాపారాలు చేస్తున్నాడు.

“ఊ.. అతను మిమ్మల్ని ఎంకరేజ్ చేయ్యలేదా?” అడిగాను.

“నా నగలన్నీ అయిపోయేవరకూ ‘ఎంకరేజ్’ చేస్తూనే వున్నాడు. అతనికి మరో ‘నిచ్చెన’ దొరగ్గానే నన్నొదిలేసి అక్కడ చేరాడు. అయితే ‘ఆమె’ చాలా టఫ్. ఇప్పుడు అతని భార్యా, అతని పిల్లలకు తల్లి ఆవిడే!” నవ్వింది . ఆ నవ్వులో సంతోషము లేదు. దుఖము లేదు.

“ఫ్యూచర్ సంగతి ఏమిటి?” అడిగా.

“నిజం చెబితే నా వయసిప్పుడు నలభై ఆరేళ్ళు. అందరికీ నలభై అని చెపుతున్నాననుకోండి…. ! ఒక్క సంవత్సరం ఓపిక పట్టి నా డిగ్రీ పూర్తి చేసి వుంటే నా జీవితం మరోలా వుండేది. ఎక్కడో చదివా.. “ఎంత ముందుకొచ్చావంటే వెనక్కి తిరిగి వెళ్లలేనంత. వెళ్లినా ఎక్కడ్నించి పయనం మొదలైందో అక్కడికి చేరలేనంత!” అని . సో. ఫ్యూచర్ గురించి ఆలోచనే లేదు. ఊ..! చదువు కొద్దో గొప్పో వున్నది గనక నా జీవితాన్ని ఓ పుస్తకంగా అంటే ఓ బుల్లినటి ఆత్మకథగా తీసుకురావాలని వుంది. తేవొచ్చా?” నవ్వింది .

“ఎందుకు తేకూడదు?”

“ఆత్మకథలు గొప్పవాళ్లకేగా!. వాళ్ల జీవితాలైతే అందరూ చదువుతారు. నాలాంటివాళ్ల జీవితకథలు ఎవరు చదువుతారు ?”

“కమలగారూ.. నిజం చెప్పనా… ఆకాశాన్ని ఆక్రమించిన చెట్టుకైనా వేళ్ళు భూమిలోకే ఉంటాయి . ఆకులూ, కొమ్మలూ కాదు ఆత్మకథంటే.. ఆ చెట్టుకి పునాది అయిన వేళ్ళ కథలు. ఆ ‘వేళ్ళ’ కథలు చెట్టు చెబితేనే గానీ తెలీదు. కొమ్మల్ని బట్టి, కాండాన్ని బట్టి చెట్టు వయసునీ, గొప్పతనాన్నీ వూహించవచ్చు. కానీ ఎన్ని పురుగులు తల్లి వేరుని, మిగతా వేళ్లనీ కొరికాయో, కొరికే ప్రయత్నం చేశాయో ఆ చెట్టుకి తప్ప ఎవరికీ తెలీదుగా! తప్పక రాయండి. ఒట్టేసి చెబుతున్నా. మీ ‘స్క్రిప్టు’ మొదట నేను చదువుతా!” సిన్సియర్‌గా అన్నాను.

“వేరు పురుగుల గురించేగా రాయాల్సింది. అదీ తప్పే. నాకు ఇష్టం లేకుండా ఏదీ జరగలేదు. ఏ తప్పు జరిగినా నాకు తెలిసే జరిగింది. అందుకే నేనెవరినీ నిందించాలని అనుకోవట్లా. కానీ, జరిగింది జరిగినట్లు మాత్రం రాస్తాను.”

“గుడ్. నిజాన్ని నిజంగా వ్రాయగలగడం అంత కష్టం మరొకటి ఉండదు. చాలా ధైర్యం కావాలి!”

“అది వుంది లెండి. ఇంతకీ నేను వ్రాయబోయే కథలపేరు తెలుసా?”నవ్వింది. ఆ నవ్వులో చిన్న చిలిపిదనం దోబూచులాడింది.

“చెప్పండి!” ఉత్సాహంగా అన్నాను.

“చీర చెప్పిన కథలు!” పకపకా నవ్వింది.

 

*******************************************

 

అయ్యా… కమల ఇంకా మద్రాసులోనే ఉంది. ‘మధు’ ప్రస్తుతం ఓ గొప్ప కాలేజీలో లెక్చరర్‌గా ఉంటూ ఆ జాబ్ వదిలేసి ఆస్త్రేలియా వెళ్లాడట. ‘ది అన్‌టోల్ద్ స్టోరీస్’లో ఉన్న వ్యక్తులందరూ ప్రస్తుతం మన మధ్య వున్నవాళ్ళే. కొంతమంది ‘పర్మిషన్’ ఇస్తామన్నారు. ఇస్తే వారి ఫోటోల్ని, సెల్ నంబర్స్‌ని కూడా ప్రచురించడం జరుగుతుంది. బహుశా ఈ శీర్షిక మీకు నచ్చవొచ్చనే అనుకుంటున్నాను. వీలున్నంతవరకూ ‘చీకటి’ వ్యవహారాల్ని ‘రాత’లోనే ‘ఎడిట్’ చేశానని మనవి చేస్తూ (పేర్లు మార్చానని చెప్పక్కర్లేదుగా)…

మీ భువనచంద్ర…

మీ మాటలు

 1. డా. మూర్తి జొన్నలగెడ్డ says:

  సినీ దీపపు మ౦టల్లో మాడి పోయిన శలభాల గురి౦చిన కధలు ఎ౦దుకో మరి, ఎన్ని చదివినా ఆసక్తి గానే ఉ౦టాయి. బహుశా అవన్నీ చదివేసి, ఆ తప్పులేవీ చెయ్యకు౦డా ఆ మ౦టల్లో వెలగాలనీ, చలి కాచుకోవాలనీ ఆశా జీవులు భావి౦చడ౦ ఒక కారణ౦ కావచ్చు. గుప్పెట్లో ఏవు౦దో తెలిసి పోతే ఒక్కోసారి ఆసక్తి తగ్గచ్చు కాబట్టి చెప్పీ చెప్పకు౦డా చెప్పడ౦ అన్న మీ ఎత్తుగడ బావు౦ది.

  • Bhuvanachandra says:

   థాంక్ యు రమణ గారూ …..ఈ కధలన్నీ పచ్చి నిజాలే …..వీరంతా నాతొ పరిచయం ఉన్నవారే … వారి అనుమతి తోనే రాస్తున్నాను

  • Bhuvanachandra says:

   అబ్బాయ్ …చదివి అభిప్రాయం రాసినందుకు ధన్యవాదాలు …..

 2. ramana baalantrapu says:

  నిజమే…ఇలాంటి చాలా ఆసక్తిగారంగానే ఉంటాయి. అందునా భువనచంద్ర గారి లాంటి అనుభవఙ్ఞులూ, చెయ్యి తిరిగిన రచయిత కలం నుండి జాలువారితే ఇక చెప్పేదేముంది. అభాగ్యులు, దైవోపహతులు, స్వయం కృతాపరాథుల జీవితాలు కొంతమంది జీవిత పథాలనైనా సరియైన మార్గంలోకి మళ్ళించ గలిగితే సార్థకత చేకూరినట్లే.
  ఓం అసతోమా సద్గమయ
  తమసోమా జ్యోతిర్గమయ
  మృత్యోర్మా అమృతం గమయ
  ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః
  భవదీయుడు
  రమణ బాలాంత్రపు
  యెమెన్ దేశం

 3. Guruji need more stories.

మీ మాటలు

*